- ప్రభుత్వ బిల్లులు, పాలసీలను స్టడీచేయండి
- ప్రభుత్వ శాఖలపై అవగాహన అవసరం
- అప్పుడే.. మీ సెగ్మెంట్‌కు ఏమైనా చేయగలుగుతారు
- పనిచేసినవాడే గెలుపు సాధించగలుగుతాడు
- వినూత్న ఆలోచనలు ప్రభుత్వంతో పంచుకోండి
- బూతులు మాట్లాడితే ప్రజలు హర్షించరు..
- సమస్యల పరిష్కారానికి సభలు వేదికవ్వాలి
- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చంద్రబాబు సూచన
- అసెంబ్లీ, బడ్జెట్ సమావేశాలపై వర్క్ షాప్
- బడ్జెట్ పై పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ ప్రజెంటేషన్
అమరావతి (చైతన్య రథం): ఏస్థాయి రాజకీయ నాయకుడైనా నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. తెలుసుకుంటూనే ఉండాలి. అప్పుడే రాజకీయాల్లో రాణించగలుగుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. గతంలో ఒక సబ్జెక్టుపై ఎంత సమయమైనా చర్చించేవాళ్లమని, రానురాను ఎమ్మెల్యేలకు సబ్జెక్టు నేర్చుకోవాలనే ఆసక్తి తగ్గుతోందన్నారు. ఇది మంచిది కాదంటూనే, నిరంతరం నేర్చుకోవాలి. తెలుసుకోవాలని సూచించారు. ‘ఇక్కడ ఇప్పుడు ఎవరు ఏ సబ్జెక్టు మట్లాడుతున్నారో నేనుకూడా నోట్ చేసుకుంటున్నారు. శాఖల్లో ఏం జరుగుతుందో అవగాహన లేకపోతే నియోజకవర్గానికి ఏం అవసరమో తెలియకుండా పోతుందని హెచ్చరించారు. అసెంబ్లీలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మంగళవారం వర్క్‌షాప్ జరిగింది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన ఉండాలని, మంచి ఆలోచనలు సభలో పంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం తెచ్చే బిల్లులు, పాలసీలపై ప్రతి ఎమ్మెల్యే అధ్యయనం చేయాలంటూనే.. పబ్లిక్ గవర్నెన్స్‌లో ఎమ్మెల్యేలనూ భాగస్వామలను చేయనున్నట్టు ప్రకటించారు. ప్రజలు మనపై అనేక ఆశలు, నమ్మకం పెట్టుకున్నారని.. వారి సమస్యలపై సభలో చర్చించినపుడే అర్థవంతమైన సభ అవుతుందన్నారు. ‘నేను 1978లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాను. 1980లో మంత్రి అయ్యాను. ఇప్పటికి 9సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. 4సార్లు సీఎం అయ్యాను. వరుసగా విజయం సాధించడం అనేది మన పనితనం, పార్టీ నిర్మాణాన్ని బట్టి ఉంటుంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. చాలామంది కొత్త వ్యక్తులు ఎమ్మెల్యేలుగా వచ్చారు. టీడీపీ నుండి 61మంది, జనసేన నుండి 15మంది, బీజేపీ నుండి నలుగురు, వైసీపీనుండి నలుగురు ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికయ్యారు.
మొత్తం 84 మంది కొత్తవారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండోసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు 30 మంది టీడీపీ నుంచి ఉన్నారు. ఒకప్పుడు అసెంబ్లీ ప్రొసెడిరగ్స్ ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్‌లో వచ్చేవి. కానీ ఇప్పుడు లైవ్, సోషల్ మీడియాలో కూడా ప్రసారమయ్యే దాకా టెక్నాలజీ వచ్చింది. ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళం సభలో పబ్లిక్ పాలసీలు రూపొందిస్తాం. ఈ పాలసీలు ప్రజా జీవితంలో మార్పులు తెస్తాయి. గతంలో కొందరు ఎమ్మెల్యేలను విదేశాలకు పంపి ఆయా దేశాలు సాధించే ఫాస్ట్ గ్రోత్ రేట్ గురించి స్టడీ చేయించాం. మనం తెచ్చే పాలసీలే రాష్ట్రంలోని సమస్యలకు శాశ్వత పరిష్కారాలను చూపిస్తాయి’ అని సీఎం చంద్రబాబు అవగాహన కల్పించారు.
‘బడ్జెట్ సమావేశాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం. అసెంబ్లీలో నాడు ఎన్టీఆర్, సుందరయ్య ఏం మాట్లాడారో ఇప్పుడు పుస్తకాల రూపంలో వస్తున్నాయి. కేంద్రం కూడా ఎంపీలకు ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు పెడుతోంది. మీ నాలెడ్జ్, వినూత్న ఆలోచనలను సభలో పంచుకుంటే తప్పకుండా వినియోగించుకుంటాం.
కేంద్ర బడ్జెట్లో కూడా ఏవిధమైన నిధుల కేటాయింపులున్నాయో స్టడీ చేసుకుంటే మీకు ఉపయోగపడుతుంది. పని చేయాలన్న ఆసక్తి మీలోవుంటే ఏదైనా సాధ్యమే. మీరంతా ఆదర్శవంతమైన ఎమ్మెల్యేలుగా ఉండాలి. సభలో ప్రతిపక్షం లేదు కదా మనకేముంది అని అనుకోవద్దు. వాళ్లకు బాధ్యత లేదు. కానీ మనకుంది. మనం ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం’ అని చంద్రబాబు సూచించారు. ‘ప్రజలకు ఏం అవసరమో, ప్రజలకు ఏం చేశామో చెప్పడానికి అసెంబ్లీ ఒక వేదిక. అసెంబ్లీకి మేము పంపిన ప్రతినిధి మా కోసం ఏం మాట్లాడుతున్నారని ప్రజలు ఎప్పుడూ గమనిస్తారు. సమస్యలపై మాట్లాడకుండా బూతులు తిడితే ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో స్వాగతించరు. గతంలో అదే జరిగింది. విజన్-2047పై మీ అందరి అభిప్రాయాలు తెలియజేయండి. మంచి చర్చ, సమస్యల పరిష్కారానికి శాసన సభ, శాసన మండలి ఇకపై వేదికగా నిలవాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు.