- గత పాలకులు కాకినాడ పోర్టును బియ్యం స్మగ్లింగ్ డెన్‌గా మార్చారు
- దేశ భద్రతనూ రిస్క్‌లో పెట్టారు
- దందాకు రాష్ట్రవ్యాప్తంగా భారీ నెట్వర్క్
- దీనికోసమే రేషన్ డోర్ డెలివరీ వ్యాన్లు తెచ్చారు
- కాకినాడ సీ పోర్టులో 41.12 శాతం వాటా ఎలా దక్కించుకున్నారో తెలియాలి
- కాకినాడ పోర్టుపై ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలి
- మీడియాతో మంత్రి నాదెండ్ల మనోహర్
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో గత ఐదేళ్లపాటు బియ్యం మాఫియా రెచ్చిపోయిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. విజయవాడ నోవాటెల్ హోటల్లో ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బియ్యం మాఫియా తమ స్వలాభం కోసం దేశ భద్రతను సైతం పణంగా పెట్టిందన్నారు. కాకినాడ పోర్టుకు చెడ్డపేరు తీసుకురావడంతోపాటు దానిని స్మగ్లింగ్ డెన్‌గా మార్చేసిందన్నారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు భారీ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుని కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిందన్నారు. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఒక్క కాకినాడ పోర్టు నుంచే రూ.48,537 కోట్లు విలువ చేసే బియ్యం ఎగుమతి అయ్యిందంటే బియ్యం మాఫియా ఏ విధంగా చెలరేగిపోయిందో ప్రజలు అర్థం చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అరబిందో కంపెనీ కోసం కాకినాడ సీపోర్టు యాజమాన్యాన్ని బెదిరించి 41.12 శాతం వాటా రాయించుకున్నారని ఆరోపించారు. అరబిందోకు పార్టనర్ షిప్ ఎలా కట్టపెట్టారో ప్రజలకు తెలపాలన్నారు. ఈ రేషన్ మాఫియాను అరికట్టే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, బియ్యం అక్రమంగా రవాణా చేస్తే పట్టుబడ్డ ఓడను పరిశీలించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సముద్రం లోపలికి వెళ్లారంటే అది ప్రజల కోసమేననీ, పేదల బియ్యం కాపాడాలనే తపనతో తాము పని చేస్తున్నామని వివరించారు. దళారుల వ్యవస్థను కూడా పూర్తిగా అరికడతామని తెలిపారు. ఈ ప్రక్షాళనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పూర్తిగా సహకారం అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రేషన్ అక్రమాలను అరికట్టేలా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు. బియ్యం మాఫియా వెనుక ఎంత పెద్ద శక్తులు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మాఫియాను పూర్తిగా కట్టడి చేస్తామని ఉద్ఘాటించారు.
తొలిరోజు నుంచే..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి తాను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తొలి రోజు నుంచే దాడులు మొదలుపెట్టాను. మొదట నా సొంత నియోజకవర్గం తెనాలిలోని పౌరసరఫరాల శాఖ గోదాంలో తనిఖీలు చేశాను. అనంతరం విజయవాడలోని గొల్లపూడి గోదాములో తనిఖీలు నిర్వహించాను. రెండు చోట్ల చాలా అవకతకవలు గుర్తించాం. సమస్యను లోతుగా అధ్యయనం చేసేందుకు చాలా కసరత్తు చేశాం. ఈ ఏడాది జూన్ 28న కాకినాడలోని 13 గోదాముల్లో తనిఖీలు చేసి…51,427 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశాం. అందులో పరీక్షల తరువాత 25,386 మెట్రిక్ టన్నుల మేర రేషన్ బియ్యంగా నిర్ధారణ అయింది. రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ నియమించి రేషన్ మాఫియాతో సంబంధం ఉన్న 13 కంపెనీలపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. కేసులు నమోదైన 13 కంపెనీలు హైకోర్టును ఆశ్రయించి బియ్యం రిలీజ్ చేయాలని కోరాయి. కోర్టు ఆదేశాల మేరకు నాన్ పీడీఎస్ రైస్‌ను ముందుగా రిలీజ్ చేశాం. అనంతరం రూ.84 కోట్ల బ్యాంకు గ్యారెంటీలతో పీడీఎస్ రైస్‌ను కూడా రిలీజ్ చేశామని మంత్రి నాదెండ్ల వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా పెద్ద నెట్వర్క్
రాష్ట్రంలోని 29 వేల రేషన్ డిపోలు ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు వినియోగదారులకు సరుకును సక్రమంగా అందించేవి. గత పాలకులు స్వలాభం కోసం రాష్ట్ర ఖజానా నుంచి రూ.1600 కోట్లు ఖర్చు చేసి రేషన్ డోర్ డెలివరీ పేరిట 9,360 వ్యాన్లు కొనుగోలు చేశారు. ఈ వ్యాన్ల ద్వారా ఒక పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసి రేషన్ బియ్యం స్మగ్లింగ్ మొదలుపెట్టారు. రాష్ట్రంలో 1.48 కోట్ల మందికి ప్రతి నెల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ అందిస్తున్నాయి. ఇందుకోసం రూ.12,800 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. కిలో బియ్యానికి ప్రభుత్వానికి రూ.43.40 ఖర్చు అవుతుంటే..వాటిని రూ.10 చొప్పున కార్డుదారుల నుంచి ఈ మాఫియా కొనుగోలు చేసి కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు. ఇందు కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఇటు చిత్తూరు నుంచి అటు శ్రీకాకుళం నుంచి కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యం తరలించి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని మాఫియా కొల్లగొట్టిందని మంత్రి నాదెండ్ల తెలిపారు.
