- మంత్రి నారా లోకేష్‌కు అభిమానుల తాకిడి!
- ఓ వైపు ఇన్వెస్టర్స్ తో వరుస భేటీలు
- మరో వైపు పార్టీ కేడర్‌తో ఫొటోలు
శాన్ఫ్రాన్సిస్కో (చైతన్యరథం): పెట్టుబడుల సాధన కోసం అమెరికా వెళ్లిన రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్‌కు అక్కడ కూడా అభిమానుల తాకిడి తప్పలేదు. శాన్ఫ్రాన్సిస్కోలో ఒకవైపు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలతో క్షణం తీరికలేకుండా బిజీబిజీగా ఉంటూనే… మరోవైపు తమను కలిసేందుకు వచ్చిన అభిమానులను నిరాశపర్చకుండా వారితో ఫోటోలు దిగారు. శాన్ఫ్రాన్సిస్కోలో మంత్రి బసచేసిన ఫోర్‌సీజన్స్ హోటల్ వద్దకు వచ్చిన సుమారు 200 మంది టీడీపీ కార్యకర్తలు, అభిమానులతో ఫోటోలు దిగిన లోకేష్ వారిని ఆప్యాయంగా పలకరించి వారి సాదకబాధకాలను తెలుసుకున్నారు. ఇదిలావుండగా అమెరికా పర్యటనలో 2వ రోజు మంత్రి లోకేష్ పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. గూగుల్ సీటీిఓ ప్రభాకర్ రాఘవన్, జనరల్ అటమిక్స్ సీఈఓ డాక్టర్ వివేక్ లాల్, నియోట్రైబ్ వెంచర్స్ ఫౌండర్ కిట్టూ కొల్లూరి, జనరల్ కేటలిస్ట్స్ ఎండీ నీరజ్ అరోరా, ఐ స్పేస్ ప్రెసిడెంట్ రాజేష్ కొత్తపల్లి, సీఎఫ్ఓ ప్రసాద్ పాపుదేసి, గూగుల్ మాజీ అధికారి సారిన్ సువర్ణ, స్మియోటా కంపెనీ ప్రతినిధులతో మంత్రి లోకేష్ ముఖాముఖి భేటీ అయ్యారు. రాష్ట్రంలో కొత్తగా తెచ్చిన పారిశ్రామిక పాలసీలు, ప్రోత్సాహకాలను మంత్రి లోకేష్ వారికి వివరించారు.