- ఉత్తరాంధ్రలో భారీ అసైన్డ్ భూ కుంభకోణం
- రూ.2వేల కోట్ల విలువచేసే 800 ఎకరాలు హాంఫట్
- నెలముందు.. ఇల్లు చక్కబెడుతున్న సీఎస్
- ఎన్నికల హడావుడిలో జనం దృష్టి మరల్చి..
- జీవో 596ను అడ్డం పెట్టుకొని భూకుంభకోణం
- భోగాపురం ఎయిర్‌పోర్టు చుట్టూ భూములు
- వైసీపీ రాదన్న భయంతోనే కంగారు రిజిస్ట్రేషన్లు
- బాంబుపేల్చిన జనసేన నేత పీతల మూర్తి యాదవ్
అమరావతి (చైతన్య రథం): సార్వత్రిక ఎన్నికల హడావుడిలో రాష్ట్రంవుంటే.. రాష్ట్రాన్ని చక్కదిద్దాల్సిన ప్రభుత్వ పెద్ద ఇల్లు చక్కబెట్టుకునే పనిలో నిమగ్నమయ్యాడు. మరో నెలరోజుల్లో ఉద్యోగ బాధ్యతల నుంచి విముక్తుడుకానున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శే.. వెళ్తూ వెళ్తూ ఓ రెండువేల కోట్ల ప్రజాధనం పాకెట్‌లో పెట్టుకుపోవడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అయితే ఈ కుంభకోణం వెలుగు చూసేది కాదు. కూటమి గెలుపు ఖాయమైందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్న తరుణంలో.. వెళ్తూ వెళ్తూ చేతికందింది చంకలో పెట్టుకుని పోవడానికి ప్రభుత్వ పెద్ద ప్రణాళిక వేసుకున్నట్టే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌కు అవిభక్త విధేయుడిగా పేరుబడిన ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి భూకుంభకోణం బహిర్గతమయ్యేసరికి.. పాలకపక్ష కీలకనేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. విధివిధానాలు తుంగలో తొక్కైనా.. జగన్ సర్కారును మళ్లీ గద్దెనెక్కించేందుకు వీరోచిత విధి నిర్వహణకే సిద్ధపడిన జవహర్‌రెడ్డి భూబాగోతం రాష్ట్రంలో ప్రకంపనాలు సృష్టిస్తోంది. రాష్ట్ర యంత్రాంగాన్ని నడిపించే కీలక బాధ్యతల్లో ఉండి.. ప్రభుత్వాధినేత వెన్నంటి నీడలా వ్యవహరిస్తున్న సీఎస్‌ను ఆ స్థానం నుంచి తప్పించమంటూ సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినపుడే `తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ప్రధాన కార్యదర్శి పదవిలో జవహర్‌రెడ్డి, రాష్ట్ర పోలీస్ బాస్‌గా రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నంత వరకూ.. సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛంగా, శాంతియుతంగా జరిగే అవకాశం ఉండదంటూ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలోనూ తెదేపా పలుమార్లు ఈసీకి విజ్ఞప్తి చేస్తూ వచ్చింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై వేటుపడిరదిగానీ, సీఎస్ జవహర్‌రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్యా తీసుకోలేకపోయింది. అప్పటికే భూబదలాయింపు వ్యవహారంలో తీవ్రంగా నిమగ్నమైవున్న జవహర్‌రెడ్డి.. భారీ ప్రయత్నాలతోనే తన సీటును పదిలం చేసుకున్నారు. కొట్టేసిన అసైన్డ్ భూములను బినామీల పేరిట ట్రాన్స్‌ఫర్ చేయించే పనుల్లో జవహర్ రెడ్డి తీవ్ర తలమునకలైవున్న తరుణంలో `కుంభకోణం తీగ కదిలి డొంకంతా బయటపడిరది. ఉత్తరాంధ్రాలో రెండు వేల కోట్ల రూపాయల విలువ చేసే అసైన్డ్ భూములను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్‌రెడ్డి కొట్టేశారంటూ విశాఖపట్నానిక చెందిన జనసేన పార్టీ సీనియర్ నేత పీతల మూర్తియాదవ్ బాంబుపేల్చారు. రాష్ట్రంలో ఒకపక్క ఎన్నికల హింసమీద విచారణ జరుగుతుంటే, సీఎస్ విశాఖవచ్చి భూ వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారని మీడియా ముందు కుండబద్దలుకొట్టారు.
