- భూహక్కు’తో ప్రజల ఆస్తులకు రక్షణ కరవు
- పట్టాదార్ పుస్తకాలపై జగన్ బొమ్మ లేకిచేష్టలు
- అధికారంలోకి రాగానే చట్టాన్ని రద్దు చేస్తాం
- జగన్ శవరాజకీయాలకు అవ్వ తాతలు బలి
- ఓటమి భయంతో జగన్ క్లాస్ వార్ అంటూ కబుర్లు
- అక్కడ మోదీ గ్యారెంటీ.. ఇక్కడ కూటమి ష్యూరిటీ
- దర్శి ప్రజాగళం సభలో చంద్రబాబు ధీమా..
దర్శి (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరిట జగన్ సర్కారు తీసుకొచ్చిన చట్టం ప్రయివేట్ ఆస్తులూ కొల్లగొట్టడానికేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల భూములు, పట్టదారు పాస్ పుస్తకాల మీద జగన్ పెత్తనమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. పట్టాదారు పాస్ పుస్తకంపై యజమాని బొమ్మ ఉండాలిగానీ, జగన్ బొమ్మలేంటని నిలదీశారు. పాత చట్టాలను పక్కనపెట్టి కొత్త చట్టంతో మీ భూములన్నీ జగన్ స్వాధీనంలో ఉండేవిధంగా ఆన్‌లైన్‌లో భద్రపరుస్తారని ప్రజలకు వివరించారు. ఆ బాధ్యతను క్రిటికల్ రివర్ అనే ప్రయివేట్ కంపెనీకి అప్పగించారని అంటూ, చట్టం పూర్తిగా అమల్లోకి వస్తే మీ భూములు సైకో గుప్పిట్లో ఉన్నట్టేనన్నారు. ఆన్‌లైన్ రికార్డుల్ని మార్చేస్తే ఇక మీ భూములు గోవిందా అని చంద్రబాబు హెచ్చరించారు. భూములు అమ్ముకొవాలన్నా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ పర్మిషన్ ఉంటేనే సాధ్యమని, లేదంటే లేనట్టేనన్నారు. ఒకవిధంగా రాష్ట్రంలోకి ప్రైవేట్ ఆర్మీ రాబోతుందని అంటూ, చట్టం అక్టోబర్ 2023 నుంచి అమల్లోకి వచ్చేసిందని, అందరి మెడలకు ఉరితాళ్లు వేసి బటన్‌ను తనదగ్గర జగన్ పెట్టుకున్నాడన్నారు. భారత ప్రభుత్వ రికార్డుల్లో ఉండాల్సిన భూముల వివరాలు.. కాలిఫోర్నియాలోని జగన్ బినామీ క్రిటికల్ రివర్ సంస్థకు అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో మీ భూమికి భద్రత ఉందా? చట్టాన్ని ప్రజలు ఆమోదిస్తారా? నల్లచట్టాన్ని చించి చెత్తబుట్టలో పారేద్దామా? వద్దా?అని చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం దర్శిలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడారు.
డబుల్ ఇంజన్ సర్కారు ఖాయం
అటు కేంద్రం ఇటు రాష్ట్రంతో డబుల్ ఇంజన్ సర్కార్ ఏపీలో రాబోతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. దేశాన్ని 2047కి నెంబర్ వన్ చేయాలనేది మోదీ సంకల్పమైతే, తెలుగు జాతిని ప్రపంచంలోనే నెంబర్ వన్ చేయాలన్నదే కూటమి సంకల్పమన్నారు. మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఒంగోలు బ్రాండ్ అని అంటూ, ఆయన్ను కాదని ఎర్రచందనం స్మగ్లర్‌ని సైడో తెచ్చాడన్నారు. సమర్థ నాయకుడి కడుపున పుట్టిన గొట్టిపాటి లక్ష్మి మంచి వైద్యురాలే కాదు, దక్షత కలిగిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారన్నారు. ఇద్దరు సమర్థులను గెలిపించుకుంటే దర్శి నియోజకవర్గం మంచి అభివృద్ధి సాధిస్తుందన్నారు. మీ ప్రాంతానికి ఎర్రచందనం స్మగ్లర్‌ను జగన్ అభ్యర్థిగా పెట్టాడని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తం కావాలన్నారు.