కాకినాడ పోర్టు నుంచే 1,31,18,346 మెట్రిక్ టన్నులు..
కాకినాడ పోర్టు మీదే కూటమి ప్రభుత్వం ఎందుకు దృష్టిపెట్టిందని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దానికి కారణం ఉంది. గత ఐదేళ్లలో కాకినాడ పోర్టులోకి ఎవరినీ అనుమతించలేదు. సామాన్యుల సంగతి పక్కనపెడితే జర్నలిస్టులనూ అనుమతించలేదు. అక్కడ ఏం జరుగుతుందో బాహ్య ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. పకడ్బందీగా వ్యూహం రచించి ఆఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతులు చేసి కోట్లు కూడబెట్టారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఏ పోర్టులో జరగని విధంగా కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతి జరిగింది. మన రాష్ట్రంలో గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో గంగవరం పోర్టు నుంచి 2,20,289 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నం పోర్టు నుంచి 23,51,218 మెట్రిక్ టన్నులు, విశాఖపట్నం పోర్టు నుంచి 38,02,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతులు జరిగితే… ఒక్క కాకినాడ పోర్టు నుంచే 1,31,18,346 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతులు జరిగాయి. కాకినాడ పోర్టు నుంచి ఎగుమతయిన బియ్యం విలువే రూ.48,537 కోట్లు ఉందంటే బియ్యం మాఫియా ఏ విధంగా రెచ్చిపోయిందో అర్థం చేసుకొవచ్చని మంత్రి నాదెండ్ల అన్నారు.
అరబిందో కంపెనీకి అసలు బాస్ ఎవరు?
గత పాలకులు బియ్యం దందా కోసం దేశ భద్రతను సైతం పణంగా పెట్టారు. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కంపెనీ నుంచి అరబిందో రియాల్టీ సంస్థకు 41.12 శాతం వాటా బదిలీ అయింది. అది ఎలా జరిగిందో ప్రజలకు తెలియాలి. కార్పొరేట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కె.వి.రావు, కుటుంబం నుంచి 41.12 శాతం వాటా రాయించుకున్నారు. జీఎంఆర్ నుంచి కాకినాడ ఎస్ఈజెడ్ లాక్కున్నారు. అరబిందో రియాల్టీ కంపెనీకి అసలు బాస్ ఎవరో ప్రజలకు తెలియాతి. గతంలో కూడా బియ్యం ఎగుమతులు ఈ పోర్టు నుంచి జరిగినా ఈ స్థాయిలో ఎప్పుడూ జరగలేదన్నారు. కాకినాడ పోర్టును అరంబిందో కంపెనీ టేకోవర్ చేసిన తరువాత ఊహించని రీతిలో 1,31,18,346 మెట్రిక్ టన్నులు బియ్యం ఎగుమతి చేశారంటే ఏ మేరకు దందా జరిగిందో తెలుస్తోందని మంత్రి నాదెండ్ల అన్నారు.
మొత్తం ప్రక్షాళన చేస్తాం
కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ఒక వ్యక్తిపైనో, కుటుంబంపైనో కక్ష సాధింపుకు పాల్పడలేదు. వ్యవస్థలో పాతుకుపోయిన కుళ్లును ప్రక్షాళన చేయడానికి ప్రయత్నిస్తోంది. పేదలకు అందాల్సిన బియ్యాన్ని భారీ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుని కొందరు కొల్లగొడుతున్నారు. ఉపాధి కల్పించే రైస్ మిల్లులను గుప్పెట్లో పెట్టుకున్నారు. కాకినాడ సీ పోర్టును చేతుల్లోకి తీసుకున్నారు. ప్రజాధనం దళారుల చేతుల్లోకి వెళ్తున్నప్పుడు అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. బియ్యం మాఫియాను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృత నిశ్చయంతో ఉన్నారు. వాస్తవాలు తెలుసుకునేందుకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం చాలా గొప్పది. కాకినాడ పోర్టుపై వస్తున్న ప్రశ్నలకు మాజీ ముఖ్యమంత్రి జగన్ జవాబు చెప్పాలని మంత్రి నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.