- వైసీపీ ఎమ్మెల్యే పడగనీడలో ఆదోని
- ఐదేళ్లలో రూ.1640 కోట్ల అక్రమ దందాలు
- కథలుకథలుగా సాయిప్రసాద్‌రెడ్డి బాగోతాలు
- ఇదొక సకుటుంబ సపరివార సమేత దోపిడీ
ఒకప్పుడు విజయనగర పాలకులకు బలమైన కోట ఆదోని. టెంపుల్ సిటీగా అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందిన నగరం. ఇప్పుడు ఆ ప్రతిష్ట మసకబారింది. అవినీతి పంకిలమైంది. కబ్జాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. ఎవరెస్ట్‌లాంటి ఆదోని ఎర్రదిబ్బగా మారడానికి ఒకే ఒక్క కారణం `ఎమ్మెల్యే వై సాయిప్రసాద్‌రెడ్డి. ఒకవైపు కబ్జాకోరలు, మరోవైపు లిక్కర్ మాఫియా.. ఇదీ ఆదోని నియోజకవర్గ పరిస్థితి. 2019లో 4.31 కోట్ల ఆదాయం చూపించిన సాయిప్రసాద్‌రెడ్డి.. అధికారం అడ్డంపెట్టుకుని ఐదేళ్లలో రూ.1640 కోట్లకు పైనే పడగలెత్తాడన్నది తాజా సమాచారం. నియోజకవర్గ అభివృద్ధిని పక్కనపెట్టి సెటిల్‌మెంట్లు, పంచాయతీలు, దందాలే అజెండాగా పనిచేస్తూ కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి వసూలు చేసిన మామూళ్ల సొమ్మును బెంగుళూరులో వ్యాపారాలకు పెట్టుబడి పెట్టాడు.
దానాల స్థానంలో దందాలు…
ఇంతకుముందు `ఆదోని సెగ్మెంట్‌కు మూడుసార్లు ప్రాతినిథ్యం వహించిన తెదేపా నాయకుడు మీనాక్షినాయుడు అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ఎన్నో దానధర్మాలు చేశారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి దానాల స్థానంలో దందాలు మొదలెట్టి, దోపిడీలే ఎజెండాగా నియోజకవర్గాన్ని నొల్లుకుంటున్నాడు. నిరుపేదలకు దక్కాల్సిన అభివృద్ధి ఫలాలను దారిమళ్లిస్తూ వందల కోట్లకు పడగలెత్తాడు. సాయిప్రసాద్‌రెడ్డి కుటుంబీకుల పేరెత్తితేచాలు.. వ్యాపారస్తులు, కాంట్రాక్టర్‌లే కాదు సామాన్యులూ భయభ్రాంతులకు గురవుతున్నారు. సాయిప్రసాద్‌రెడ్డి భార్య, కొడుకు, కూతురు నియోజకవర్గంలో చేయని దందా లేదు.
ఎమ్మెల్యే కుమార్తె గౌతమిరెడ్డి. ల్యాండ్ సెటిల్‌మెంట్లలో ఈమెదే కీలకపాత్ర. విలువైన భూములను గుర్తించి పత్రాలు తారుమారు చేయించడంలో సిద్ధహస్తురాలు. రైతులను బెదిరించి మరీ భూములు లాక్కున్న సంఘటనలు లేకపోలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి డబ్బు వసూలు ఈమెకు సర్వసాధారణ విషయం. ఎమ్మెల్యే కొడుకు జయ మనోజ్‌రెడ్డి. ఆదోని మున్సిపాలిటీలో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తూ అధికారులను, పోలీసులను బెదిరిస్తూ చెప్పుచేతల్లో పెట్టుకుంటాడు. ఏఏయస్ కాలేజీ రోడ్‌లో అక్రమంగా ఒక వ్యాపారి ఇంటిని ఆక్రమించడంతోపాటు అనేక సెటిల్‌మెంట్లలో భాగస్వామిగా ఉన్నాడు. అధికారుల బదిలీలలో రేటు నిర్ణయించేది ఇతనే. ఇక `ఎమ్మెల్యే భార్య పేరు చెబితే రిజిస్ట్రార్‌లు, కాంట్రాక్టర్‌లు బెంబేలెత్తుతారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగే ప్రతి రిజిస్ట్రేషన్‌కు రూ.10 వేలనుంచి రూ.లక్ష వరకు మేడమ్‌కి ముట్టచెప్పాల్సిందే. కోడిగుడ్డు కాంట్రాక్టర్‌ను బెదిరించి మరీ రూ.32 లక్షలు వసూలు చేశారు. ఇక ఎమ్మెల్యే అనుచరుడు మల్లికార్జున. ఖాళీ జాగాలను గుర్తించడం, దొంగ డాక్యుమెంట్లు సృష్టించడంలో సిద్ధహస్తుడు. ఇతని దెబ్బకు మైనారిటీలు ఊరొదిలి పారిపోయిన సందర్భాలున్నాయి. ఆ విధంగా భూకబ్జాలకు పాల్పడ్డాడు. ఎమ్మెల్యే మరో అనుచరుడు ఎర్రి స్వాములు. సాయిప్రసాద్‌రెడ్డికి బినామీగా ఉంటూ పెద్దఎత్తున ఆస్తులు కొనుగోలు చేశాడు. కర్నూలుతోపాటు బెంగుళూరు, హైదరాబాద్‌లో ఇతని పేరుమీద ఆస్తులున్నాయి.
