- అదానీ వ్యవహారంలో ఆచితూచి అడుగులు
- అమెరికా కోర్టులో ఛార్జిషీట్‌ను అధ్యయనం చేస్తున్నాం
- అన్ని కోణాల్లో పరిశీలించి నిగ్గు తేలుస్తాం
అమరావతి(చైతన్యరథం): వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠ, బ్రాండ్‌ను దెబ్బతీసేలా ప్రవర్తించారని సీఎం చంద్రబాబు విమర్శించారు. శాసనసభ సమావేశాల్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ జగన్ చేసిన అవినీతి అంశాన్ని ప్రస్తావించడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందన్నారు. సౌర విద్యుత్ ఒప్పందంలో గౌతం అదానీ నుంచి జగన్ రెడ్డి రూ.1750 కోట్ల మేర లంచం తీసుకున్నారంటూ వచ్చిన ఆరోపణలను నిశితంగా గమనిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తోంది. మరింత సమాచారం తీసుకుని తగిన విధంగా స్పందిస్తాం. మరొకరు ఇలాంటి తప్పులు చేయకుండా చూస్తాం. అమెరికా కోర్టులో వేసిన ఛార్జిషీట్ కూడా మా దగ్గర ఉంది. దీనిపై అధ్యయనం చేసి ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.
పెట్టుబడిదారుల్లో నమ్మకం పోకుండా, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు భంగం కలగకుండా వ్యవహరిస్తామన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం సంయమన ధోరణితో మాట్లాడినప్పటికీ అమెరికా కోర్టులో అదానీ వ్యవహారంలో దాఖలైన చార్జిషీటు విషయంలో అధికార కూటమి నేతలు తీవ్రంగానే స్పందించారు. టీడీపీ సీనియర్ నేత బుచ్చియ్య చౌదరి తీవ్ర స్వరంతో జగన్‌పై విరుచుకు పడ్డారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఘాటుగా స్పందించారు. ఎన్నికల ముందే వైసీపీ నుండి బయటలకు వచ్చి టీడీపీలో చేరిన మైలవరం ఎమ్మెల్యే తనకున్న సమాచారంతో చర్చను వేడెక్కించారు.
బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఏ కుంభకోణం జరిగినా మాజీ సీఎం జగన్ పేరు వస్తుందని చెప్పారు. అమెరికాలో జగన్‌పై చార్జిషీట్ వేశారన్నారు. గంగవరం, కృష్ణపట్నం పోర్టులో కూడా అదానీకి వాటా ఇచ్చారని చెప్పారు. మాజీ సీఎం జగన్‌కు అదానీ రూ.1750 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. అమెరికా నుంచి చాలా మంది ఫోన్ చేసి జగన్ గురించి తనను అడుగుతున్నారని చెప్పారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరారు. ఇది ప్రజా సొమ్ము కావడంతో దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర పేరు ప్రతిష్టలు దెబ్బ తింటున్నా మనం చేతులు ముడుచుకొంటే ఎలా అని ప్రశ్నించారు .దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనం చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
దేశం అంతా, రాష్ట్రం అంతా, ప్రపంచం అంతా జగన్మోహన రెడ్డి పేరు తెలిసిపోయిందని ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అన్నారు. ఇప్పటి వరకూ స్కామ్ జరిగితే రాష్ట్రానికే పరిమితం అనుకుంటే ఇప్పడు ఆయన స్కామ్‌ల విషయంలో అంతర్జాతీయ స్కామ్ లీడర్ అయ్యారని విమర్శించారు.
అదానీ కుంభకోణంపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన కామెంట్స్ చేశారు. ఒక్క ఛాన్స్ అంటే అందరం దగ్గరకు వెళ్లారని విమర్శించారు. జగన్ ఖ్యాతి అంతర్జాతీయంగా వెళ్లినందుకు వైసీపీ నేతలకు ముందుగా అభినందనలు తెలపాలని ఎద్దేవా చేశారు.
ఇదిలావుండగా అమెరికా అవినీతి వ్యవహారంలో అదానీ అడ్డంగా దొరికిపోవటంతో లంచం తీసుకున్న జగన్‌రెడ్డి తప్పించుకునే ధోరణిలో మాట్లాడుతున్నారు.ఏపీ ప్రభుత్వం అదానీతో ఒప్పందం చేసుకోలేదని.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెకీతో ఒప్పందం చేసుకున్నామని వాదించడం ప్రారంభించాడు. సౌరవిద్యుత్ మార్కెట్లో రూ. 2కే వస్తున్నా.. రెండున్నర రూపాయలు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించడం.. సెకీ నుంచి ప్రతిపాదన వచ్చిన మరుసటి రోజే కేబినెట్ ముందు పెట్టి ఆమోదం తీసుకోవడం, అంతకు ముందు అదానీ నాలుగు సార్లు జగన్ రెడ్డి ఆతిథ్యాన్ని స్వీకరించడం.. ఇవన్నీ జగన్ రెడ్డి లంచం తీసుకున్న విషయాన్ని ధృవీకరించేవే.
అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్‌లో లిస్టింగ్ అయిన కంపెనీలు, ఆ దేశ సంస్థల నుంచి పెట్టుబడులు స్వీకరించిన కంపెనీలు అక్కడే కాకుండా, ఏ దేశంలో అవినీతికి పాల్పడినా విచారించేందుకు అమెరికా దర్యాప్తు సంస్థలకు అధికారం ఉంటుంది. అమెరికా ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ) ఇందుకు వీలు కల్పిస్తోంది. ఈ చట్టం ప్రకారమే ఆ దేశ దర్యాప్తు సంస్థలు అదానీ కంపెనీల అవినీతి వ్యవహారంపై విచారణ జరిపి కేసు నమోదు చేశాయి.
