- 1520 ల్యాప్ టాప్ల్లో సమస్యలు ఉన్నట్లు ఫిర్యాదులు
- దీనిపై 90 రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి దోషులపై చర్యలు
- శాసనమండలిలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్యరథం): వైసీపీ పాలనలో ఐఐఐటీ విద్యార్థులకు నాసిరకం ల్యాప్ టాప్లు పంపిణీ చేశారని, దీనిపై 90 రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఐఐఐటీ విద్యార్థులకు 2023 సంవత్సరంలో నాసిరకం ల్యాప్ టాప్లు అందించడంపై మండలిలో ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, దువ్వారపు రామారావు, కంచర్ల శ్రీకాంత్ అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఈ-ప్రొక్యూర్ మెంట్ ద్వారా ఆర్జీయూకేటీ(ఐఐఐటీ)ల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అందించేందుకు 2023లో 6,500 ల్యాప్ టాప్లు కొనుగోలు చేశారన్నారు ఒక్కో ల్యాప్ టాప్కు రూ.27వేలు వెచ్చించారు. అయితే 1520 ల్యాప్ టాప్ల్లో సమస్యలు ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ల్యాప్ టాప్ల్లో కనీసం ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్ వేర్ కూడా ఇన్స్టాల్ చేయలేదు. బేసిక్ అడాప్టర్లు కూడా పనిచేయని పరిస్థితి. కొన్ని ల్యాప్ టాప్ల్లో ఆడియో క్వాలిటీల్లో ఇబ్బందులు ఉన్నాయి. బ్యాటరీలు కూడా నాసిరకంగా ఉన్నాయి. విచిత్రమేమిటంటే అసలు కొన్ని ల్యాప్ టాప్లు ఆన్ కూడా కాలేదని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. నాసిరకం ల్యాప్ టాప్ల పంపిణీపై సమగ్ర దర్యాప్తు చేపడతాం. తప్పనిసరిగా 90 రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి సభ ముందు పెడతామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.