- చివరి ఘడియల్లోనూ జగన్‌రెడ్డిది అదే వక్రబుద్ధి
- బస్సులు రద్దు చేసి ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఆర్టీసీ
- ఓటేసేందుకు ఎక్కడెక్కడినుంచో వచ్చి విజయవాడలో బస్సుల కోసం జనం పడిగాపులు
- బస్సులైతే ఆపగలరు.. ఓటెయ్యకుండా ఆపగలరా?
అమరావతి(చైతన్యరథం): ఐదేళ్లూ కుట్రలు, కుతంత్రాలతోనే గడిపేసిన జగన్‌రెడ్డి ప్రభుత్వం చివరి ఘడియల్లోనూ అదే వైఖరి ప్రదర్శిస్తోంది. సొంత రాష్ట్రంలో ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి అష్టకష్టాలు పడి విజయవాడ చేరుకున్న వారికి స్వస్థలాలకు వెళ్లేందుకు అవసరమైన బస్సులు ఏర్పాటు చేయకపోవటంతో వారంతా అష్టకష్టాలు పడ్డారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వారికి మాత్రం విజయవాడ బస్టాండ్‌లో ఆదివారం పట్టపగలే ఆర్టీసీ చుక్కలు చూపించింది. సొంతూళ్లకు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులతో విజయవాడ బస్టాండ్‌లో విపరీతమైన రద్దీ పెరిగింది. అయితే రద్దీకి సరిపడా బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేయలేదు. ప్రత్యేక సర్వీసులును ఏర్పాటు చేయాల్సిన పరిస్థితుల్లో రెగ్యులర్ సర్వీసులను కూడా కారణం చెప్పకుండా రద్దుచేసి ప్రయాణికులను మరిన్ని ఇబ్బందులకు గురిచేసింది. ప్రయాణికుల అవస్థలు తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు వెంటనే ఆర్ట్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు ఫోన్ చేసి ఓటు వేసేందుకు వస్తున్న వారికి ప్రత్యేక బస్సులు వేయాలని కోరారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి వచ్చేవారికి బస్సుల ఏర్పాటు చేయాలని కోరారు. ప్రధాన పట్టణాల నుంచి జిల్లాలకు అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ నుంచి ఏపీకి లక్షల మంది జనం తరలి వచ్చారు. వారు ఎవరికి ఓటేస్తారన్న సంగతి అటుంచితే.. తాము ఎక్కడ ఉన్నా తమ రాష్ట్ర భవిష్యత్‌లో తమ పాత్ర కూడా ఉండాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఏపీకి వచ్చారు. ఈ డిమాండ్ ముందుగా ఊహించిందే. అందుకే తెలంగాణ ఆర్టీసీ కనీసం ఐదువందల ప్రత్యేక బస్సుల్ని పెట్టింది. కానీ ఏపీఆర్టీసీ మాత్రం పూర్తిగా వదిలేసింది. ప్రత్యేక బస్సుల ప్రస్తావన తీసుకు రాలేదు. హైదరాబాద్ బస్టాండ్‌లో ప్రతి బోర్డింగ్ పాయింట్ వద్ద వేల మంది కనిపించారు. ప్రజల అవసరాలకు తగ్గట్లుగా బస్సుల్ని ఏర్పాటు చేయడం ఆర్టీసీ చేయాల్సిన పని. దసరా, సంక్రాంతి వంటి సందర్భాల్లో వేల బస్సులు పెడతారు. పెద్ద ఎత్తున జనం వస్తారు. కానీ ఈ సారి ఆ పని కూడా చేయలేదు. వైసీపీ సిద్దం సభలకు.. వేల బస్సులు కేటాయించారు. ఎంత మొత్తం చెల్లిస్తారో .. అద్దె ఎంతో ఎవరికీ తెలియదు. సొంతూళ్లో ఓటు వేసేందుకు వచ్చిన వారిని మాత్రం.. ఉద్దేశపూర్వకంగా బస్సు సర్వీసులు తగ్గించి ఇబ్బందులకు గురిచేసింది. దీంతో ఆదివారం మొత్తం విజయవాడ, విశాఖపట్నం బస్టాండ్లు కిటకిటలాడాయి. విజయవాడ నుంచి గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరు తదితర ప్రాంతాలకు బస్సుల కొరత కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రయాణికులు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు బస్టాండ్‌లో గంటల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది.
