- హంతకులను రక్షించటంపై సునీత ఆవేదన
- జగన్‌కు చిన్నాన్న అంటే అర్థం కూడా తెలియదు
- హంతకులకు ఓటు వేయొద్దని మరోసారి ప్రజలకు విజ్ఞప్తి
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చిన్నాన్న అంటే అర్థం తెలుసా అని మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ప్రశ్నించారు. హంతకు లకు ఓటు వేయవద్దని మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ హైకోర్టు వద్ద గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. చిన్నాన్న అంటే అర్థం తెలుసా? నాన్న తర్వాత నాన్న. అలాంటి వ్యక్తిని దారుణంగా చంపేస్తే అధికారంలో ఉండికూడా హంతకులను పట్టుకోలేకపోయారు. పైగా…చిన్నాన్న కుమార్తెపైనే నిందలు వేస్తున్నారు. చిన్నాన్న కూతురు మీద నిందలు వేయడం న్యాయమా? నేను కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరుగుతున్నా కనీసం స్పం దించావా? చిన్నాన్న చనిపోతే కనీసం న్యాయం చేయ లేవా? మీ చెల్లి.. హంతకులను అరెస్ట్ చేయాలంటూ కోర్టులు, పోలీసుల చుట్టూ తిరుగుతుంటే అన్నగా మీ బాధ్యత ఏంటి? బంధుత్వాలకు అర్థం తెలుసా? చిన్నా న్నను ఎవరు చంపారో దేవుడికి తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు అంటున్నారు. అవును మీరు నిజమే చెప్పారు. వివేకాను చంపించింది ఎవరో… దేవుడికి, మీకు, జిల్లా ప్రజలకు తెలుసు. అందుకే నిందితులను అంత బాగా రక్షిస్తున్నారని సునీత తప్పుబట్టారు.
నిందితులను రక్షిస్తున్నది మీరే
స్వయంగా అప్రూవర్‌గా మారిన హంతకుడే చెబుతు న్నాడు…వైఎస్ భాస్కర్‌రెడ్డి,అవినాష్‌రెడ్డే వివేకాను హత్య చేయించారని. అయినప్పటికీ హంతకులను జగన్ ఇప్ప టికీ వెనకేసుకొస్తున్నాడు. ఐదేళ్లు మీ ప్రభుత్వం ఉండి కూడా ఏం చేశారు? నిందితులను రక్షించేది మీరు కాదా? గతంలో సీబీఐ విచారణ కోరింది మీరే… ఆ తర్వాత పిటిషన్ ఉపసంహరించుకున్నదీ మీరే. ఎన్నిక లు వస్తున్నాయని ఐదేళ్ల తర్వాత చిన్నాన్న గుర్తొచ్చారా? మీరు చేయాల్సిన పని సరిగా చేయనందుకే నేను బయ టకు రావాల్సి వచ్చింది. ఎవరు స్వార్థపరులు? ఎవరు పదవుల కోసం వివేకా హత్య కేసును వాడుకుంటు న్నారని సునీత సూటిగా ప్రశ్నించారు.
న్యాయం కోసం పోరాడుతున్నా
హంతకులకు ఓటు వేయమని మీరు అడుగుతు న్నారు. సినిమాలో రౌడీలు ఉంటారు, వారిని నడిపించే విలన్ ఉంటాడు. కేవలం రౌడీలను పట్టుకుంటే సరి పోతుందా? విలన్‌ను కూడా పట్టుకోవాలి కదా. ఆ విలన్ పాత్రధారి మీరేనా? పాత్రధారులు సరే.. సూత్ర ధారులను కూడా అరెస్ట్ చేయాలి కదా? చిన్నాన్న చనిపోయి ఐదేళ్లు అవుతోంది. మరోసారి సానుభూతి పొంది ఎన్నికల్లో ఓట్లకోసం పాకులాడుతున్నారు. తండ్రి ని కోల్పోయి నేను న్యాయం కోసం పోరాడుతున్నా. హంతకులకు ఓటు వేయవద్దని మరోసారి ప్రజలను కోరుతున్నా. పదవుల కోసం పాకులాడుతున్నానని నాపై ఆరోపణలు చేస్తున్నారు. న్యాయం కోసం, ధర్మం కోసం నేను పోరాడుతున్నా. సానుభూతి కోసమే ఎన్నికల వేళ చిన్నాన్న హత్యను జగన్ తెరపైకి తెస్తున్నారు. వైసీపీ పునాదులు వివేకా రక్తంలో మునిగి ఉన్నాయని సునీత ఆవేదన వ్యక్తం చేశారు.