- దెందులూరులో అబ్బయ్య దర్జా దందా
- విచ్చలవిడిగా సాగుతున్న అ.చౌ అవినీతి
- సాఫ్ట్‌వేర్ పనోడి రాజకీయ విలాసం..
- మాఫియా స్టార్టప్‌గా అబ్బయ్య అండ్ కో
- ఇదీ అదీ అని లేకుండా అన్నిట్లోనూ అక్రమాలు
- జగన్ అండే అబ్బయ్య దందా..
- కుర్ర ఎమ్మెల్యే ఆస్తి 700 కోట్ల పైమాటే..
కుర్రాడు. సింపుల్‌గా ప్యాంట్ షర్ట్ వేస్తాడు. ఎవరెదురొచ్చినా `మెత్తగా నవ్వుతాడు. ఎవరు పలకరించినా `కరచాలనం చేస్తాడు. సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ వదిలేసి `సొంతంగా స్టార్టప్ పెట్టుకున్నాడు. దానిపేరు `అబ్బయ్య అండ్ కో. కాలం కలిసొచ్చింది. వైసీపీ చేయందించింది. దెందులూరు ఆశీర్వదించింది. రాజకీయం ఎమ్మెల్యే పీఠమేసింది. అధికారం అతనిలో కాంక్ష పెంచింది. కట్ చేస్తే `దెందులూరుకి దరిద్రం పట్టింది. అబ్బయ్యను అదృష్టం కౌగిలించుకుంది. 700 కోట్లకు ఆస్తిపరుడ్ని చేసింది.
ఇప్పుడు..
అబ్బయ్య చౌదరి ఉరఫ్ అ.చౌ! అతగాడు మహా మేతగాడు. జలగన్న నీడలో బలిసిన జలగ.
సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ నుంచి వచ్చిన అబ్బయ్య చౌదరి జలగన్న అండ చూసుకుని `దెందులూరుకు హార్డ్ రియాలిటీ చూపిస్తున్నాడు. మాఫియా స్టార్టప్‌ను ఏర్పాటు చేసి `అబ్బయ్య అండ్ కో వేళ్లూనుకునేలా చేసుకున్నాడు. రాజకీయ ఉన్మాది.. ఆర్థిక అరాచక వాది.. భూకబ్జాదారు.. పర్యావరణ విఘాతకుడు.. కంకరాసురుడు.. మైనింగ్ రాకాసి.. `ఇలాంటి పదాలను తెలుగు నిఘంటువుల నుంచి ఏరి తెచ్చుకున్నా.. అ.చౌ ఘనతను పోల్చడానికి ఏ మాత్రం సరిపోవు.
అక్రమ మైనింగ్, చేపల చెరువులే అబ్బయ్య అండ్ కోకి ప్రధాన ఆదాయ వనరు. దెందులూరు భవిష్యత్‌ను ఫణంగా పెట్టి.. దందా సాగిస్తున్న దొంగాసురుడు. ‘జనాలేమైతే మాకేంటి? మాకు కావాల్సింది ధనం’ `ఇదీ అ.చౌ నినాదం.
అబ్బయ్య అండ్ కో తమ స్వార్థానికి భూగర్భ జలాలు కలుషితం చేయగలదు. పేద, మధ్య తర గతి కుటుంబాలను రోడ్డుకీడ్చగలదు. చెట్లు నరికే యగలదు. కాల్వల్ని కప్పెట్టేయగలదు. కరకట్టల్ని మింగేయగలదు. ఖాళీ భూముల్ని చుట్టేయగలదు. చట్టాన్ని బ్యాక్ పాకెట్లో పెట్టుకుని `పేకాట క్లబ్బులూ కొనసాగించగలదు.
మట్టి.. వాళ్ల ముక్క. గ్రావెల్.. వాళ్ల చుక్క. కంకర `వాళ్ల పక్క. వీటితోనే అ.చౌకి ఆనందం, వినోదం. వీటిని నమ్ముకునే – అబ్బయ్య అండ్ కో.. చెలరేగిపోయింది. వీటిని అమ్ముకునే `అక్షరాలా 700 కోట్లు వెనకేసింది.
దోచుకోవడం, దాచుకోవడానికే టైం సరిపోక – నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేశాడు అబ్బయ్య చౌదరి. అ.చౌ ఆగడాలను నియోజకవర్గ ప్రజలు అరుగుల మీద కూర్చొని కథలు కథలుగా చెప్పుకుం టున్నారు. అ.చౌ పనితనానికి మురిసిపోయి వైసీపీ నేతలు, కార్యకర్తలే.. ‘నాయకుడిని మించిన మహా మేతగాడు’ అంటూ పాంప్లెట్లు పంచుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఐదేళ్లల్లో `సాఫ్ట్‌వేర్ అ.చౌ హార్డ్‌వేర్ చౌ చౌగా మారితే.. అతని ఇలాకా లోని భూకబ్జాలు, దందాలు, ఆర్థిక అరాచకాలు దాసోహమై.. అబ్బయ్య అండ్ కో కీర్తిని నలుదిక్కులా కీర్తిస్తున్నాయి.