పంచాయతీ నిధులూ మింగేశారు…
పంచాయతీల్లో మునిగితేలే సెటిల్‌మెంట్ల సాయి `గ్రామ పంచాయతీల్లోని నిధులనూ దిగమింగాడు. గ్రామాల అభివృద్ధి కోసం ఇచ్చే అరకొర నిధులను సైతం దారిమళ్లించి రూ.60 కోట్ల మేర సొమ్ము వెనకేసుకున్నాడు. నియోజకవర్గం మొత్తం పంచాయతీలకు ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్ల దగ్గర నుంచే మెటీరియల్ తీసుకోవాలని నిబంధనలు పెట్టి అవినీతికి ప్రణాళికలు రూపొందించాడు. పంచాయతీ ల్లో పనులకు కూడా టెండర్లు రూపొందించడం దగ్గరనుంచీ ఎంపిక చేసేవరకు అన్నింటిలోను చేతివాటం ప్రదర్శిస్తూ పంచాయతీలను నిర్వీర్యం చేశారు. ఆదోని నియోజకవర్గానికి బళ్లారి, రాయచూర్, సింగూర్ పట్టణాలు సమీపంగా ఉంటాయి. ఇదే అదనుగా నియోజకవర్గంలో పేదల కోసం ఉపయోగించాల్సిన రేషన్ బియ్యాన్ని పై ప్రాంతాలకు తరలించి ఏటా రూ.5 కోట్ల మేర వ్యాపారం చేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని నియోజక వర్గం నుంచి పొరుగు రాష్ట్రానికి తరలించడానికి ప్రత్యేకంగా వాహనాలూ ఏర్పాటు చేశారు.
నిరుపేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం సేకరించిన భూసేకరణలో సెటిల్‌మెంట్ల సాయి తనదైన శైలిలో సెటిల్ చేసుకున్నాడు. ఎక్కడైతే పేదలకు భూములిస్తారో ముందే తెలుసుకుని అక్కడ తక్కువ మొత్తానికి వందల ఎకరాలు కొనుగోలు చేసి దాంట్లో కొంత భాగాన్ని ప్రభుత్వానికి ఎక్కువ మొత్తానికి అమ్మడంతో పాటు మిగిలిన మొత్తాన్ని వెంచర్లు వేసి అమ్మడం జరిగింది. ఇందుకుగాను ప్రభుత్వ నిధులనే పెద్ద ఎత్తున వినియోగించడం జరిగింది.
అలాగే ఆదోని నియోజకవర్గంలో ఎవరైనా సరే వెంచర్ వేయాలంటే ముందుగా సెటిల్‌మెంట్ల సాయితో సెటిల్ చేసుకోవాల్సిందే. లేదంటే వెంచర్లకు అనుమతులుండవు. అనుమతులుంటే సాయంత్రంకల్లా అధికారులు వెళ్లి కొత్త పేచీలు పెడుతుంటారు. ఒక్కో వెంచర్ నుంచి రూ.25 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేశారు. ఆదోనిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే సాయిరెడ్డి అనుమతి, అనుగ్రహం రెండూ ఉండాల్సిందే.
సెటిల్‌మెంట్ల సాయిప్రసాద్‌రెడ్డి అండదండలతో కొండలను పిండి చేస్తూ గ్రావెల్ మాఫియా 3 లారీలు, 6 క్వారీల్లా నడుస్తోంది. కొండలను ఖాళీ చేయడంతో పాటు ప్రభుత్వ భూముల్లో సైతం నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం నిర్మించిన రోడ్లను సైతం ధ్వంసం చేసి, భూములు కబ్జా చేసి పెద్దఎత్తున మట్టి తవ్వకాలు జరుపుతూ చెరువులుగా మార్చారు. పోరంబోకు భూమి కనిపిస్తే పాగా వేయడం, రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి వందల ఎకరాల్లో అక్రమ మైనింగ్ చేయడం సర్వసాధారణం. ట్రాక్టర్ మట్టి రూ.8వేలు, లారీ మట్టి రూ.15 వేలనుంచి రూ.25 వేల వరకు విక్రయిస్తున్నారు. నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా ఇక్కడి నుంచే మట్టి తీసుకోవాలని సెటిల్‌మెంట్ల సాయిరెడ్డి ప్రత్యేక నిబంధన కూడా పెట్టాడు.
