- మోసం తప్ప, ఐదేళ్లలో చేసిందేముంది?
- బీసీల వెన్ను విరిచిన దుర్మార్గుడు
- టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు మండిపాటు
అమరావతి (చైతన్యరథం): జగన్‌రెడ్డి పాలనలో బీసీల అభివృద్ధి గాలికొదిలేశా రని టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి, అదే బీసీలపై పగబట్టాడని, నిలువునా మోసం చేశాడని దుయ్యబట్టారు. బీసీ అభివృద్ధికి చంద్రబాబు 34 సంక్షేమ పథకాలు అమలుచేస్తే, సహించలేకే అహంబావి జగన్‌రెడ్డి వాటిని రద్దు చేశాడన్నారు. బీసీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించాడని, స్థానిక సంస్థలలో బీసీల కోసం చంద్రబాబు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, జగన్‌రెడ్డి 16,800 పోస్టులు కోత విధించి బీసీల వెన్ను విరిచాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇళ్లపట్టాల పేరుతో 8వేల ఎకరాల బీసీల భూముల్ని దోచుకున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏ సామాజిక వర్గ అభివృద్ధికీ పైసా ఖర్చు చేయలేదని, గత ఐదేళ్లలో బీసీలపై అనేక దాడులు, హత్యలు జరిగాయని, వీటన్నింటికీ జగన్‌రెడ్డి బాధ్యత వహించాలన్నారు. భవిష్యత్తుకు గ్యారంటీ ద్వారా బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారంటూ, బీసీలకు చంద్రబాబుకు మధ్య ఉన్న అనుబంధం విడదీయరానిదన్నారు. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా ఈనెల 5న తెదేపా డిక్లరేషన్ ప్రకటించనున్నదని వెల్లడిరచారు. వైసీపీ ప్రభుత్వం బీసీ కులగణన, సామాజిక సాధికార బస్సుయాత్ర, సిద్ధమంటూ ప్రజలకు దగ్గరవ్వాలని చేస్తున్న ప్రయత్నాలు విఫలమేనని, ఆ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పి గద్దె దించే రోజు దగ్గరలోనే ఉందని దువ్వారపు రామారావు జోస్యం చెప్పారు.