- రూ.4 వేల కోట్ల విలువ చేసే అసైన్డ్ భూములు స్వాహా చేశారు
- దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా సీఎస్ భూదోపిడీ
- దళితుల అసైన్డ్ భూములు అప్పనంగా కుమారుడికి కట్టబెట్టేందుకే జీవో నెం.596
- ఈసీ స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించాలి
- జవహర్ రెడ్డి పాస్ పోర్టు సీజ్ చేసి, నిరంతర నిఘా పెట్టాలి
అమరావతి(చైతన్యరథం): దొంగలు, దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా జగన్ రెడ్డి గ్యాంగ్ పేదల భూములను దోచుకొని, పంచుకుంటున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. విశాఖలో దళితులకు గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డి కుమారుడు దోచుకునేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. పేదవాడి భూములు కొట్టేసేందుకే సీఎస్ జవహర్ రెడ్డి జీవోలు విడుదల చేస్తున్నారా అని ప్రశ్నించారు. సుమారు రూ.4 వేల కోట్లు విలువచేసే 800 ఎకరాల అసైన్డ్ భూములను తన కుమారుడికి అప్పనంగా కట్టబెట్టేందుకు జీవో నెం.596 ను సీఎస్ విడుదల చేయడం ఘోరాతిఘోరం అన్నారు. రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులకు ఆదర్శంగా నిలబడాల్సిన సీఎసే బరితెగించి భూ బకాసురుడి అవతారం ఎత్తితే రాష్ట్రంలో ఇక పేదలకు న్యాయం చేసేదెవరు? న్యాయం చేయాల్సిన స్థానంలో ఉన్న సీఎస్.. తానే అన్యాయాలు చేస్తుంటే పేదల గతేమిటో అర్థం కావడం లేదు. గతంలో పేదలైన వృద్ధులను ఇబ్బంది పెట్టకుండా ఇళ్లవద్దనే పింఛన్లు ఇవ్వాలని టీడీపీ తరఫున మేము వెళ్లి సీఎస్ జవహార్ రెడ్డిని అడిగితే… చస్తే చావనివ్వండి అన్నట్లు నిర్లక్షంగా సమాధానం చెప్పారు. పేద ప్రజల ఉసురుపోసుకోవడం వల్లనే సీఎస్ జవహర్ రెడ్డి భూ బాగోతం బయటపడిరది. ఇలా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే దోపిడీలకు పాల్పడితే ఇక న్యాయం కోసం ప్రజలు ఎవరి దగ్గరకు వెళ్లాలని వర్ల ఆవేదన వ్యక్తం చేశారు.
ఉత్తరాంధ్రను దోచేశారు
ఉత్తరాంధ్రలో దాదాపు 60 శాతం భూములను కడప వాళ్లే కొట్టేశారు. కడప వాళ్లకి ఇక్కడ పనేంటని గతంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా అన్నారు. పేద దళితులకు జీవనోపాధి కోసం ప్రభుత్వమిచ్చిన అసైన్డ్ భూములను మదించిన ఏనుగుల్లాంటి ఇటువంటి అధికారులు, వారి అండతో రాజకీయ నాయకులు కొట్టేయడం దుర్మార్గం, పాపం కూడా. గతంలో కూడా జగన్‌రెడ్డి తండ్రి, తాత కూడా వేలాది ఎకరాల దళితుల భూములు దిగమింగి, సాక్షాత్తు శాసనసభలోనే అంగీకరించిన విషయం అందరికీ తెలిసిందే. దళితుల అసైన్డ్ భూములు కొనకూడదు, ఆక్రమించకూడదు అని చట్టాలున్నా ఎంతోమంది అధికారులు, బరితెగించిన రాజకీయ పెద్దలు, డబ్బు మదంతో కొట్టుమిట్టాడుతున్న వారు.. దళితుల అవసరాలను ఆసరాగా తీసుకొని కొద్దో గొప్పో డబ్బు వాళ్ల ముఖాన కొట్టి… వేలు కోట్ల విలువ చేసే అసైన్డ్ భూములను దోచేశారు. ఆ దళితులు మాత్రం భూమి లేని పేదవారిగా మునుపటి స్థితిలోనే మగ్గుతున్నారని వర్ల అన్నారు.
సీఎస్‌ను ఈసీ నియంత్రించాలి
చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దళితుల అసైన్డ్ భూములను దోచుకున్న వారందరిపైనా చర్యలు తీసుకుంటాం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, దళితుల భూములను కాజేసి, వారికి అన్యాయం చేస్తున్న సీఎస్ జవహర్ రెడ్డి, ఆయన కుమారుల్లాంటి ఘరానా పెద్దలను వదలకుండా శిక్షించి, వారి వద్ద నుండి అసైన్డ్ భూములు స్వాధీనం చేసుకొని, రాష్ట్రంలోని పేదవారికి పంచాలని, అవసరమైతే అసైన్డ్ భూములను కొట్టేసిన భూబకాసురులపై ‘ఒక కమిషన్’ వేయాలని కూడా చంద్రబాబును కోరతాం. సీఎస్ జవహర్ రెడ్డి ఈ రోజు నుండి ఏ ఫైల్ మీద సంతకం చేయకుండా, ముఖ్యంగా భూ వ్యవహారాలకు చెందిన ఫైల్స్ చూడకుండా ఎన్నికల సంఘం నియంత్రించాలి. విశాఖకు చెందిన ఏ అధికారి కూడా సీఎస్‌ను కలవకుండా నిరోధించాలి. దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులను అలెర్ట్ చేసి సీఎస్ జవహర్ రెడ్డి విదేశాలకు పారిపోకుండా పాస్‌పోర్ట్‌ను స్వాధీన పరుచుకోవాలి. ఆయన కదలికలపై నిరంతర ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలని వర్ల డిమాండ్ చేశారు.
సీబీఐ విచారణకు ఆదేశించాలి
సీఎస్ భూ దోపిడీపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి, సీబీఐ దర్యాప్తుకు ఆదేశించి, ఈ వ్యవహారంలో పూర్తి నిజానిజాలు బయటకుతీయాలి. భూ కబ్జాదారులపైన, కఠిన చర్యలు తీసుకోవాలి. జవహర్ రెడ్డి రిటైర్ కాకుమునుపే విచారణ పూర్తి చేయాలి. శుప్తచేతనావస్థలో సీఎస్‌ను పెట్టి, ఆయనను విచారించి, ఆయన భూబాగోతాలను ప్రజలకు తెలియజేయాలి. గత ఐదేళ్లుగా విశాఖ, విజయనగరం జిల్లాల్లో జరిగిన భూముల క్రయ విక్రయాలపై కూడా ‘మరో కమిషన్’ వేసి విచారణ జరిపించాలని చంద్రబాబును కోరుతామని వర్ల తెలిపారు.