మంగళగిరి, చైతన్యరథం: దేశచరిత్రలో గత ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధిని అడ్డుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కొలనుకొండ ఆర్‌ఆర్ రచన అపార్ట్ మెంట్ వాసులతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… రాళ్లు రప్పలతో నిండిన మాదాపూర్ కళ్లముందు అభివృద్ధి చెందింది, సైబరాబాద్, ఫైనాన్సియల్ డిస్టిక్ట్ తోపాటు పలు పరిశ్రమలు ఆ ప్రాంతానికి వచ్చాయి, ఈరోజు అక్కడ ఎకరా వందకోట్లు పలుకుతోంది. చంద్రబాబు నాటిన మొక్కను తర్వాత ప్రభుత్వాలు కొనసాగించడం వల్లే ఈరోజు విశ్వనగరంగా అభివృద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం జగన్ గత ప్రభుత్వం ప్రారంభించిన రాజధాని, పోలవరం పనులను నిలిపేశారు, అనాలోచితంగా పిపిఎలను రద్దుచేశారు. ఫ్యాక్స్ కాన్, అమర్ రాజా, జాకీ వంటి పరిశ్రమలను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారు. కులముద్రవేసి వేధించడంతో దేశంలోనే పేరెన్నికగన్న వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ ఒరిస్సా వెళ్లి 1200 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేసుకుంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ట్రాన్స్ పోర్టు, క్యాంటీన్ కాంట్రాక్ట్ కోసం టిసిఎల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ను నిర్బంధించారు, చివరకు ఈ విషయం పిఎంఓకి చేరి తీవ్రంగా మందలించడంతో వెనక్కితగ్గారు. ఇలాంటి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఉన్నచోట పరిశ్రమలు ఎలా వస్తాయి? జగన్ చేతగానితనం, అహంకారం వల్లే పరిశ్రమలన్నీ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయి. స్వతహాగా జగన్ ఒక ఫ్యాక్షనిస్టు. బాబాయిని ఎలాచంపారో వివేకం సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఎటువంటి అభివృద్ధి చెందకుండా ప్రజలు తాము విసిరే చిల్లరకోసం ఎదురుచూస్తూ ఉండాలన్నది ఫ్యాక్షనిస్టు నైజం.
చంద్రబాబు విజన్ వల్లే లక్షలాది యువతకు ఉద్యోగాలు….
జగన్ విధ్వంసక పాలనలో యువతకు ఉద్యోగాలు లేవు, చదువుకునే పిల్లలకు ఫీజు రీఎంబర్స్ మెంట్ ఎత్తేశారు, విదేశీవిద్య పథకాన్ని నాశనం చేశారు. చంద్రబాబు విజన్ తో నిర్మించిన సైబరాబాద్ వల్ల నేడు పదిలక్షలమంది యువతకు ఉపాధి లభిస్తోంది. ఫ్యాక్షనిస్టుకు, విజనరీకి ఉన్న తేడాను రాష్ట్రప్రజలంతా గమనించాలి. గత ప్రభుత్వంలో 72శాతం పూర్తిచేసిన పోలవరాన్ని రివర్స్ పాలనతో సర్వనాశనం చేశారు. జగన్ ప్రభుత్వ అనాలోచిత చర్యలతో కాఫర్ డ్యామ్, డయాఫ్రం వాల్ దెబ్బతిన్నాయి. చంద్రబాబు ముందు చూపుతో కట్టిన పట్టిసీమే ఈనాడు దిక్కయింది. అతి చౌకగా లభించే రెన్యువబుల్ ఎనర్జీ పిపిఎలను జగన్ రద్దుచేసి, యూనిట్ 10రూపాయలకు ఓపెన్ మార్కెట్ లో కొనుగోలు చేయడంవల్లే విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడుతోంది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు పెంచబోం. రెన్యువల్ ఎనర్జీని ప్రోత్సహించి పద్ధతి ప్రకారం ఛార్జీలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటాం. ఏడాదిలోగా రాజధానికి అనుసంధానంగా ఉన్న రోడ్లనిర్మాణాలను పూర్తిచేస్తాం. గత అయిదేళ్లుగా రాష్ట్రంలో అన్నింటా డబ్బు, లాలూచీ, రాజకీయాలే. స్వతంత్రంగా పనిచేయాల్సిన ఎపిపిఎస్సీని కూడా భ్రష్టుపట్టించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీతో టీచర్ పోస్టులను భర్తీచేస్తాం. అయిదేళ్లలో పెండిరగ్ పోస్టులన్నీ భర్తీచేస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు.
