- సూపర్ సిక్స్‌లో భాగంగా ఇక ఉచిత సిలిండర్లు
- రూ.2,684 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
- సర్కారుపై తొలి విడత భారం.. రూ.894 కోట్లు
- పెట్రోలియం సంస్థలకు చెల్లించిన ముఖ్యమంత్రి
- 1న శ్రీకాకుళంలో పథకాన్ని ప్రారంభించనున్న సీఎం
అమరావతి (చైతన్య రథం): సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. దీపం-2 పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఎన్నికలముందు కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్-6 హామీల్లో భాగంగా యేడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పథకానికి ఖర్చయ్యే నిధులను సీఎం చంద్రబాబు చేతులమీదుగా గ్యాస్ సరఫరా చేసే పెట్రోలియం సంస్థలకు అందజేశారు. బుధవారం సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి ఈ సబ్సిడీ మొత్తాన్ని అందించారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు అయ్యే రూ.2,684 కోట్ల ఖర్చుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ప్రభుత్వం పెట్రోలియం సంస్థలకు చెక్కు అందజేసింది. రూ.2,684 కోట్ల మంజూరుకు అంగీకారం తెలుపుతూ.. మొదటి సిలిండర్‌కు ఖర్చయ్యే రూ.894 కోట్లు పెట్రోలియం సంస్థలకు అందించింది. దీపం-2 పథకంలో భాగంగా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ప్రభుత్వం పేద ప్రజలకు అందించనుంది.
ఏడాదికి మూడు విడతల్లో ప్రభుత్వం మూడు గ్యాస్ సిలిండర్లకు అయ్యే సొమ్మును విడుదల చేయనుంది. 29నుంచి ప్రభుత్వం ఈ పథకం కింద గ్యాస్ బుక్ చేసుకునే అవకాశాన్ని లబ్దిదారులకు కల్పించింది. గ్యాస్ సిలిండర్ అందిన 48 గంటల్లో లబ్ధిదారులు సిలిండర్‌కు వెచ్చించిన సొమ్ము వారిఖాతాలో జమ కానుంది. కేంద్రం ఇచ్చే రూ.25ల రాయితీపోను మిగిలిన రూ.876లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం అమలుకు ప్రతియేటా రూ.2,684 కోట్లు ప్రభుత్వంపై ఆర్థిక భారం పడనుంది. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌తో పాటు తెనాలి నుంచి వచ్చిన దీపం పథకం లబ్దిదారు బాలమ్మ, ఏలూరునుంచి వచ్చిన లబ్దిదారు భవానీ, విజయవాడనుంచి వచ్చిన లబ్దిదారు మంగతాయారు, సివిల్ సప్లై శాఖ అధికారులు, పెట్రోలియం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.