జగన్ రక్తాన్ని పీలిస్తే కూటమి రక్తాన్నిస్తుంది
సంక్షేమానికి బడ్జెట్‌లో టీడీపీ 19.15 శాతం నిధులు పెడితే, జగన్ సర్కారు 15.8 శాతం మాత్రమే పెట్టిందన్నారు. చేయని పనికి గప్పాలు కొట్టుకోవడం తప్ప, జగన్ చేసిందేమీ లేదని చంద్రబాబు విమర్శించారు. చంద్రన్న బీమా, పెళ్లి కానుకలు, ఆదరణ కింద బీసీలకు ఆధునిక పనిముట్లు, రంజాన్ తోఫా, అన్న క్యాంటీన్, డ్రిప్ ఇరిగేషన్, ట్రాక్టర్ల మీద సబ్సిడీలు, విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, చేనేత, మత్స్య కార్మికులకు రాయితీలు జగన్ ఇచ్చాడా? అని ప్రజలను ప్రశ్నించారు. ఎస్సీలకు 27 పథకాలు, బీసీలకు 30 పథకాలు, మైనారిటీలకు 10 పథకాలు పెడితే రద్దు చేసిన మూర్ఖుడు జగన్ అని దుయ్యబట్టారు. జగన్ జలగలా జనాల రక్తాన్ని పీలిస్తే కూటమి రక్తాన్ని ఎక్కిస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అవినాష్‌కి గొడ్డలిచ్చి రాష్ట్రం మీదకు వదిలారు
వివేకా హత్య కేసులో నిందితుడు అవినాష్‌ను పక్కనపెట్టుకుని తిరుగుతూ.. అవినాష్ చిన్న పిల్లాడని జగన్ కితాబు ఇవ్వడంపై చంద్రబాబు ధ్వజమెత్తారు. అవినాష్ పిల్లాడైతే పలకా బలపం ఇచ్చి స్కూలుకు పంపాలని ఎద్దేవా చేస్తూ.. అవినాష్‌కు గొడ్డలి ఇచ్చి కడపమీదకు పంపావని జగన్‌పై ధ్వజమెత్తారు. శవరాజకీయాలు జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య అంటూ.. అప్పుడు కోడికత్తి డ్రామా, ఇప్పుడు గులకరాయి డ్రామాతో జగన్ సింపతీ కోసం తాపత్రయపడుతున్నాడని ఆగ్రహించారు.
వృద్ధుల మరణాలపై జగన్ ఓట్లాట!
అవ్వతాతలకు ఇంటివద్దే పింఛను ఇచ్చే అవకాశం, అందుకు తగినంత అధికార యంత్రాంగం ఉన్నప్పటికీ, పింఛను పంపిణీని జగన్ సర్కారు రాద్దాంతం చేసి వృద్ధుల ప్రాణాలు తీసిందని చంద్రబాబు తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. పేదలపై జగన్ కక్ష కారణంగా గత నెలలో 33మంది పింఛనుదారులు మరణిస్తే, ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరగలేక ఏడుగురు పింఛనుదారులు మరణించారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పేదలను చంపి, విపక్షంపై నేరంమోపి, ముసలి మరణాలపై జగన్ ఎన్నికల లబ్దిపొందాలని చూస్తున్నాడన్నారు. సూపర్ సిక్స్ పథకాల సహా అద్భుతమైన మేనిఫెస్టో కూటమి ఇచ్చిందని, దానిముందు వైసీపీ మేనిఫెస్టో వెలవెలబోతోందని చంద్రబాబు అన్నారు. ఎన్నికలలో విజయం సాధించి అబద్ధాల కోరును భూస్థాపితం చేయాలన్నారు.