అసెంబ్లీకి పంపండి… మంగళగిరిని నెం.1గా నిలబెడతా!
రాజధానిని అనుసంధానించే సీడ్ యాక్సిస్ రోడ్డును ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కోర్టు కేసులు వేసి అడ్డుకున్నారని, మంగళగిరి అభివృద్ధిపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేసులను ఉపసంహరించుకోవాలని, 2నెలల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలో రాజధానిని అనుసంధానించే రోడ్లనిర్మాణాలన్నీ పూర్తిచేస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొలనుకొండ ఆర్‌ఆర్ రచన అపార్ట్ మెంట్ వాసులతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… రాజధాని నిర్మాణాలు తిరిగి ప్రారంభిస్తే లక్షమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఒక్క ఛాన్స్ పేరుతో జగన్ కు అవకాశం ఇవ్వడంవల్ల రాష్ట్రం ఏవిధంగా నాశనమైందో విద్యావంతులంతా ప్రజలను చైతన్యవంతం చేయాలి. ముఖ్యమంత్రికి ఊరూరా ప్యాలెస్ లు కట్టుకోవడంలో ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు. కరకట్ట కమలాసన్ రోజుకో మాట మాట్లాడతాడు. మంగళగిరికి పరిశ్రమలు వచ్చే అవకాశం లేదని తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. అవకాశం లేకపోతే గత ప్రభుత్వ హయాంలో మంగళగిరికి ఐటి పరిశ్రమలు ఎలా వచ్చాయి? అభివృద్ధి చేయాలంటే చిత్తశుద్ధి అవసరం. అధికారంలో లేకపోయినా నేను ఒక ఐటి కంపెనీని రప్పించి 150మందికి ఉద్యోగావకాశాలు కల్పించాను. సొంత నిధులతో 29సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాను. టాటా సంస్థతో ఒప్పందం చేసుకుని వీవర్స్ శాలను ఏర్పాటుచేశాం. 25సంవత్సరాలుగా ఇక్కడ అధికారం అనుభవించిన మురుగుడు కుటుంబం, ఆర్కే నియోజకవర్గానికి ఏం చేశారు? నేను చేసిన అభివృద్ధిలో 10వవంతైనా చేయగలిగారా? కార్పొరేషన్ పేరుతో మంగళగిరి-తాడేపల్లి ప్రజలపై పన్నుల భారం మోపడం తప్ప చేసిందేమీ లేదు. అధికారంలో లేకపోతే భారీగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టా. నాకు అవకాశం ఇస్తే మంగళగిరిని దేశంలోనే నెం.1 స్థానంలో నిలబెడతా. గోల్డ్ క్లస్టర్ ఏర్పాటుతో 40వేలమంది స్వర్ణకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా. మంగళగిరికి ఐటి కంపెనీలు తెచ్చి యువతకు ఉద్యోగాలిస్తానని లోకేష్ చెప్పారు.
యువనేత ఎదుట అపార్ట్ మెంట్ వాసుల సమస్యలు…
కొలనుకొండ రచన అపార్ట్ మెంట్ వాసులు లోకేష్ కు సమస్యలు చెబుతూ… మా ప్రాంతంలో అప్రోచ్ రోడ్లు ఏర్పాటుచేసి రాజధాని, జాతీయ రహదారికి అనుసంధానం చేయాలి. డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యం కల్పించాలి. విట్, ఎస్‌ఆర్‌ఎం వంటి విద్యాసంస్థలకు వెళ్లే రోడ్లు బాగుచేయాలి. ప్రభుత్వోద్యోగుల సిపిఎస్ రద్దు అంశాన్ని పరిశీలించాలని కోరారు. యువనేత లోకేష్ సమాధానమిస్తూ… అధికారంలోకి వచ్చాక బ్లాక్ డెవల్ మెంట్ మోడల్లో రోడ్లు, తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, పార్కులు వంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తాం. కేవలం పన్నుల కోసమే పంచాయితీని కార్పొరేషన్ గా మార్చారు. స్థానికులతో చర్చించి మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటాం. అత్యధిక మెజారిటీతో నన్ను అసెంబ్లీకి పంపించండి, అభివృద్ధిలో దేశంలోనే నెం.1 నియోజకవర్గంగా మంగళగిరిని నిలబెడతా. చంద్రబాబు, పవన్ తో కొట్లాడి మంగళగిరి అభివృద్ధికి నిధులు తీసుకొస్తా. ఎన్నికల రోజున కావాలని ఇబ్బందులు సృష్టిస్తారు, ఓపిగ్గా నిలబడి ఓటుహక్కు వినియోగించుకోండి. రాబోయేది రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలనే విషయం మరువవద్దని యువనేత లోకేష్ విజ్ఞప్తి చేశారు.
