అమరావతి: రాష్ట్రంలో అధికారపార్టీ నేతలు పోలీసులపై దాడులకు పాల్పడుతున్నారనే వార్త ఒక మాజీ పోలీసు అధికారిగా తనకు ఎంతో బాధ కలిగిస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. పోలీసులపై దాడులు జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతలు నశించాయనడానికి నిదర్శనమన్నారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి వర్ల రామయ్య బుధవారం లేఖ రాశారు. కడపలో అనిల్ కుమార్ అనే పోలీసు అధికారిపై స్థానిక వైసీపీ నాయకులు విచక్షణారహితంగా దాడికి పాల్పడటం దుర్మార్గమని ఆ లేఖలో వర్ల పేర్కొన్నారు. న్యాయం చేయాలంటూ అనిల్ కుమార్ భార్య బహిరంగంగా రోదిస్తూ 100కు డెయిల్ చేయడం హృదయవిదారకం. వైసీపీ పాలనలో జరుగుతున్న ఇటువంటి ఘటనలు గతంలో ఎన్నడూ చూడలేదు. గతంలో ఇదే కడపలో హైమావతి అనే సర్కిల్ ఇన్ప్సెక్టర్ ఇసుక మాఫియాను ప్రశ్నిస్తే ఆమెపై దాడికి పాల్పడ్డారు. బలవంతంగా ఆమె ఫిర్యాదును వెనక్కు తీసుకునేలా చేశారు. విశాఖపట్నం జిల్లా మూకవరపాడులో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ లపై వైసీపీ ఎంపీ బంధువులు దాడికి పాల్పడ్డారు. సత్యసాయి జిల్లా, మోటుకుపల్లిలో వేణుగోపాల్ రెడ్డి అనే కానిస్టేబుల్ పై వైసీపీ ఎంపీపీ భర్త దాడికి పాల్పడ్డాడు. ధర్మవరం వైసీపీ నాయకులు హిందూపురం పోలీస్ స్టేషన్ లో ఒక మహిళా కానిస్టేబుల్ పై దాడి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో పోలీసులపై అధికారపార్టీ నాయకులు అనేక దాడులకు పాల్పడ్డారు. అధికారపార్టీకి కొమ్ముకాస్తూ వైసీపీ నాయకులను వెనకేసుకొచ్చే పోలీసు సంఘాలు.. పోలీసులకు అన్యాయం జరిగినప్పుడు మాత్రం మాట్లాడటం లేదు. రాష్ట్రంలో పోలీసులకు ఇటువంటి పరిస్థితి దాపురించడానికి కారణం అధికార పార్టీ నాయకులను వెనకేసుకొస్తూ ప్రతిపక్షాలపై తప్పడు కేసులు నమోదు చేస్తున్న కొంతమంది పోలీసు అధికారులే. ఇప్పటికైనా పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులు వీటిపై స్పందించి ఇటువంటి దుర్మార్గాలను అరికట్టకపోతే రాష్ట్రంలో శాంతిభద్రతలకు పూర్తి విఘాతం కలుగుతుంది. పోలీసు అధికారులపై దాడులకు పాల్పడిన అధికారపార్టీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోండి. పోలీస్ బాస్ గా పోలీసు శాఖ గౌరవాన్ని కాపాడాల్సిన భాధ్యత మీపై ఉంది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తూ అధికారపార్టీకి కొమ్ముకాస్తున్న నేరస్తులపై కఠిక చర్యలు తీసుకోవాలని డీజీపీని వర్ల రామయ్య కోరారు.