అమరావతి(చైతన్యరథం): కౌంటింగ్ సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తేలా, హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్న వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్ని నానిపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులను ఎన్నికల సంఘం అదేశించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. వైసీపీ నాయకుల రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో కౌటింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు జరగకుండా మరింత భద్రతా ఏర్పాట్లు చేసేలా రాష్ట్ర డీజీపీని ఆదేశించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి వర్ల రామయ్య సోమవారం లేఖ రాశారు. మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఎన్నికల సంఘంపై అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల సంఘం నిర్ణయాలతో రాష్ట్రంలో అలర్లు చెలరేగే ప్రమాదం ఉందని మాట్లాడుతున్నారు. కౌంటింగ్‌లో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించకపోతే అధికారులకు తిప్పలు తప్పవని బెదిరిస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్లు నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదని వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గత నెల 29న చేసిన వ్యాఖ్యల మాదిరే పేర్ని నాని వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వీరిద్దరిపై పలు ఫిర్యాదులు చేశాము. సజ్జల రామకృష్ణారెడ్డిపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదయింది. సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్ని నాని బెదిరింపులకు బయపడి రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాలలో రిటర్నింగ్ అధికారులు సెలవులకు దరఖాస్తు చేశారు. వైకాపా నాయకులు మీడియా ముందు మాట్లాడేటప్పుడు భాష పట్ల జాగ్రత్తగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. సజ్జల, పేర్ని నానిల వ్యాఖ్యలు శాంతియుత, నిష్పాక్షిక ఎన్నికలకు విఘాతం కలిగించేలా ఉన్నాయి. వారిపై కఠిన చర్యలు తీసుకునేలా రాష్ట్ర పోలీసులను ఆదేశించాలని ఈసీని వర్ల రామయ్య కోరారు.