- మూడురోజుల పాటు బాధిత కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ
- ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కార్యక్రమం
- గతేడాది అక్టోబర్ 25న ప్రారంభం, 13న తిరువూరులో ముగింపు
- ఇప్పటికి 194 కుటుంబాలకు పరామర్శ…చివరి విడతలో మరో 9 కుటుంబాలు
- 25 లోక్సభ నియోజకవర్గాల్లో 92 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8,478 కి.మీ ప్రయాణం
- ప్రతి బాధిత కుటుంబానికి సాయం చేసిన భువనమ్మ
అమరావతి (చైతన్యరథం): టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి సతీమణి భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. ఈ నెల 11న మొదలు కానున్న తుది విడత నిజం గెలవాలి కార్యక్రమం 13న ముగుస్తుంది. గతేడాది సెప్టెంబర్ 9న చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై పలువురు కార్యకర్తలు, అభిమానులు గుండె పగిలి మృతి చెందారు. మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పేందుకు భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బాధిత కుటుంబాలను భువనేశ్వరి నేరుగా పరామర్శించి, ఆర్థికసాయం అందించారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా 203 మంది అభిమానులు, కార్యకర్తలు గుండెపోటుతో మృతి చెందినట్లు పార్టీ వర్గాలు నిర్ధారించాయి. నిజం గెలవాలి పర్యటన ప్రారంభం నుండి ఇప్పటివరకు 194 కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. ఈ నెల 11, 12, 13వ తేదీల్లో పరామర్శించే కుటుంబాలను కలుపుకుని మొత్తం 203 కుటుంబాలకు పరామర్శ పూర్తవనుంది. పరామర్శతో పాటు ప్రతి బాధిత కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున భువనేశ్వరి ఆర్థికసాయం అందించారు. ఇప్పటి వరకు 25 పార్లమెంట్ల పరిధిలో 92 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8,478 కి.మీ దూరం భువనేశ్వరి ప్రయాణించారు. గురువారం నుండి జరిగే మూడు రోజుల పర్యటనలో మరో 2 నియోజకవర్గాల్లో పర్యటించే వాటితో కలిపి మొత్తం 94 నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటన పూర్తవనుంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో గతేడాది అక్టోబర్ 25న ప్రారంభమైన నిజం కార్యక్రమం ఈ నెల 13న ఉమ్మడి కృష్ణా జిల్లా, తిరువూరు నియోజకవర్గంలో ముగియనుంది.
ప్రజల మధ్యనే ఉంటూ…సమస్యలు శ్రద్ధగా వింటూ…
ఒకపక్క హెరిటేజ్ వ్యాపార వ్యవహరాలు, ట్రస్టు కార్యక్రమాలు, ఎన్టీఆర్ మోడల్ స్కూలు పనులు చూసుకుంటూనే నిజం గెలవాలి కార్యక్రమాన్ని భువనేశ్వరి నిరంతరాయంగా కొనసాగించారు. తన పర్యటనలో మహిళలు, పాడి రైతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. యువత, విద్యార్థులనూ కలిశారు. రైతు కూలీలు, కార్మికులను కలిసి వారి బాధలు విన్నారు. ప్రతి వారంలో నాలుగైదు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో భువనేశ్వరి ప్రజల మధ్యనే గడిపారు. క్షేత్రస్థాయిలో పేద విద్యార్థినులను కలిసి ఇబ్బందులను తెలుసుకున్న భువనేశ్వరి….కలలకు రెక్కలు అనే పథకాన్ని మహిళా దినోత్సవం రోజున ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే విద్యార్థినులకు ప్రభుత్వ గ్యారంటీతో వడ్డీలేని రుణాలు అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. కార్యక్రమం ప్రారంభంలో ప్రత్యర్థి పార్టీల నేతలు రాజకీయ విమర్శలు చేసినప్పటికీ భువనేశ్వరి పట్టించుకోకుండా ముందుకు సాగారు.