- రాజకీయ భవిష్యత్కు నాదీ భరోసా
- రాష్ట్రం కోసమే జనసేనతో పొత్తు
- సీట్లు రాని సీనియర్లకు చంద్రబాబు బుజ్జగింపు
- అధినేతను కలిసిన గంటా, ఆలపాటి, దేవినేని, పీలా, గండి బాజ్జీ, బొడ్డు
- అధినేత మాటే శిరోధార్యమన్న నాయకులు
అమరావతి: టీడీపీ తొలి జాబితాలో సీటు కోల్పోయిన నేతలను పార్టీ అధినేత చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. రాజకీయ భవిష్యత్తుపై అధినేత భరోసా ఇచ్చారని, ఆయన మాటే శిరోధార్యమని భేటీ అనంతరం ఆయా నాయకులు చెప్పారు. జనసేనతో పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన సీనియర్లను టీడీపీ అధినేత చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్ కోసమే జనసేనతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని నేతలకు విడమరిచి చెబుతున్నారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకమని, విధ్వంసకారుడు జగన్ పాలనలో నాశనమవుతున్న రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే పొత్తులని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు నేతలు త్యాగాలకు సిద్ధ పడాల్సిందేనని అంటున్నారు. అయితే ఇన్నాళ్లూ పార్టీకి ఆయా నేతలు చేసిన సేవలను, పడిన కష్టాన్ని విస్మరించ బోమని స్పష్టం చేస్తున్నారు. సీట్లు కోల్పోయిన నాయకుల రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇస్తున్నారు. ఈ ఎన్నికల్లో సీటు దక్కించుకున్న వారితో, జనసేన నేతలతో సమన్వయంతో పనిచేయాలని ఆయా నేతలకు సూచిస్తున్నారు. ఆదివారం ఉండవల్లిలోని నివాసానికి కొంత మంది నేతలను చంద్రబాబు పిలిపించారు. మాజీ మంత్రులు అలపాటి రాజా, దేవినేని ఉమా, గంటా శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు పీలా గోవింద్, గండి బాబ్జి, రాజానగరం ఇన్చార్జి బొడ్డు వెంకటరమణ ఉండవల్లిలో చంద్రబాబును కలిశారు. సీనియర్లకు టికెట్‌ను ఎందుకు ఇవ్వలేకపోతున్నామన్న విషయాన్ని నేతలకు సమగ్రంగా చంద్రబాబు వివరించారు. కొంత మంది సీనియర్లకు నియోజకవర్గాన్ని ఎందుకు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నది సంబంధిత నాయకులకు చంద్రబాబు తెలియజేశారు. పొత్తుల్లో భాగంగా కొన్ని చోట్ల సీనియర్లు త్యాగాలు చేయకతప్పదని చంద్రబాబు నేతలతో చెప్పారు. చంద్రబాబుతో భేటీ అనంతరం నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధినేత హామీతో ఆయా నేతలు సంతృప్తి చెందారు.