ఇదీ భూదందా సాగిన విధానం..
సీఎస్ కొట్టేసిన భూముల్లో ఎస్సీ, ఎస్టీలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన ఆసైన్డ్ భూములు ఎక్కువగా ఉన్నాయని, పాలకపక్షం వైసీపీతో అంటకాగుతున్న జవహర్‌రెడ్డి ఇదే అదనుగా భూముల మార్పిడికి జీవో 596 జారీ చేసి, దాని ఆధారంగా భూ దోపిడీకి తెరలేపారని మూర్తియాదవ్ సంచలనమే రేపారు. భోగాపురం ఎయిర్‌పోర్టుపై సమీక్ష సాకుతో నాలుగు రోజుల కిందట విశాఖకు వచ్చిన సీఎస్ జవహర్.. భూముల రిజిస్ట్రేషన్ పని చక్కబెట్టుకున్నారని సంచలన విషయాలు వెల్లడిరచారు. ‘నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్న సీఎస్ జవహర్‌రెడ్డి భారీగా భూ అక్రమాలకు తెరలేపారు. ఉత్తరాంధ్రలో రూ.2వేల కోట్ల విలువైన అసైన్డ్ భూములను కొట్టేశారు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు స్వీకరించాకే.. భూముల మార్పిడి జీవో 5898 ఇచ్చారు. ఆ జీవో ఆధారంగానే సీఎస్ కుమారుడు విశాఖలో 800 ఎకరాలకు పైగా భూములు చేజిక్కించుకున్నారు. 400 ఎకరాల ఎస్సీ, బీసీ అసైన్డ్ భూములను బినామీల పేరిట సొంతం చేసుకున్నారన్నది నిజం. విశాఖ, విజయనగరం జిల్లాల్లోని అసైన్డ్ భూములపై కన్నేసిన సీఎస్.. కుమారుడిని రంగంలోకి దింపారు. ఇక్కడి భూములను మింగేసేందుకు ముందుగా బినామీ ముఠాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎకరం రూ.2 కోట్లు పలికే భూములను ఐదారు లక్షలకే జవహర్‌రెడ్డి ముఠా ఒప్పందాలు చేసుకుంది. వైకాపా ప్రభుత్వం మళ్లీ రాదన్న భయంతో హడావుడి రిజిస్ట్రేషన్లకు సిద్ధమయ్యారు. ఈసీ జోక్యం చేసుకొని అక్రమ భూ రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలి. రాష్ట్రవ్యాప్తంగా మార్చినుంచి జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలి. అసైన్డ్ భూములు కొట్టేసిన వైకాపా నేతలు, ఐఏఎస్‌లపై సీబీఐ విచారించాలి’’ అని పీతల మూర్తియాదవ్ డిమాండ్ చేశారు.
800 ఎకరాలకు పైగా డీల్ నడిచింది..
సీఎస్ జవహర్ రెడ్డి తన కుమారుడిని బినామీగాపెట్టి 800 ఎకరాలకు పైగా భూముల డీల్ చేశారన్నది మూర్తి ఆరోపణ. ఎన్నికల ముందే అడ్వాన్సులు తీసుకున్న అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు ఇప్పుడు చకచకా జరిగిపోతున్నాయి. పని త్వరగా పూర్తి చేయాలని అధికారులమీద సీఎస్ జవహర్‌రెడ్డి తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేసి, సీబీఐతో విచారణ జరిపిస్తే.. సంచలన విషయాలు బయటపడతాయన్న వాదన వినిపిస్తోంది.
రోమ్ తగలబడుతుంటే..
రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు.. రాష్ట్రం మొత్తం ఎన్నికల హింసతో రగులుతుంటే.. సీఎస్ జవహర్ మాత్రం విశాఖ వచ్చి భూ వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నాడని మూర్తియాదవ్ విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఎలాంటి అనుమానం రాకుండా.. భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు పరిశీలనకు వచ్చానని, సీఎం జగన్ మోహన్‌రెడ్డి మళ్లీ ప్రమాణ స్వీకారం ఏర్పాట్లూ సమీక్షించినట్టు చెప్పడం విడ్డూరమన్నారు. జగనన్న పేద ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి ఒక్క విశాఖలోనే రెండు వేల కోట్ల భూములు కొట్టేస్తే.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఇంకెంత కొట్టేశారో దర్యాప్తుతో వెలికి తీయాలని మూర్తియాదవ్ డిమాండ్ చేశారు. దేశంలో సివిల్ సర్వేంట్లు నిరాంతపోయేలా… రాజకీయ నేతలు షాక్‌కు గురయ్యేలా… వేలకోట్ల భూ కుంభకోణానికి నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్న సీఎస్ జవహర్‌రెడ్డి తెరలేపారని దుయ్యబట్టారు. ఇఫ్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వెయ్యి కోట్ల పైచిలుకు ధర పలికే 400 ఎకరాల ఎస్సీ, బీసీల అస్సైన్డ్ భూములను కుమారుడిని అడ్డంపెట్టి బినామీల పేరిట చేజిక్కించుకున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మరో 400 ఎకరాలకుపైగా భూములను ఆగమేఘాల మీద రిజిస్ట్రేషన్ చేయించేందుకు యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారన్నది విశాఖలో వినిపిస్తోన్న మాట.
ఈసీ ఆగ్రహం పట్టని సీఎస్!
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, తరువాతా రాష్ట్రంలో తలెత్తిన ఎన్నికల హింసపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినా.. సీఎస్‌కు చీమకుట్టినట్టు కూడా లేదు. పైగా రాష్ట్ర ప్రజల దృష్టిమొత్తం దానిపై ఉండగానే.. విశాఖ వచ్చి అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహరాన్ని సమీక్షించి మరింత వేగంగా పని పూర్తయ్యేలా తన అధికారంతో క్రిందిస్ధాయి సిబ్బందిపై వత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.
జీవో 596ను అడ్డం పెట్టుకొని…
నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలంటూ సీఎం జగన్‌రెడ్డి కపట ప్రేమ చూపిస్తూనే.. వారి చేతుల్లోవున్న కొద్దిపాటి అసైన్డ్ భూములు లాక్కునేందుకు వీలుగా జీవో 596 తెచ్చారు. ఆ జీవో ప్రకారమే.. అసైన్డ్ భూములను వారసులకు, అనుభవదారులకు ఫ్రీహోల్డ్ సర్టిఫికేట్ జారీచేసి భూమిపై సర్వ హక్కులూ కల్పించారు. అంటే ఫ్రీహోల్డ్ సర్టిఫికేట్ జారీ అయితే భూములను 22ఏ నుంచి తప్పిస్తారన్న మాట. ఈమేరకు సెక్షన్ 35 ఆఫ్ 2023 పేరిట చట్టం చేశారు. దీంతో ఇస్టానుసారంగా అసైన్డ్ భూములను అమ్ముకోవచ్చు. దీన్ని ఆసరా చేసుకుని.. జీవో రాకముందే జవహార్‌రెడ్డి అసైన్డ్ భూములు ఎక్కువగావున్న విశాఖ, విజయనగరం జిల్లాలపై కన్నేసి కుమారుడిని రంగంలోకి దింపారు. జవహర్ తనయుడు, తన ముఠాను రంగంలోకి దింపి బెదిరించి, భయపెట్టి ఐదు, పది లక్షలకే ఎకరా చొప్పున కొన్ని వందల ఎకరాలు అగ్రిమెంట్లు చేసుకొన్నారు. బహిరంగ మార్కెట్‌లో ఎకరా రెండు కోట్లుకు పైగా ఉన్నచోట కూడా ఎకరా ఐదారు లక్షలకే జవహార్ రెడ్డి ముఠా ఒప్పందాలు చేసుకొని అడ్వాన్సులు ముట్టజెప్పినట్టు సమాచారం.