రిజిస్ట్రార్ ఫీసులో ఎ.ట్యాక్స్..
దెందులూరు రిజిస్ట్రార్ ఆఫీసులో సాధారణంగా ఏ రిజిస్ట్రేషన్ జరిగినా 2శాతం అదనపు వసూలు ఆనవాయితీ. ఇప్పుడు 3 శాతం ఎ.ట్యాక్స్ కలిపి చెల్లించాల్సి వస్తోంది. మొత్తంగా ప్రభుత్వ ఫీజులకు అదనంగా 5శాతాన్ని చెల్లించాలన్న మాట. నియో జకవర్గంలో ఏ అపార్ట్‌మెంట్ నిర్మాణం జరిగినా ఫ్లాట్‌కు 5 లక్షల కప్పం కామన్, లేకపోతే కొర్రీలు వేసి సంబంధిత అపార్ట్‌మెంట్ నిర్మాణాన్ని అడ్డుకుంటారు.
భూబకాసురుడు అబ్బయ్య..
దెందులూరు నియోజకవర్గంలో ఖాళీ జాగా కనిపించిందంటే సాయంత్రంకల్లా అబ్బయ్య అను చరులు వాలిపోతారు. ఐదేళ్లల్లో 300 ఎకరాలకు పైగా భూములను అన్యాక్రాంతం చేశారు. పెదవేగి మండలం పిన్నకడెంలో బుడగ జంగాలను బెది రించి 10 ఎకరాల భూమిని లాక్కున్నారు. రాముని పాలెం, పెదపాడులో 50 ఎకరాలు అసైన్డ్ భూముల్నీ గుంజుకున్నారు.
ఇతర రాష్ట్రాల్లో ఆస్తులు..
ఒకప్పుడు హైదరాబాద్‌వస్తే అద్దె చెల్లించడానికి కూడా డబ్బులుండక,తెలిసిన స్నేహితులు, బంధువు ల ఇళ్లల్లో తలదాచుకున్నాడు అబ్బయ్యచౌదరి. నేడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వందల కోట్లతో పరిశ్రమలు పెట్టే స్థాయికి ఎదిగారు. బెంగుళూ రునూ పెద్దఎత్తున భూములు, విల్లాలు కొన్నాడు.
తవ్వుకో.. దోచుకో…
గ్రావెల్ తవ్వకాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి లీజు అనుమతులు లేకుండా ఖాళీ జాగా కనిపిస్తే చాలు తవ్వుకుని అమ్మేస్తున్నారు. గోరంత అనుమతులు తీసుకొని కొండంత తవ్వకాలు చేస్తున్నారు. తవ్వకాల లీజు గడువు ముగిసినా మైనింగ్, అక్రమ రవాణా ఆగడం లేదు. వైసీపీ అండా దండతో అబ్బయ్య చౌదరి దందా సాగిస్తూ.. వచ్చిన సొమ్ముతో హైదరాబాద్‌లో ఇటీవల 70 కోట్లతో పెద్ద కంపెనీయే పెట్టాడు. ప్రతిపక్షాల ఆందోళనతో అధికారులు అక్రమ రవాణాను అడ్డుకుంటే, అధికార బలంతో అధికారులపైనే కక్షసాధింపులకు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దిగుతున్నాడు. దందా గురించి అధికారులకు సమాచారం ఇచ్చిన వారిని టార్గెట్ చేస్తాడు. మట్టి ధరలు సామాన్యుడు కొనలేని స్థాయికి చేరాయి అ.చౌ. ఇలాకాలో. అక్రమంగా తరలిస్తున్న వాహనాలను ఆయా గ్రామాల ప్రజలు అడ్డుకుని ఆందోళనకు దిగినా పరిస్థితిలో మార్పు రాలేదు.
పేట్రేగుతున్న ఆగడాలు..
అబ్బయ్యచౌదరి దౌర్జన్యాలు, ఆగడాలు, అరాచకాలకు అడ్డులేకుండా పోతోంది. ప్రతిపక్ష నాయకుల మీదే కాదు ఎవరు ప్రజా సమస్యలపై స్పందించినా అక్రమ కేసులతో వేధింపులకు గురి చేస్తుం ది అబ్బయ్య అండ్ కో. వీళ్ల ఆగ డాలతో గ్రామీణులు ఠారెత్తి పోతున్నారు. రోడ్డు నిర్మాణం పేరుతో పంట పొలాలను ధ్వంసం చేస్తూ దౌర్జన్యంతో రైతుల కడుపు కొడుతున్నారు.
