- విజయనగరం జిల్లా గొర్లలో అతిసారపై సీఎం సమీక్ష
- వైద్యశిబిరాలు కొనసాగించాలని ఆదేశం
- బాధితులకు అండగా నిలవాలని సూచన
అమరావతి (చైతన్యరథం): విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గొర్లలో డయేరియా మరణాలపై పూర్తిస్థాయి విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. డయేరియాతో 8 మంది చనిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న పరిస్థితిని, బాధిత ప్రజలకు అందుతున్న వైద్య సాయాన్ని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. డయేరియా వల్లనే మరణాలు అనే అంశంపై వైద్యశాఖ అధికారులతో మాట్లాడారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, సురక్షిత తాగునీరు అందజేస్తున్నామని ముఖ్యమంత్రికి జిల్లా అధికారులు తెలిపారు. అయితే అసలు ఘటనకు కారణాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దీనిలో భాగంగా సీనియర్ ఐఎఎస్ అధికారి కె. విజయానంద్ తో మొత్తం ఘటనపై విచారణ జరిపించాలని నిర్ణయించారు. మరణాలకు అసలు కారణం ఏమిటి, ఆయా ప్రభుత్వ శాఖల పరంగా ఉన్న సమస్యలు ఏమిటి అనేది తెలుసుకునేందుకు సమగ్ర విచారణ జరపాలని సీఎం నిర్ణయించారు. ఆ ప్రాంతంలో నీటిని ఎప్పటికప్పుడు పరీక్షలకు పంపాలని….సమస్య పరిష్కారం అయ్యేవరకు సురక్షిత తాగునీరు సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. వైద్య శిబిరాలు కొనసాగించాలని సూచించారు. వైద్యఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, ఆర్డబ్లుఎస్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు ధైర్యం చెప్పి…..సమస్య పరిష్కారం అయ్యేవరకు వారికి అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఆందోళన వద్దు: మంత్రి కొండపల్లి
గుర్లలో తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. డయేరియా ప్రబలటానికి కారణాలేమిటో అర్థం కావడంలేదని అధికారులు తెలిపారు. పూర్తిగా వివరాలు సేకరించి ప్రజలు త్వరగా కోలుకునేలా చూడాలని మంత్రి ఆదేశించారు. బాధితులుఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తుందని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: కిమిడి నాగార్జున
విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున మాట్లాడుతూ.. జిల్లాలో డయేరియా కేసుల విషయంలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా వైసీపీ నేతల వ్యాఖ్యలు ఉన్నాయని, తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్ల వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు కూలిపోయాయని.. ఐదేళ్లలో ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించారా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఇంత వరకు ఎందుకు గ్రామాన్ని సందర్శించలేదని కిమిడి నాగార్జున నిలదీశారు.