మెగావాట్‌కు రూ.25 లక్షల చొప్పున…
రూ.1750 కోట్ల మేర అదానీ నుంచి జగన్‌రెడ్డి లంచం పుచ్చుకున్నారు. దీనిని బయట పెట్టింది దర్యాప్తు సంస్థలు. ఈ మేరకు అమెరికా కోర్టులో ఛార్జిషీటు దాఖలయింది. మెగావాట్‌కు రూ. పాతిక లక్షల చొప్పున లెక్కగట్టి, ఒప్పందం కుదుర్చుకున్న 7 వేల మెగావాట్లకు రూ. 1750 కోట్లు జగన్ రెడ్డి లంచంగా తీసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఏపీ ప్రజలు పాతికేళ్ల పాటు అదానీకి అత్యధిక విద్యుత్ చార్జీలు కట్టాలి.. అందు కోసం జగన్ రెడ్డి ముందుగానే తన వాటా తాను తీసేసుకున్నాడు. ఈ స్కామ్ ఇండియాలో అయితే బయటపడేదే కాదు. జగన్ రెడ్డి తీసుకున్న ఆ రూ.1750 కోట్ల గురించి గోప్యంగానే ఉండేది. కానీ జగన్ రెడ్డి రోజులు బాగోలేక ఆయన లంచాలు తీసుకున్న అదానీ గ్రూపు అమెరికా కంపెనీ నుంచి పెట్టుబడులు సేకరించింది.
ఆ పెట్టుబడులు సేకరించడానికి ఆంధ్రప్రదేశ్‌తో చేసుకున్న ఒప్పందాన్ని చూపించింది. ఆ సంస్థ అమెరికా స్టాక్ మార్కెట్‌లో రిజిస్టర్ అయింది. అమెరికాకు చెందిన అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐతో పాటు, అక్కడి స్టాక్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) అంటే స్టాక్ మార్కెట్‌ను నియంత్రించే సంస్త దర్యాప్తు చేసింది. అమెరికా దర్యాప్తు ఏజెన్సీలు ఆషామాషీగా ఆరోపణలు చేయవు. పక్కాగా ఆధారాలు ఉంటేనే కేసులు పెడతాయి.. ఆ సంస్థలు భారత్‌కు జవాబుదారీ కాదు. ఇక్కడ జరిగే అవినీతితో వారికి సంబంధం లేదు. అదానీ నుంచి జగన్ రెడ్డి వసూలు చేసిన రూ. 1750 కోట్లు ఎక్కడి నుచి ఎక్కడికి వెళ్లాయో కూడా అమెరికా దర్యాప్తు సంస్థలకు తెలుసు.
విచారణలో అన్నీ కోర్టు ముందు పెడతాయి.
అయితే తము చట్టాలను పాటిస్తామని, అత్యున్నతమైన విలువల్ని పాటిస్తామని, అమెరికా కోర్టులో నమోదైన కేసును తిరస్కరిస్తున్నామని, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అదానీ గ్రూప్ ప్రకటించింది. సెకీ పేరుతో విద్యుత్ ఒప్పందాలను ఆదానీ సంస్థతో చేసుకుని పాతికేళ్ల పాటు ఏపీ ప్రజల్ని దోపిడీ చేసుకునే చాన్స్ ఇచ్చినందుకు రూ.1750 కోట్ల లంచాలను జగన్ రెడ్డి తీసుకున్నారని అమెరికా కోర్టు నిర్ధారించింది. ఈ ఒప్పందాలు చూపించే అమెరికా నుంచి పెట్టుబడులు పట్టుకొ¸చ్చారు.
అమెరికా దర్యాప్తు సంస్థలు అదానీపై తమ దేశంలో కేసు పెట్టాయి. నిందితులుగా గౌతమ్ అదానీ, సాగర్ అదానీలతో పాటు మరో ఆరుగురిని పేర్కొన్నారు. న్యూయార్క్ ఈస్ట్‌ర్న్ డిస్ట్రిక్ కోర్టులో కేసు నమోదయింది. 2021-2024 మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో భారీ అవినీతి జరిగిందని తేల్చారు. ఇండియన్ ఎనర్జీ కార్పొరేషన్, దాని అనుబంధ కంపెనీల పాత్ర ఉందని, సోలార్ ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతి కోసం భారీ ఎత్తున లంచాలు ఇచ్చారని ఆధారాలు లభించడంతో కేసు పెట్టారు.
ఇండియాలో జరిగిన అవినీతి అమెరికా కోర్టులో కేసులు పెట్టవు. కానీ ఇక్కడ అవినీతి చేసింది న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌చేంజీలో లిస్టయిన కంపెనీ కావటం, అమెరికా సంస్థల నుండి పెట్టుబడులు సేకరించటంతో ఎఫ్‌సీపీఏ ప్రకారం కేసులు నమోదయ్యాయి. భారత్‌లోని ఐదు రాష్ట్రాల్లో ఒప్పందాల కోసం అదానీ కంపెనీలు మొత్తం రూ.2029 కోట్ల మేర లంచాలు ఇస్తే.. అందులో జగన్ రెడ్డి వాటానే రూ.1750 కోట్లు కావటం గమనార్హం.