పోలవరం కుడి కాల్వను తవ్వేస్తూ..
పోలవరం కుడికాలువను అబ్బయ్యచౌదరి ఆధ్వర్యంలో యథేచ్ఛగా తవ్వుకొని మట్టి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రయితే చీకటి వ్యాపారం మొదలౌతుంది. పెదవేగి మండలంలో పోలవరం కుడికాల్వనుంచి ప్రతి రోజూ రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకూ అక్రమంగా తరలిస్తున్నారు. ఇక్కడ నుంచి గుడివాడ, నూజివీడు, ఏలూరు పరిసర ప్రాంతాలకు రోజుకి 300 వందలకు పైగా లారీల్లో మట్టిని తరలిస్తున్నారు
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి, ఆయన అనుచరు లు భారీ ఎక్స్‌కవేటర్లు, వందలాది టిప్పర్ల ద్వారా మట్టి, గ్రావెల్‌ను తవ్వేస్తుండటంతో.. పచ్చని పొలా లు సైతం నాశనమయ్యాయి. పెదపాడు మండలం ఏపూరులోని 127 సర్వే నెంబరులోగల 136.44 ఎకరాలు, కలపర్రులోని సర్వే నెంబర్లు 11,66/1, పెదవేగి మండలంలోని కవ్వగుంటలోని 43, రామ న్నపాలెంలోని 282, 306, 14, జగన్నాథపురం లోని 289 సర్వే నెంబర్లలోని భూమిలో, అలాగే దెందులూరు మండలంలోని సీతంపేటలోగల 212, గోపన్నపాలెంలోని 252, 65/11, శ్రీరామవరం లోని 166, చల్లపల్లి గ్రామంలోని 155/3, 156 సర్వే నెంబర్లలో వందలాది ఎకరాల్లోని భూమిని అక్రమంగా తవ్వేశారు. ఇక అబ్బయ్య ఇలాకాలో కొత్తగా లేఅవుట్ వేస్తే ఒక్కో ఎకరాకు రూ.10-15 లక్షలు కప్పం కట్టాలి.
400 నుంచి 500 మీటర్లమేర అనుమతులు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా పగలు, రాత్రి తేడా లేకుండా మట్టిని తవ్వేస్తున్నారు.లక్ష్మీపురం, కవ్వగుంట, వంగూరు, జగన్నాథపురం, కొప్పాక, పెదగడిమి గ్రామాల పరిధుల్లో ఉన్న పోలవరం మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. పెదవేగి, గార్ల మడుగు, రాయన్నపాలెం, బాపిరాజుగూడెం, జానం పేట గ్రామాల్లోని పలు చెరువుల్లో మట్టిని అనధికా రికంగా తవ్వేస్తున్నారు. పెదపాడు మండలం ఏపూరు పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 127లోని సుమారు 136 ఎకరాల విస్తీర్ణంలో వున్న చెరువులో, అప్పనవీడు పంచాయతీ పరిధిలో వున్న గంగానమ్మ చెరువు, జ్యోతినగర్‌ను ఆనుకుని వున్న చెరువులో, కలపర్రులో జాతీయరహదారిని ఆనుకు ని వున్న సర్వే నెంబరు 11లో 138 ఎకరాల విస్తీ ర్ణంలో వున్న ప్రభుత్వ పోరంబోకు చెరువుల్లో యథే చ్ఛగా మట్టి తవ్వకాలు జరిపి లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలించారు.
ఇళ్ల పట్టాల్లో అవినీతి..
రామునిపాలెం, దెందలూరు, కొప్పాక, పెదపాడు తదితర ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల కోసం సేకరించిన 60 ఎకరాల భూమిలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డాడు. వ్యవసాయ భూముల్లో ఎడాపెడా చేపల చెరువుల తవ్వేస్తూ అబ్బయ్య చౌదరి నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఐదేళ్లలో వెయ్యికి పైగా చేపల చెరువులకు అనుమతులు ఇచ్చారు. పంట కాలువల నుంచి అక్రమంగా చేపల చెరువులకు నీరు మళ్లిస్తున్నారు. చేపలకు ఆహారంగా మాంసం వ్యర్థాలను వేయటాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది నెలకు రూ.40 లక్షలు తీసుకుంటూ అబ్బయ్య చౌదరి అనుమతులిచ్చారు. చేపలు పట్టిన తరువాత వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా నేరుగా గెడ్డలు, వాగుల్లోకి విడిచిపెడుతూ పంట పొలాల నాశనానికి అబ్బయ్య చౌదరి కారణమయ్యాడు.
నెలవారీ అబ్బయ్య రోడ్డు ట్యాక్స్..
