- అన్ని రిజర్వాయర్లు, చెరువులు నింపుతాం
- ఉమ్మడి కడప జిల్లాలో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు
- ప్రతి రైతుకు, చివరి ఆయకట్టు వరకు నీరందిస్తాం
- మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టీకరణ
విజయవాడ(చైతన్యరథం): మొదటిసారిగా కడప జిల్లాలోని గండికోట జలాశయాన్ని పూర్తిగా కృష్ణా జలాలతో నింపినట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం రాయలసీమలో వర్షపాతం తక్కువగానే ఉన్నప్పటికీ కృష్ణా నది ఎగువ ప్రాంతం నుండి భారీగా శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద ప్రవాహం వచ్చినందున అక్కడికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న గండికోట రిజర్వాయర్‌ను 25.5 టీఎంసీలతో నింపినట్లు మంత్రి మండిపల్లి తెలిపారు. జలాశయం నిర్మాణం పూర్తయిన తర్వాత పూర్తి సామర్థ్యం (26.8) కాగా, 25.5 టీఎంసీల మేర నీటిని నిల్వ చేయడం ఇదే తొలిసారి అన్నారు. 2012లో నిర్మాణం పూర్తి చేసుకున్న గండికోట జలాశయంలో 2013 -14 లో కేవలం 3 టీఎంసీల నీరు నిల్వ చేశారన్నారు. నాటినుండి నేటి వరకు గండికోట దానికి అనుబంధంగా ఉన్న రిజర్వాయర్లు మైలవరం చిత్రావతి, పైడిపాలెం, సర్వసాగర్, వావికొండ జలాశయాలను పెన్నా క్యాచ్‌మెంట్‌తో వచ్చిన నీటి ద్వారా 80 శాతం, మిగిలిన 20 శాతం కృష్ణా జలాలతో నింపేవారన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన సూచనల ద్వారా నిత్యం అధికారులు పర్యవేక్షిస్తున్నందున మొదటిసారి కృష్ణా జలాలతో గండికోట రిజర్వాయర్ నింపామన్నారు. అంతేకాకుండా శ్రీశైలం జలాశయం వరద నీటిని 40 టీఎంసీలు తీసుకోవడం ద్వారా కడప జిల్లాలోని జిఎన్ఎస్ఎస్, తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించిన 9 రిజర్వాయర్లను అక్టోబర్ 30 నాటికి కృష్ణా జలాలతో పూర్తిగా నింపుతామన్నారు. అన్ని రిజర్వాయర్ల సామర్థ్యం 72 టీఎంసీలు ఉందని, ఇంత పెద్ద ఎత్తున కృష్ణా జలాలను మళ్లించి, నీటిని నింపడం కూడా ఇదే మొదటిసారి అని వెల్లడిరచారు. అదే విధంగా ప్రభుత్వ సూచనల ప్రకారం కాలువల పూడిక పనులు, రిజర్వాయర్ల గేట్ల పనులు పూర్తి చేశామని, తద్వారా ఈ ఖరీఫ్ సీజన్లో ఉమ్మడి కడప జిల్లాల్లో మూడు లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామన్నారు. అంతేకాకుండా ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న 150 చెరువులను కూడా నీటితో నింపామని తెలిపారు. ప్రతి రైతుకు చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని మంత్రి మండిపల్లి స్పష్టం చేశారు.