- విశాఖలో మంత్రి లోకేష్‌కు వినతుల వెల్లువ
- 44వ రోజు ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి విజ్ఞప్తుల స్వీకరణ
- మంత్రిని కలిసిన పలువురు నాయకులు, కార్యకర్తలు
విశాఖపట్నం (చైతన్యరథం): రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం రాత్రి విశాఖ చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. శుక్రవారం ఉదయం జిల్లా పార్టీ కార్యాలయంలో 44వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై విజ్ఞప్తులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
విశాఖవాసుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు
బర్మా కాందిశీకుల భూములు అన్యాక్రాంతం చేస్తున్న వారు, అందుకు మద్దతిస్తున్న వారిపై చర్యలు తీసుకుని, తమకు ఆయా భూముల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని బర్మా ఆంధ్రా కాందిశీకుల కేంద్ర సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. బర్మా కాందిశీకులు, వారి సంతతికి చెందిన 7వేల కుటుంబాలకు పైగా విశాఖకు తరలి వచ్చాయని తెలిపారు. తమకు ఉద్యోగం, వ్యాపార రుణాలు, ఇల్లు నిర్మించి ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
2013వ సంవత్సరం రిక్రూట్మెంట్ డ్రైవర్లను రెగ్యులర్ చేయాలని ఆర్టీసీ కాంట్రాక్ట్ డ్రైవర్లు.. మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ విశాఖ రీజియన్‌లో 2013లో ఎంపికైన తమను 2022లో విధుల్లోకి తీసుకున్నారన్నారు. దీంతో సర్వీసు చాలా నష్టపోయామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో తమకు పీఆర్సీ కూడా అమలు చేయలేదన్నారు. ఉద్యోగ భద్రత లేక ఆందోళన చెందుతున్నామని, పీఆర్సీ వర్తింపజేయడంతో పాటు తమను క్రమబద్ధీకరించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
విశాఖ భీమునిపట్నంలో మొత్తం నగదు చెల్లించి తాము కొనుగోలు చేసిన 78 సెంట్ల భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా వైసీపీ నాయకుల అండతో అక్రమాని వెంకటరావు ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, విచారించి తగిన న్యాయం చేయాలని నకేళ్లా సోమరాజు విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
గత వైసీపీ పాలనలో చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ వార్త విని తన భర్త గుండెపోటుతో మరణించాడని, దీంతో తమ కుటుంబానికి ఎలాంటి ఆధారం లేకుండా పోయిందని అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం కండపాలెంకు చెందిన ముచ్చకర్ల ధారాలక్ష్మి.. మంత్రి నారా లోకేష్ ను కలిసి కన్నీటిపర్యంతమయ్యారు. వడ్డాది కేజీబీవీలో ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
అధికారులు చేసిన తప్పునకు న్యాయం కోసం పడిగాపులు కాస్తున్నానని విశాఖ రూరల్ కు చెందిన కే.చిన్నారావు.. మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. 2012లో వుడా అనుమతులు ఉన్న 200 గజాల స్థలాన్ని కొనుగోలు చేశానని తెలిపారు. 1981లో సొసైటీకి దాఖలైన సదరు భూమిని 35 ఏళ్ల దర్వాత నిషేధిత జాబితాలో చేర్చారన్నారు. విచారించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
ఉద్యోగ విరమణ అనంతరం వచ్చిన నగదును కుమార్తెల వివాహం కోసం అగ్రిగోల్డ్‌లో పొదుపు చేశానని, సంస్థ బోర్డు తిప్పేయడంతో రోడ్డున పడ్డామని శ్రీకాకుళానికి చెందిన గంగాడ కొర్లమ్మ.. మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి ఆధారం లేదని, తమ డిపాజిట్ తిరిగి చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
ఇంజనీరింగ్ చదివిన తనకు ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించాలని విశాఖకు చెందిన బత్తుల దుర్గా ప్రణీత్ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన ఉద్యోగం కల్పిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
బీసీఏ కంప్యూటర్స్, ఎంబీయే చదివిన తన కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించాలని విశాఖకు చెందిన అనసూరి మధుసూదనరావు విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
షెడ్యూల్ కులానికి చెందిన తనకు రేషన్ దుకాణం మంజూరు చేసి ఆదుకోవాలని విశాఖ కంచరపాలెంకు చెందిన మోర్ల రాజారావు కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
ఇలా ఉంటే పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్‌ను పలువురు నాయకులు, కార్యకర్తలు కలిశారు. అనంతరం వారితో మంత్రి లోకేష్ ఫొటోలు దిగారు.