కూటమి వస్తే అదనపు సంక్షేమం
కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచీ పేదలకు అదనపు సంక్షేమం అందుతుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. లబ్దిదారులకు నెలకు రూ.4వేలు పింఛన్, దివ్యాంగులకు రూ.6వేలు, కాళ్లు చేతులు లేని వాళ్లకు రూ.15వేలు, తలసేమియా, కిడ్నీ రోగులకు రూ.10వేలు ఇస్తామన్నారు. సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్త్తూ చనిపోతే రూ.10 లక్షలు, రూ.25 లక్షలతో ఆరోగ్య బీమా కల్పిస్తామని చెప్పారు. బీసీ డిక్లరేషన్ తెస్తామని, బీసీలు నా కుటుంబ సభ్యులంటూ, వారికి రూ.1.5 లక్షల కోట్ల బడ్జెట్ పెడతామన్నారు. ఆదరణకు రూ.5వేల కోట్లు, ఉపాధికి రూ.10వేల కోట్లు ఖర్చు పెడతామన్నారు. దేవాలయాల్లో పని చేసే నాయి బ్రాహ్మణులకు నెలకు రూ.25వేలు, 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తామన్నారు. డ్రైవర్లకు రూ.15వేలు ఇస్తాం. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని అంటూ.. పేదరికం లేని సమాజ నిర్మాణం తన లక్ష్యమని ప్రకటించారు.
దర్శిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం
దర్శిలో ఇంటర్ నేషనల్ డ్రైవింగ్ స్కూళ్లును మళ్లీ తీసుకువస్తానని చంద్రబాబు ప్రకటించారు. దొనకొండలో పరిశ్రమలు పెడతాను. దర్శికి సాగునీటి ఎద్దడి లేకుండా చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తే.. జగన్ నాశనం చేశాడన్నారు. ప్రతి ఇంటికి సురక్షిత నీరిస్తానని, ఒక్క అడుగూ ముందుకుపడని తాళ్లూరు మొగిలిగుండాల రిజర్వాయర్ తాను వచ్చాక పూర్తి చేస్తానన్నారు. నడికుడి `కాళహస్తి రైల్వే వస్తే ఈ ప్రాంతంలో హైదరాబాద్, తిరుపతి పోవాలంటే దర్శి నుంచి నేరుగా వెళ్లొచ్చంటూ, దీనిని పూర్తి చేస్తానన్నారు. పెద్ద ఉయ్యాల వాడలో రాకపోకల కోసం మూసినదిపై వంతెన, బొట్లపాలెం దొర్నపు వాగుపై ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి చేయాలన్నారు. రాగమక్కపల్లి వద్ద ఎంఎస్‌ఎంఈ ప్రాజెక్టు రూ.7 కోట్లతో ప్రారంభించిన పనులు ఆగిపోయాయి. చందోర వద్ద రూ.6 కోట్ల ఓవర్ బ్రిడ్జికి జగన్ అప్రోచ్ కూడా వేయలేదు. ఈ పనులన్నీ బాధ్యతగా నెరవేరుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
బాబు చెప్పిన నవరత్నాలివీ!
జగన్ నవరత్నాల మీద చంద్రబాబు ఛలోక్తులు పేల్చారు. దర్శిలో నిర్వహించిన ప్రజాగళం సభలో జగన్ నవరత్నాలకు చంద్రబాబు కొత్త భాష్యం చెప్పారు. 1. ఇసుక మాఫియా, 2. జే బ్రాండ్ మద్యం, 3. భూ మాఫియా, 4. మైనింగ్ మాఫియా, 5. హత్యా రాజకీయాలు, 6. ప్రజల ఆస్తుల కబ్జా, 7. ఎర్ర చందనం, గంజాయి, 8. దాడులు, అక్రమ కేసులు, 9. శవ రాజకీయాలు. ఇవీ జగన్ అమలు చేసే దారుణ నవరత్నాలంటూ చంద్రబాబు విసిరిన ఛలోక్తికి సభికుల నుంచి ఉత్సాహవంతమైన స్పందన వచ్చింది. అలాగే, ప్రజల పట్టాదారు పుస్తకాలపై జగన్ బొమ్మలేంటని ప్రశ్నించి చంద్రబాబు, జగన్ బొమ్మలున్న పట్టాదారు పాసు పుస్తకాన్ని చించిపారేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రభుత్వం ప్రచురించిన గెజిట్ ప్రతులను చించేసి, అధికారంలోకి రాగానే చట్టాన్ని రద్దు చేస్తానని చంద్రబాబు ప్రకటించారు.