బైక్ మెకానిక్ లు, ఇసుక కార్మికులతో నారా లోకేష్ భేటీ
ఉండవల్లి, చైతన్యరథం: రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణ కార్మికులకు మెరుగైన శిక్షణ కోసం మంగళగిరిలో కన్ స్ట్రక్షన్ అకాడమీ ఏర్పాటుచేస్తామని యువనేత నారా లోకేష్ చెప్పారు. మంగళగిరి నియోజకవర్గం చిర్రావూరు, ప్రాతూరు, గుండిమెడ, పెదకొండూరు, గొడవర్రు గ్రామాలకు చెందిన ఇసుక ముఠా కార్మికులతో ఉండవల్లి నివాసంలో యువనేత భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… జగన్ పాలనలో మొదటి బాధితులు భవన నిర్మాణరంగం కార్మికులే. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత ఇసుక విధానం తీసుకువచ్చి, నిర్మాణరంగానికి గత వైభవం చేకూరుస్తాం. జగన్ పాలనలో ఇసుక అందుబాటులో లేకుండా చేయడం, అమరావతి నిర్మాణ పనులు నిలిపివేయడంతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనుల్లేక వందలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గతంలో కార్మిక బోర్డు ద్వారా వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలుచేశాం.. నేడు జగన్ పాలనలో కార్మిక బోర్డు నిధులు రూ.2500 కోట్లు పక్కదారి పట్టించారు. అధికారంలోకి వచ్చాక కార్మిక సంక్షేమ బోర్డును ప్రక్షాళన చేయడంతో పాటు చంద్రన్న బీమా పథకం, పనిముట్లు అందజేస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. ఇసుక క్వారీలు, భవననిర్మాణ రంగ కార్మికులు ఈ సందర్భంగా తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. పాత ఇసుక విధానం తీసుకురావాలి. ఇసుక క్వారీల్లో అక్రమ మైనింగ్ వల్ల భూగర్భ జలాలు పడిపోయి, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అక్రమ మైనింగ్ ను అడ్డుకోవాలి. యంత్రాలతో కాకుండా మాన్యువల్ గా ఇసుకను తోడే విధంగా చర్యలు తీసుకోవాలని కోవాలి. కార్మిక బోర్డులో తమ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసి సాయం చేయాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు.
మెకానిక్ లకు సబ్సిడీరుణాలు, చంద్రన్న బీమా….
గత ఎన్నికలపుడు మంగళగిరిలో నేను గెలిస్తే ఆటోనగర్ తొలగిస్తానని దుష్ప్రచారం చేశారు, నేడు ఆటోనగర్ లను కబ్జాచేసేందుకు జీవోలు తెచ్చిన పార్టీ వైసీపీ అని యువనేత నారా లోకేష్ మండిపడ్డారు. ఉండవల్లిలోని నివాసంలో టూ వీలర్ అసోసియేషన్ ప్రతినిధులతో యువనేత ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… నేడు అనేక కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. బీస్ 5, బిఎస్ 6, ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. దానికి అనుగుణంగా బైక్ మెకానిక్స్ కి శిక్షణ ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లా లేదా పార్లమెంట్ ని యూనిట్ గా తీసుకొని బైక్ రిపేర్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. అధునాతన పనిముట్లు అందిస్తాం. మెకానిక్ షెడ్లు ఏర్పాటు చేసుకోవడానికి కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు అందిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చాక బైక్ మెకానిక్స్ కి ప్రభుత్వ గుర్తింపు కార్డులు, వైద్యసౌకర్యం, చంద్రన్న బీమా అమలు చేస్తాం. ఆటోనగర్ లో మెరుగైన వసతులు కల్పిస్తాం. టూ వీలర్ మెకానిక్ లను అన్ని విధాల ఆదుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా టూ వీలర్ మెకానిక్ లు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. అసోసియేషన్‌కు కమ్యూనిటీ భవనం నిర్మాణంతో పాటు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. పనిముట్లు, షాపుల అభివృద్ధికి సబ్సీడీపై రుణాలు మంజూరుచేయాలని విజ్ఞప్తి చేశారు. ఆటోనగర్‌లో గ్యారేజీలకు స్థలాలు ఇవ్వాలని కోరారు. తమ పిల్లల చదువులకు ఇబ్బందులు పడుతున్నామని, జగన్ పాలనలో నిలిచిపోయిన విదేశీ విద్య పథకాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.