కుప్పం (చైతన్యరథం): కుప్పం ఉప్పొంగిపోయింది. అఖండ విజయాన్ని సాధించి రాష్ట్రాధినేతగా సొంత నియోజకవర్గానికి వస్తున్న చంద్రబాబును చూసేందుకు, పలకరించేందుకు అశేషంగా కదలివచ్చిన జనవాహనితో కుప్పం ఉప్పొంగిపోయింది. రోడ్డు మార్గాన ప్రత్యేక వాహనంలో అందరినీ పలకరిస్తూ వెళ్తున్న చంద్రబాబుపై అభిమానులు పూలవర్షం కురిపించారు. మంగళహారతులతో మహిళలు స్వాగతం పలికారు. ఎక్కడికక్కడ గజమాలలతో స్వాగతం పలికారు. కూటమి విజయాన్ని తమ విజయంగా భావిస్తూ.. తనపట్ల ఆదరణ చూపిస్తున్న కుప్పం ప్రజలను చూసి చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. తను వచ్చినా రాకున్న తన కోసం ప్రాణం పెట్టే కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. మళ్లీ జన్మంటూవుంటే కుప్పం గడ్డకు ముద్దుబిడ్డగా జన్మిస్తానని భావోద్వేగంతో ప్రకటించారు. ఐదేళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉండిపోయిన కుప్పంలో `అభివృద్ధి పనులు ఇవాళ్టినుంచే ప్రారంభిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. నియోజకవర్గంలోని ప్రతి ఊరిలో తాగునీరు, డ్రైనేజీలు, వీధిదీపాలు ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని గ్రామాలకు కుళాయి ద్వారా తాగునీరు అందిస్తానని, ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా మళ్లీ మినరల్ వాటర్ ఇస్తామన్నారు. అన్ని గ్రామాలు, పంట పొలాల వద్దకు రోడ్లు వేసామని, కుప్పంలోని నాలుగు మండలాలను ఆదర్శ పట్టణాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వీలైనంత తొందరలోనే కుప్పానికి విమానాశ్రయం వస్తుంది. స్థానిక ఉత్పత్తులను కుప్పం నుంచి ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు పంపిద్దామంటూ నియొజకవర్గ ప్రజల హర్షద్వానాల మధ్య చంద్రబాబు ప్రకటించారు.