మడకశిర(చైతన్యరథం): మల్బరీ పట్టు గుడ్ల సాగుతో ఆదర్శంగా నిలిచిన రైతుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. గురువారం శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమలలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనంతరం మల్బరీ సాగు చేస్తున్న షెడ్ ను సందర్శించి రైతుతో మాట్లాడుతూ… మల్బరీ సాగులో మరింత ఆర్థిక అభివృద్ధి చెంది నలుగురికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. మల్బరీ రైతు జి.ఆర్ రంగనాథన్ మాట్లాడుతూ తాను సాగు చేస్తున్న పట్టు పురుగుల షెడ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించడం చెప్పలేనంత సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
గత 15 సంవత్సరాల నుంచి తమ కుటుంబం మల్బరీ సాగును జీవనోపాధిగా ఎంచుకొని రెండున్నర ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నామని అన్నారు. 2022లో పట్టు పరిశ్రమ శాఖ ద్వారా పట్టుపురుగుల పెంపకపు షెడ్డును నిర్మించుకొని పట్టుపురుగుల గుడ్ల పెంపకాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. మల్బరీ తోటను రెండు భాగాలుగా చేసుకొని ప్రతి పంటకు సుమారుగా 90 వేల వరకు ఆదాయం పొందుతున్నానని అన్నారు. ఈ మల్బరీ సాగుకు 30వేల వరకు ఖర్చు పోను ప్రతి పంటకు 60 వేలు లాభం వస్తుందన్నారు. పట్టుపురుగుల గుడ్లను పెంచుతూ సంవత్సరానికి ఎనిమిది పంటల ద్వారా నాలుగు లక్షల ఎనభై వేల వరకు ఆదాయం లభిస్తుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీ ద్వారా పట్టుపురుగుల షెడ్డు వరండా నిర్మాణం చేపట్టానని తెలిపారు. ఎంజీఎన్‌ఆర్ జిఎస్ పథకం ద్వారా షెడ్డుకు రాయితీ లభించిందన్నారు. అదేవిధంగా మల్బరీ తోట సాగు కోసం డ్రిప్ పైప్ లైన్స్ కూడా రాయితీగా పొందానన్నారు. మల్బరీ సాగుకు అవసరమైన పట్టు గుడ్లు కేజీకి 50 రూపాయల వరకు ప్రభుత్వం రాయితీ అందించిందని తెలిపారు. పట్టుపురుగులు పెంచే గది శుభ్రం చేసేందుకు, క్రిమిసంహారక మందులకు సైతం ప్రభుత్వం రాయితీ ఇచ్చి సహకరించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి కృతజ్ఞతలు తెలిపారు.
ఇలాఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పట్టురీలర్స్ కలిసి పట్టు దారంపై సబ్సిడీ గత మూడు సంవత్సరాలగా నిలిచిపోయిందని, దానిని ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రి సవితమ్మ, హిందూపూర్ ఎంపీ బి కే పార్థసారథి, మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజు, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే తిప్పే స్వామి, జిల్లా కలెక్టర్ చేతన్, సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, పుట్టపర్తి ఆర్డిఓ సౌభాగ్య లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.