- నేను రాలేకున్నా.. నన్ను ఆదరించారు
- శిరస్సువంచి మీకు పాదాభివందనం
- ముఖ్యమంత్రి చంద్రబాబు భావోద్వేగం
కుప్పం (చైతన్య రథం): మళ్లీ జన్మంటూవుంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో రెండు రోజుల పర్యటన సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం స్థానిక బస్టాండ్ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడారు. ‘నేను మీదగ్గరకు వచ్చినా.. రాకున్నా నన్ను ఆదరించారు. ఆదరిస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు నన్ను 8సార్లు గెలిపించారు. మీరుణమెలా తీర్చుకోవాలి. కుప్పం ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. కుప్పం వ్యవహారాలు చూస్తున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్, మంత్రి రాంప్రసాద్ రెడ్డి, మండల పార్టీ నేతలకు అభినందనలు. మొన్నటి ఎన్నికల్లో వైకాపాను చిత్తుచిత్తుగా ఓడిరచారు. ఈ ఎన్నిక ద్వారా ప్రజల భవిష్యత్తును తిరగరాయబోతున్నాం’ అని వ్యాఖ్యానించారు. అహంకారంతో విర్రవీగితే.. ప్రజాస్వామ్యంలో వైకాపాకు పట్టినగతే పడుతుందని ప్రజలు నిరూపించారు. నా రాజకీయాలకు కుప్పం నియోజకవర్గం ఓ ప్రయోగశాల. వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకున్నా. చిత్తూరు జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. వచ్చే ఐదేళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటా. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తా. మొన్నటి ఎన్నికల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం. కేబినెట్‌లో 8మంది బీసీలకు అవకాశం కల్పించాం. వైకాపా పాలన పీడకల. అలాంటి పాలన ఎప్పుడూ చూడలేదు. వైకాపా ప్రభుత్వ దౌర్జన్యాలను ప్రజలు అసహ్యించుకున్నారు. ఏ తప్పూ చేయకున్నా 30మంది కార్యకర్తలను జైల్లో పెట్టారు. కుప్పం ప్రశాంతమైన స్థలం. ఇక్కడ హింసకు చోటులేదు. కుప్పంలో రౌడీయిజం చేసేవారికి అదే కడపటి రోజు.. జాగ్రత్త’ అని చంద్రబాబు హెచ్చరించారు.