అమరావతి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ సీనియర్ నాయకుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గట్టిగా తిప్పికొట్టారు. కేటీఆర్ ఢిల్లీలో మంగళవారం మీడియాతో చిట్ చాట్ చేస్తూ ఏపీ రాజకీయాలపై స్పందించారు. జగన్ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినా ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. వైసీపీ ఓటమి చెందినా.. 40 శాతం ఓట్లు రావడం సాధారణ విషయం కాదన్నారు. కేవలం జగన్‌ను ఓడిరచడానికి షర్మిలను పావులా వాడుకున్నారని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమితో జతకట్టడం వల్లనే ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. ఏపీ ఫలితాలు మాత్రం తనను షాక్‌కు గురిచేశాయని చెప్పారు.
ఈ వ్యాఖ్యలపై సోమిరెడ్డి ఘాటుగా స్పందించారు. పాలనలో తండ్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కు, కొడుకు కేటీఆర్ కలెక్షన్ హౌస్ కు పరిమితమయినందునే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కాళ్ల కింద పడేసి తొక్కినా, మీ సొంత చెల్లెలు కవిత జైలులో మగ్గుతున్నా మీలో అహంకారం తగ్గకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆ అహంకారాన్ని ఆత్మవిశ్వాసంగా భావించడంతో మీ కళ్లకున్న పొరలు ఇంకా తొలగనట్టుందని ఎద్దేవా చేశారు. ఆ పొగరుతోనే ఆంధ్రప్రదేశ్ నాశనమైపోవాలని కోరుకున్నారు. జగన్ లాంటి నియంత చేతిలో ఏపీ మరో ఐదేళ్లు నలిగిపోవాలని ఆశించారు. అందుకే మీకు తెలంగాణ ప్రజలు ముందుగానే గుణపాఠం చెప్పారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడుని అక్రమ కేసులో జైలుకు పంపినప్పుడు మీరు వ్యంగ్యంగా పెట్టిన ట్వీటే మీ కొంప ముంచిందనే విషయం గుర్తుంచుకోవాలని సోమిరెడ్డి ఎక్స్‌లో ధ్వజమెత్తారు.