- మెరుగైన సేవల కోసం నేరుగా లబ్ధిదారుల నుంచి అభిప్రాయ సేకరణ
- ఐవీఆర్ఎస్ విధానం విస్తృతంగా వినియోగం
- ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం
- ఏ అంశంపైనైనా ప్రజలు చెప్పిందే ఫైనల్ అంటున్న సీఎం
- నాణ్యమైన సేవల కోసం అభిప్రాయాలు నిజాయితీగా చెప్పాలని ప్రజలకు విన్నపం
అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, చేపట్టే కార్యక్రమాలు, తీసుకునే నిర్ణయాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, దాని ప్రకారం ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరింత మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రజల అభిప్రాయాల మేరకు నడుచుకోవాలనుకుంటోంది. ఇందులో భాగంగా ఇకపై ప్రభుత్వం అమలు చేసే పథకాలపై ఐవీఆర్ఎస్ (ఇంటర్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ఫోన్లు చేయడం ద్వారా ఆయా కార్యక్రమాల అమలు తీరుపై ప్రజల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకోనుంది. లబ్ధిదారులకే నేరుగా కంప్యూటర్ బేస్డ్ ఫోన్ కాల్స్ చేయటం ద్వారా.. ఆ పథకం వల్ల పొందుతున్న ప్రయోజనం, దాని అమలు, సేవల్లో నాణ్యత వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోనుంది. ఆయా పథకాల అమలు తీరుపై లబ్ధిదారుల అభిప్రాయం తెలపాలని కోరుతూ ఐవీఆర్ఎస్ కాల్స్ వెళతాయి. వాటిపై ప్రజలు ఇచ్చే రేటింగ్ ఆధారంగా మార్పులు, చేర్పులు చేసుకుని ప్రభుత్వం పని చేయనుంది. ఇంటింటికీ పింఛన్లు, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి పథకాల లబ్ధిదారుల నుంచి ఈ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. పింఛను సక్రమంగా ఇంటి వద్దనే అందుతుందా లేదా…..దీపం పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వంటి ప్రశ్నల ద్వారా లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.
పౌర సేవలపైనా..
పథకాలతో పాటు ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పాలసీల అమలుపైనా ప్రజాభిప్రాయం తెలుసుకోనున్నారు. ఉచిత ఇసుక విధానం అమలు, మద్యం కొత్త పాలసీ, అమ్మకాలపైనా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. పథకాలు, కార్యక్రమాలతో పాటు రానున్న రోజుల్లో రెవెన్యూ, మునిసిపల్, విద్యుత్ వంటి పలు కీలక శాఖల్లో ప్రజలు పొందుతున్న పౌరసేవలపై కూడా ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి సమాచారం సేకరించనున్నారు. ప్రజల నుంచి నేరుగా వచ్చే ఈ సమాచారంలో వారు ఎక్కడైనా అసంతృప్తి వ్యక్తం చేస్తే..వాటికి గల కారణాలు విశ్లేషించి సేవలను మరింత మెరుగుపరచనున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల్లో కూడా బాధ్యత పెంచి ప్రజలకు మంచి సేవలు అందేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలు చెప్పిందే ఫైనల్ అనే ప్రాతిపదికన ప్రభుత్వం పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ఇలా ప్రభుత్వం నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌కు ప్రజలు ఓపిగ్గా తమ అభిప్రాయాలు చెప్పాలని ముఖ్యమంత్రి కోరుతున్నారు.
ఈ ఫోన్ కాల్స్‌కు ప్రజలు వెచ్చించే ఒకటి రెండు నిముషాల సమయంతో ప్రభుత్వ నుంచి మరింత మెరుగైన సేవలు పొందే అవకాశం ఉంటుందనేది సీఎం చంద్రబాబు ఆలోచన. దీనికి ప్రజలు తమ వంతుగా సహకరించాలని…మంచి పాలనకు, ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెంచే క్రతువులో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కోరుతున్నారు. ఐవీఆర్ఎస్ విధానం ద్వారా వచ్చే కచ్చితమైన అభిప్రాయాల ద్వారా గతంలో మంచి ఫలితాలు సాధించిన సందర్భాలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల ఖరారు విషయంలో చంద్రబాబు ఇదే విధానాన్ని పాటించారు. అలాగే విజయవాడ వరదల సమయంలో ప్రజలకు ప్రభుత్వం నుంచి అందే సాయంపైనా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా సమాచారం తీసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో దీన్ని విరివిగా వాడేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.