ఏలూరు నుండి కైకలూరు రహదారి కాంట్రాక్టర్ నుంచి రూ.75 లక్షలు
ఏలూరు పెదపాడు రహదారి కాంట్రాక్టర్ నుంచి రూ.60 లక్షలు.
కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్టర్ నుంచి రూ.50 లక్షలు.
రెచ్చిపోతున్న రేషన్ మాఫియా..
దెందులూరులో యథేచ్చగా సాగుతున్న రేషన్ మాఫియాకు అబ్బయ్యచౌదరి తండ్రి అండదండలున్నాయి. ఇందుకుగాను నెలకు 15 లక్షల రూపాయలు ముడుపులు అందుతున్నాయి. నియోజకవర్గంలో రేషన్ బియ్యం మాఫియా విచ్చలవిడిగా చౌకబియ్యాన్ని పెద్దఎత్తున మార్కెట్‌కు తరలిస్తున్నా అధికారులు, పోలీసులు నోరెత్తడానికి లేదు.
బినామీలమయం..
ఏ దందాలోనైనా `అబ్బయ్య ఆనవాలు కూడా కనిపించదు. ఎందుకంటే `మండలానికో బ్రోకర్ సైనికుడు పని చక్కబెడుతుంటాడు. నియోజకవర్గాన్ని మండలాలవారీగా విభజించి.. అనుచరులకు అప్పగించేశాడు అబ్బయ్య. వీళ్లలో వీర సైనికులు ఆర్గురు. ఎవరెవరు ఏయే దందా సాగించాలో అనధికార రాజ్యాంగాన్నే రాసుకున్నారు. ఒకరి పనిలో మరొకలు వేలు పెట్టకపోవడం అవినీతిలో వీళ్ల వీరభక్తికి నిదర్శనం.
1. మేడికొండ కృష్ణ, పెదవేగి మండల ఉప ఎంపీపీ భర్త: ఖాళీ భూముల్ని గుర్తించి దొంగ పత్రాలు సృష్టించడం. భూకబ్జాలు చేయడం. దందాను మొదలెట్టే ప్రధాన అనుచరుడు. చివరకు అబ్బయ్యచౌదరిని కలవాలన్నా.. ఇతగాడు ధర నిర్ణయించిన తరువాతే. వసూలు చేసేది ఇతగాడే.
2. కామిరెడ్డి నాని: దెందులూరు మండల వైసీపీ అధ్యక్షుడు. ఎంటర్‌టైన్‌మెంట్ దందా ఇతని డ్యూటీ. నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు నిర్వహణ, సాయంత్రానికి కలెక్షన్లు తీసుకెళ్లి అబ్బయ్యకు అప్పగింత.
3. కూచిపూడి భాస్కర్‌రావు, జానంపేట బాబు: వీళ్లది చేపల చెరువుల దందా. కొల్లేరు కాంటూర్లు మింగేస్తూ సాగిపోతున్న చేపల చెరువులకు అనుమతులివ్వడం వీళ్ల డ్యూటీ. సాగు భూముల్ని సైతం చేపల చెరువులుగా మార్చుకోడానికి.. చట్టాన్ని పక్కనపెట్టి అనుమతులిస్తుంటారు. ఎకరాకు హీనపక్షం 5 నుంచి 10 లక్షలు వసూలు.
4. అక్కినేని రాజశేఖర్, జెడ్పీ ఛైర్మన్ భర్త: చేపల చెరువులు, పేకాట క్లబ్బుల పర్యవేక్షణ. పైసా వసూల్ ప్రధాన డ్యూటీ. పోలీసుల దగ్గర, కాంట్రాక్టరు దగ్గర డబ్బులు వసూలు చేసే అబ్బయ్య పెద్ద పాలేరు.
5. వైసీపీ నేత గుమ్మడి శ్రీనివాసరావు: దెందులూరు మండలంలోని మేదినరావుపాలెం, చల్ల చింతల పూడి, రామారావుగూడెం,పెరుగుగూడెం గ్రామా ల పరిధిలో మట్టి తవ్వకాలు చూసే బాధ్యత.
6. శ్రీనివాస్ ప్రసాద్: తెలంగాణలో అబ్బయ్య చౌదరి ఆస్తులు, పరిశ్రమల పర్యవేక్షణ ఇతగాడి పని. నియోజకవర్గంలో సెటిల్‌మెంట్లు, భూదందాలు, బెదిరింపులకు పాల్పడుతూ వచ్చిన డబ్బులన్నీ పెట్టుబడులుగా మారుస్తుంటాడు. బ్లాక్ మనీ మొత్తం కంపెనీలలో పెట్టడం, మనీలాండరింగ్ లావాదేవీలు ఇతని ప్రధాన విధి.*