అంతులేని ఇసుక దోపిడీ…
రాష్ట్రవ్యాప్తంగా ఇసుక తవ్వకాలను జేపీ వెంచర్స్.. లేక మైనింగ్ శాఖ నిర్వహించినా.. ఆదోని నియోజకవర్గంలో మాత్రం ఇసుక సంబంధించిన అన్ని వ్యవహారాలూ సాయిప్రసాద్‌రెడ్డే చూస్తాడు. ఇసుక వాహనాలు ఆదోనిలోకి వస్తే చాలు ఎమ్మెల్యే నియమించిన టీమ్ వాటిని స్వాధీనం చేసుకుని ఖాళీ వాహనాలను పంపిస్తాయి. ఇసుక లారీలు ఈ నియోజకవర్గంలో నుంచి వెళ్లాలంటే తప్పనిసరిగా ఎమ్మెల్యేకు పైసలు ముట్టచెప్పాల్సిందే. తుంగభద్ర, ఎస్సారెస్పీ కాలువల నుంచి వచ్చే ఇసుకను దిగమింగి కోట్ల రూపాయలు గడిరచారు.
క్రికెట్ బెట్టింగ్‌లు లెక్కే లేదు…
ఎమ్మెల్యే కుమారుడు మనోజ్‌రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ బెట్టింగ్‌లు, మట్కా కేంద్రాలు పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. రోజుకి రూ.5 లక్షల వరకు ఆదాయం వీటిద్వారా వస్తోంది. వీటి బారినపడి అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో బెట్టింగ్ కట్టి ఆదోని పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీటన్నింటికీ కర్త, కర్మ, క్రియ, సెటిల్‌మెంట్ సాయిప్రసాద్ రెడ్డి కుటుంబమే.
కర్నూలులో కర్నాటక మద్యం…
ఆదోని కేంద్రంగా బళ్లారినుంచి పెద్ద ఎత్తున కర్నాటక మద్యాన్ని ట్యాక్స్‌లు లేకుండా అక్రమ మార్గాల్లో తీసుకొచ్చి కర్నూలు జిల్లా మొత్తానికి సరఫరా చేసి 3 గ్లాసులు, 6 పెగ్గుల్లా ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో మద్యం వ్యాపారం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న మద్యం దుకాణాలకంటే సాయిప్రసాద్‌రెడ్డి కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటైన మద్యం దుకాణాలు ఎక్కువ. అక్రమ మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన అధికారులు సైతం సాయిప్రసాద్‌రెడ్డి దెబ్బకు గమ్మున కూర్చుంటున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలతోపాటు బార్‌లలో కూడా కర్నాటక మద్యమే దర్శనమిస్తోంది. ఈ అక్రమ మద్యం వ్యాపారం తండ్రీకొడుకులు దగ్గరుండి నిర్వహిస్తుంటారు. ఏటా రూ.60 కోట్లు పైనే ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి వెనకేసుకొస్తున్నాడు.
దారుణ భూమాఫియా!
అవినీతి అధికారుల అండతో రైతుల భూములు వారికికూడా తెలియకుండా ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేరుమీద రాయించుకున్న ఘటనలు ఎన్నో. దశాబ్దా లుగా సాగుచేసుకుంటున్న భూములను సైతం కాజేసి రైతులను రోడ్డున పడేసిన అనకొండ ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి. ఆదోని పట్టణం పర్వతాపురంలోని 112సి1లోని 5.29 ఎకరాల మైనారిటీల భూమిని రికార్డులు తారుమారు చేసి ఎమ్మెల్యే కుమారుడు మనోజ్‌రెడ్డి, కుమార్తె గౌతమి రెడ్డిలు రాయించుకున్నారు. బెంగుళూరులో బతుకు తెరువు కోసం వెళ్లిన శంషుద్దీన్ కుటుంబసభ్యులు ఇక్కడకు వచ్చి చూసుకు నేసరికి ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల చేతుల్లోకి ఆస్తులు వెళ్లిపోయాయి. రోడ్డెక్కి ఆందోళన చేసినా మైనారిటీ కుటుంబానికి న్యాయం జరగని దుస్థితి. కంచాపురం గ్రామంలో సర్వే నెం.34లో 60ఎకరాలకు పైగా భూమి, కొనుగొండ్ల గ్రామంలో సర్వే నెం.127లో 20 ఎకరాల భూమి, సదాపురం గ్రామంలోని సర్వేనెం.31లో 36 ఎకరా ల భూమి ఎమ్మెల్యే కుటుంబీకుల పేరుమీద ఉంది. ఇవికాక నంద్యాల, కర్నూలు, ఆదోని, ఏయస్ యస్ కాలేజీ, నూనెపల్లిలో 20వేల గజాలకు పైగా ఓపెన్ ప్లాట్లు కుటుంబసభ్యుల పేరుమీద ఉన్నాయి. ఈ మొత్తం భూముల విలువ రూ.130 కోట్ల వరకూ ఉంటుంది. ఎన్నికల అఫిడవిట్‌లో రూ.4 కోట్ల ఆస్తులు చూపించిన ఎమ్మెల్యే కుటుంబసభ్యులు అయిదేళ్ల తిరక్కముందే ఒక్క భూము ల్లోనే రూ.130 కోట్లకు పైగా సంపాదించారు.