విజయవాడ నుంచి గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరు తదితర ప్రాంతాలకు బస్సుల కొరత తీవ్రంగా ఉంది. అటు ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు సరిపడా లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం 5 గంటల నుంచి బస్టాండ్లోనే పడిగాపులు కాయాల్సివచ్చింది. ప్రత్యేక బస్సులు అందుబాటులో లేవని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రిజర్వేషన్ కేంద్రాల వద్ద భారీ క్యూ ఏర్పడటంతో ఇబ్బందులు తప్పడం లేదు. రెగ్యులర్ సర్వీసులు కూడా ఏ మాత్రం సరిపోవడంలేదు.. ఏ ప్రాంతానికీ ప్రత్యేక బస్సులు తిరగడం లేదని ప్రయాణికులు తెలిపారు. బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. రిజర్వేషన్ కేంద్రాల వద్ద భారీ క్యూలతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. కనీసం రిజర్వేషన్ కేంద్రాల సంఖ్యను, సిబ్బందిని కూడా ఆర్టీసీ పెంచలేదు. దీంతో ఆర్టీసీ తీరు పట్ల ప్రయాణికులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
పలు ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసుల రద్దు
ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితుల్లో రెగ్యులర్ సర్వీసులను కూడా కారణం చెప్పకుండానే రద్దు చేశారు. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఆర్టీసీ రద్దు చేసింది. ఉభయ గోదావరి, ఉత్తరాంద్ర సహా పలు ప్రాంతాలకు విజయవాడ నుంచి వెళ్లే 48 దూర ప్రాంత సర్వీసులను రద్దు చేశారు. రద్దు చేసిన బస్సుల వివరాలను పండిట్ నెహ్రూ బస్టాండ్లో సమాచార కేంద్రం వద్ద నోటీసులో ప్రదర్శించారు. కానీ దీనికి గల కారణాలను మాత్రం అధికారులు తెలపలేదు. అదనపు బస్సులు ఏర్పాటు చేయాల్సింది పోయి ఉన్న బస్సులను తీసేయడమేంటని ప్రయాణికులు మండిపడుతున్నారు. దానికితోడు రద్దీ సమయంలో ఉన్నతాధికారులు కార్యాలయాల్లో లేకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖపట్నం బస్టాండ్లో..
ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో విశాఖపట్నంలోని ద్వారకా బస్స్టేషన్ కిటకిటలాడిరది. నగరం నుంచి శ్రీకాకుళం, విజయనగరంతో పాటు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున ప్రయాణికులు తరలివచ్చారు. టికెట్ కౌంటర్ల వద్ద బారులు తీరారు. సరిపడా బస్సులు లేకపోవడంతో బస్టాండ్లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది.. రద్దీకి తగ్గట్టు ఆర్టీసీ అధికారులు బస్సుల ఏర్పాటు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాఉంటే ఓటు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్లను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ నేపథ్యంలో, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీతో మాట్లాడామని చెప్పారు.
కాగా ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లినా బాధ్యతతో ఓటేయడానికి వస్తున్న వారికి సరిపడా సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేయాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఎలక్షన్ కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర సిటీల నుంచి జనం పెద్ద సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారని చెప్పారు. అయితే, పెద్ద సంఖ్యలో బస్టాండ్లకు చేరుకున్న జనాలకు సరిపడా బస్సులు లేవని తెలిపారు. బస్సుల కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్న వారి కోసం అదనంగా బస్సులు తిప్పాలని కోరారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులను కోరారు. సీఎం జగన్ సభలకు ఆగమేఘాలమీద బస్సులను ఏర్పాటు చేసే అధికారులకు రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తున్న జనాల సమస్యలు కనిపించడంలేదా అని నిలదీశారు.