తెనాలి నుంచి టీడీపీ టికెట్‌ను మాజీమంత్రి అలపాటి రాజేంద్రప్రసాద్ ఆశించారు. అయితే తెనాలి స్థానం జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు కేటాయించడంతో రాజా కొంత నిరాశకు గురయ్యారు. ఆయనను బుజ్జగించేందుకు ఉండవల్లిలోని తన నివాసానికి చంద్రబాబు పిలిపించారు. దాంతో అలపాటి రాజా ఆదివారం చంద్రబాబు నివాసానికి వచ్చారు. సుమారు రెండు గంటల పాటు అధినేతతో రాజా చర్చించారు. చంద్రబాబుతో భేటీ అత్యంత సంతృప్తికరంగా ముగిసిందని రాజా తెలిపారు. పొత్తుల్లో భాగంగానే తెనాలి సీటు జనసేనకు కేటాయించాల్సి వచ్చిందని వివరించారు. పొత్తుల్లో తన సీటును జనసేనకు సర్దుబాటు చేయాల్సి వచ్చిందని చంద్రబాబు తనతో చెప్పారని అన్నారు. నాదెండ్ల మనోహర్‌తో సమన్వయం చేసుకొని రాబోయే ఎన్నికల్లో ముందుకెళ్లాలని చంద్రబాబు సూచించారని అలపాటి రాజా తెలిపారు. తన రాజకీయ భవిష్యత్తుపై అధినేత హామీ ఇచ్చారని చెప్పారు.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా చంద్రబాబు నివాసానికి వచ్చి కలిశారు. గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గంటా గెలుపొందారు. టీడీపీ ప్రకటించిన తొలిజాబితాలో ఆయనకు చోటు దక్కలేదు. ఆయనను చీపురుపల్లి నుంచి బరిలోకి దింపే యోచనలో టీడీపీ ఉంది. మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీకి గంట ధీటైన అభ్యర్థి అవుతారని చంద్రబాబు భావిస్తున్నారు. చీపురుపల్లి నుంచి పోటీ చేయమని చంద్రబాబు సూచించారని భేటీ అనంతరం గంటా చెప్పారు. భీమిలి నుంచి పోటీ చేస్తానని చెప్పగా, నువ్వెక్కడ పోటీ చేసినా గెలుస్తావని చంద్రబాబు అన్నారు. ఎక్కడ పోటీ చేయించే విషయాన్ని తనకు వదిలిపెట్టాలని చంద్రబాబు అన్నారు. టీడీపీ తొలిజాబితాపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని గంటా అన్నారు. మొదటి జాబితాపై ప్రజా స్పందన బాగుందని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాను. సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజమో.. వైసీపీ ఓడటం. అంతే నిజమని గంటా అన్నారు.
తొలిజాబితాలో దేవినేని ఉమామహేశ్వరరావు పేరు: లేకపోవడంపై ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా టీడీపీ: నేతల్లో ప్రధానమైన చర్చ జరుగుతోంది. దీనిపై ఆయన కూడా చంద్రబాబును కలిసి మాట్లాడారు. దాదావు గంటకు పైగా వీరి భేటీ సాగింది, కొన్ని సమీకరణాల్లో భాగంగానే మొదటి జాబితాలో సీటు ప్రకటించలేక పోయినట్లు చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. భేటీ అనంతరం దేవినేని ఉమా మాట్లాడుతూ నేను చంద్ర బాబు కుటుంబ సభ్యుడిని, ఆయన మాటే తనకు శిరోధార్యమన్నారు.
అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ కూడా చంద్రబాబును కలిశారు. ఈ స్థానం పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వటంతో పార్టీ అభ్యర్థిగా కొణతాల రామకృష్ణను ప్రకటించారు. దీంతో అసంతృప్తికి గురైన పీలా గోవింద్‌ను చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా పీలా చెప్పారు. తొలి జాబితాలో సీటు ప్రకటించని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జ్ గండి బాబ్జి కూడా చంద్రబాబును కలిశారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం టీడీపీ ఇన్చార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. అయితే ఆ సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. అక్కడ జనసేన అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణను పవన్ ప్రకటించారు. దీంతో బొడ్డును చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారు. రాజకీయ భవిష్యత్తుపై హామీ ఇచ్చారు. రాజమండ్రి ఎంపీ స్థానం, కుదరకపోతే ఇతర ప్రత్యామ్నాయాలు చూస్తానని అధినేత చెప్పారని బొడ్డు తెలిపారు, చంద్రబాబుతో సమావేశం తర్వాత బొడ్డు వెంకటరమణ సంతృప్తి వ్యక్తం చేశారు.
పెనుకొండ ఇన్ఛార్జ్ పార్థసారధి, మరికొందరు నేతలు సోమవారం వచ్చి అధినేతను కలవనున్నారు. సీట్లు దక్కనివారితో చంద్రబాబు మాట్లాడుతున్నారు.