- ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్
- పండుగ వాతావరణంలో మెగా పీటీఎం నిర్వహణ
- చాగంటి సూచనల మేరకు నైతిక విలువలపై పాఠ్యాంశాలు
- టెన్త్‌లో మెరుగైన ఫలితాలకు 100 రోజుల ప్రణాళిక
- పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యపై సమీక్షలో మంత్రి లోకేష్
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం, విద్యాప్రమాణాల మెరుగుదల కోసం రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… పదోతరగతి పూర్తిచేసిన పేద విద్యార్థుల్లో డ్రాపౌట్స్ ఎక్కువగా ఉంటున్నారన్నారు. ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించడం ద్వారా డ్రాపౌట్స్‌ను కొంతమేర తగ్గించే అవకాశం ఉందని చెప్పారు.
ఇంటర్మీడియట్లో వెనుకబడిన విద్యార్థులకు క్వచ్చన్ బ్యాంక్ అందించాలని సూచించారు. ‘సంకల్ప్’ ద్వారా నిర్వహించే ఇంటర్ విద్యార్థుల ఎసెస్మెంట్ ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారిని మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఆయా కళాశాలల లెక్చరర్లు, సిబ్బందిని కేర్ టేకర్స్‌గా నియమించాలని నిర్ణయించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బాగా దెబ్బతిన్న భవనాలకు ఇతర ప్రాంతాల్లో అవసరమైన మరమ్మతులు చేపట్టాలని మంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిసెంబర్ 7వతేదీన నిర్వహించే మెగా పేరెంట్-టీచర్ సమావేశాలను (పీటీఎం) పండుగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి లోకేష్ సూచించారు. మంత్రులు, శాసనసభ్యులు వారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో జరిగే మెగా పీటీఎం సమావేశాలకు హాజరు కావాలన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పార్టీ జెండాలు, హంగు, ఆర్భాటాలకు తావీయవద్దని స్పష్టం చేశారు. బాపట్ల ప్రభుత్వ హైస్కూలులో నిర్వహించే మెగా పీటీఎం కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితోపాటు తాను కూడా హాజరుకానున్ననట్లు మంత్రి లోకేష్ చెప్పారు.
18 అంశాలు ప్రామాణికంగా రేటింగ్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల మెరుగుదల, మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన లక్ష్యంగా స్టార్ రేటింగ్ ఇవ్వాలని సమావేశంలో నిర్వహించారు. ఇందుకోసం 18 అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత మెరుగుపర్చేందుకు 100 రోజుల ప్రణాళికను అమలు చేయాలని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కెేజీ టు పీజీ కరిక్యులమ్ ప్రక్షాళనపై సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించే పాఠ్యాంశాల కోసం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సలహాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థుల్లో లైఫ్ స్కిల్స్, సామాజిక బాధ్యత పెంపొందించేలా పాఠ్యాంశాలు రూపొందించాలన్నారు. ముఖ్యంగా చిన్నతనం నుంచే బాలలు, బాలికలు సమానమేనన్న భావన కలిగించేలా లింగ సమానత్వం, సివిక్ సెన్స్‌పై అవగాహన పెంచాలని తెలిపారు.
విద్యార్థులకు జపనీస్ మోడల్ లైఫ్ స్కిల్స్‌ను అలవర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల విద్యకు గొడ్డలిపెట్టులా గత ప్రభుత్వం తెచ్చిన జీఓ 117ను రద్దుచేయాలని నిర్ణయించిన నేపథ్యంలో మెరుగైన విధానం అమలుకు గ్రామస్థాయిలో అభిప్రాయ సేకరణ జరపాలని, ఈ సమావేశాలకు స్కూలు మేనేజ్మెంట్ కమిటీలను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. స్కూలు మైదానాల్లో జాబ్ మేళాలకు మినహా ఎటువంటి కార్యకలాపాల నిర్వహణకు అనుమతి ఇవ్వరాదని మంత్రి స్పష్టంచేశారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, కమిషనర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు.