- నిందితులు స్పష్టంగా కనిపిస్తున్నా గుర్తుతెలియని వ్యక్తులుగా కేసులు
- సరైన సెక్షన్లు పెట్టలేదు, ఆధారాలు సేకరించలేదు
- నిందితులెవరో తెలిసినా అరెస్ట్ చేయలేదు
అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల రోజు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి అడుగడుగునా పోలీసుల వైఫల్యం కనిపించిందని సిట్ స్పష్టం చేసింది. ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై డీజీపీ కార్యాలయానికి సోమవారం సిట్ పూర్తి నివేదిక సమర్పించింది. 264 పేజీలతో రెండు వాల్యూమ్లుగా సిట్ నివేదిక ఉంది. ఈ అల్లర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని సిట్ తుది నివేదికను డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా.. కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. తుది నివేదికలోని నిర్ఘాంతపోయే కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. హింసాత్మక ఘటనల్లో 37 కేసులు నమోదు చేయగా, ఇప్పటికే 6 కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేసినట్టు వెల్లడిరచింది. నిందితులకు శిక్ష పడేవరకు ఎస్పీలు, డీఐజీలు పర్యవేక్షించాలని సూచించింది.
సార్వత్రిక ఎన్నికల సమయంలో హింసకు సంబంధించి సిట్ సభ్యులు కీలక అంశాలు గుర్తించారు. పోలింగ్ రోజు తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల బైక్ ర్యాలీలకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఇరువర్గాల అనుచరులు పెద్దసంఖ్యలో పాల్గొనడంతో పెద్దఎత్తున హింస చెలరేగింది. ఇది సెక్షన్ 144కు విఘాతం కలిగించడమే అని సిట్ రిపోర్టులో పేర్కొంది. తిరుపతి, పల్నాడు జిల్లాల్లో రాజకీయ నాయకుల వాహనాలు, ఆస్తులతోపాటు సామాన్యుల ఆస్తులూ విధ్వంసానికి గురయ్యాయి. పోలీసు వాహనాలను సైతం అల్లరి మూకలు దగ్ధం చేశారు. తద్వారా ప్రజల్లో భయం, అభద్రతా భావం కలిగించే ప్రయత్నం జరిగిందని సిట్ తెలిపింది. ఇదంతా పోలీసుల వైఫల్యమేనని పేర్కొంది.
పల్నాడు జిల్లాలో కేసులు నమోదు నుంచి విచారణ వరకూ పోలీసులు సీరియస్గా తీసుకోలేదని, నిందితులను సరిగా ప్రశ్నించకపోవడం, వారిపై నమోదు చేయాల్సిన సెక్షన్లు సరిగా పెట్టకపోవడం హింస కొనసాగింపునకు కారణమైదని తెలిపింది. ఈ కేసుల్లో చాలావరకూ నిందితులను గుర్తు తెలియని వ్యక్తులుగా చూపారని, నిందితులెవరో తెలిసినా నేటి వరకు అరెస్టు చేయలేదని రిపోర్టులో వెల్లడిరచింది. వీటిలో కొన్ని సంఘటనలు పట్టపగలు, నివాసిత ప్రాంతాల్లో జరిగినా సాక్షులను ప్రశ్నించి ఆధారాలు సేకరించలేదని తెలిపింది.
ఈవీఎంల ధ్వంసం కేసుల్లో నిందితులు కనిపిస్తున్నా.. వారిని గుర్తుతెలియని వ్యక్తులుగా చూపారని వెల్లడిరచింది. ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోందని.. దాన్ని వెంటనే ఎఫ్ఎస్ఎల్కు పంపి నిర్ధారించుకోవాలని తెలిపింది.
పోలింగ్ భూతుల్లో ఈవీఎంలు ధ్వంసం జరిగితే వీఆర్వో, బీఎల్వోలు ఫిర్యాదు ఆలస్యంగా ఇచ్చారని, నిజానికి ఫిర్యాదు చేయాల్సిన ప్రిసైడిరగ్ ఆఫీసర్ మరింత ఆలస్యం చేశారని పేర్కొంది. గాయపడిన వారి మెడికల్ రిపోర్టులు ఇంతవరకూ సేకరించకపోవడంతో కేసు బలహీనపడే అవకాశం ఉందని సిట్ తన తుది నివేదికలో పేర్కొంది.