వైసీపీ ప్రభుత్వం రాదన్న భయంతో…
పోలింగ్ వరకూ భూముల గురించి పెద్దగా పట్టించుకోని జవహార్‌రెడ్డి ముఠా.. సీఎం జగన్ విదేశీయానానికి వెళ్లగానే.. భూముల రిజిస్ట్రేషన్లపై మంత్రాంగం మొదలెట్టారు. కౌంటింగ్ తేదీకి నాలుగైదు రోజుల ముందుగానే భూముల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేందుకు విశాఖ, విజయనగరం అధికారులపై తీవ్ర వత్తిడి తీసుకొచ్చి అర్ధరాత్రి వరకూ పనులు చేయిస్తున్నట్టు మూర్తియాదవ్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం తిరిగి రాకపోతే తనను వెంటనే పదవిలోనుంచి తప్పించే ప్రమాదం వుందని గ్రహించిన జవహార్ రెడ్డి, రాష్ట్ర పాలనను పక్కనపెట్టి అమరావతి నుంచి వ్యవహారాలను సమీక్షించడం మీదే సమయం వెచ్చిస్తున్నారని స్పష్టం చేశారు.
భోగాపురం విమానాశ్రయం కేంద్రంగా..
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూవున్న వందల ఎకరాల అసైన్డ్ భూములపైనే జవహార్ కన్నేసినట్టు కనిపిస్తోంది. విమానాశ్రయం ఏడాదిలో పూర్తికానున్నందున, చుట్టుపక్కల భూములకు మంచి డిమాండు ఉంటుందన్న భావనతో వాటిని చేజిక్కించుకున్నట్టు తెలుస్తోంది. భోగాపురం విమానాశ్రయానికి దగ్గరలోవున్న విజయనగరం జిల్లా పరిధిలో పూసపాటిరేగ, డెంకాడ, నాతవలసలలో పెద్ద సంఖ్యలో భూములు రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం జరుగుతున్నాయని మూర్తియాదవ్ చెప్పారు. వీటితోపాటు విశాఖ జిల్లా పరిధిలోని అత్యంత విలువైన ఆనందపురం, పద్మనాభం, భీమిలి మండలాల్లో వందలాది ఎకరాలను జవహార్‌రెడ్డి టీం చేజిక్కించుకొందన్నది మూర్తియాదవ్ చేస్తోన్న ఆరోపణ.
గుడిలోవ, గండిగుండం, తర్లువాడ, గిరజాల, రామవరం, రావాడ, రావివలస, ముక్కాం, సవరవల్లి, తూడెం, బీటీ కల్లాలు, భీమ దొరపాలెం, ఐనాడ కనమాం తదితర గ్రామాల్లో జవహార్‌రెడ్డి వత్తిడితో వందల ఎకరాలు చేతులుమారి రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి. వైసీపీ నేతలు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ముఠా, మంత్రి మేరుగు నాగార్జున ముఠా, సీఎం సతీమణి వైఎస్ భారతి పేరిట ఒక ముఠా ఈ ప్రాంతాల్లో భూములను చేజిక్కించుకుంటున్నట్టు బలంగా వినిపిస్తోంది. ఈ ముఠాలను తాజాగా జవహార్ రెడ్డి ముఠా డామినేట్ చేసింది. ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని అక్రమంగా, అన్యాయంగా జరుగుతున్న అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్లను నిలిపివేసి.. వైసీపీ నేతలు, ఐఏఎస్‌లపై సీబీఐ విచారణ జరపాలని మూర్తియాదవ్ డిమాండ్ చేశారు. ఇదిలావుంటే, తానుగాని, తన కుటుంబంగానీ విశాఖ పరిసరాల్లో ఎలాంటి అసైన్డ్ భూములు కొనుగోలు చేయలేదని సీఎస్ జవహర్ రెడ్డి చెబుతున్నారు. పీతల మూర్తియాదవ్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కొట్టిపారేశారు.