అమరావతి: రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీఐడి అధికారులు…అనంతపురం జిల్లా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉన్న మునిరామయ్య అనే పోలీస్ అధికారి ఇచ్చిన విచారణ రిపోర్ట్‌ను పరిగణలోకి తీసుకోవాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సూచించారు. ఈ మేరకు సీఐడీ అడిషనల్ డైరెక్టర్ జనరల్‌కు శుక్రవారం వర్ల రామయ్య లేఖ రాశారు. గతంలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ బాధ్యతలను అప్పటి వైసీపీ ప్రభుత్వం మునిరామయ్యకు అప్పగించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి పాల్పడిన కొన్ని అవకతవకలపై వివరణ కోరుతూ ఆయనకు ముని రామయ్య షోకాజ్ నోటీసు ఇచ్చారన్నారు. ఎండీ వాసుదేవరెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చిన దర్యాప్తు అధికారి ముని రామయ్యపై విజిలెన్స్ ఉన్నతాధికారి కొల్లి రఘురామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసి, ఆయనను వెంటనే డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారన్నారు. వాసుదేవరెడ్డిపై విచారణ జరిపి, షో కాజ్ నోటీసు ఇచ్చిన పాపానికి ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీ నుండి జీతభత్యాలు లేకుండా మునిరామయ్య వీఆర్లోను ఉన్నారన్నారు. అవినీతి అధికారులను శిక్షించకపోగా… వారిపై విచారణ చేసిన పోలీసు అధికారులను శిక్షించడం ఏమిటని వర్ల రామయ్య మండిపడ్డారు. ధర్మవరం, తాడిపత్రి, అనంతపురంల్లో వాక్ ఇన్ లిక్కర్ షాపుల మంజూరులో అవినీతికి పాల్పడ్డ వాసుదేవరెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీఐడీ ఏడీజీని వర్ల రామయ్య కోరారు.