టిడిపి అధికారంలోకి వచ్చాక కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని వేగవంతం చేసి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా మంగళవారం కడప చెన్నూరు బస్టాండు వద్ద యూత్ సొసైటీ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కడప జిల్లా యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
మా ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతను ఆదుకోవాలి. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి రూ.5వేలు ఇప్పించాలి. యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు స్కాలర్ షిప్ లు సకాలంలో అందడం లేదు. ఉన్నత విద్యకు ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని కొనసాగించాలి. విదేశీ విద్య నిబంధనలను సరళతరం చేసి ఎక్కువ మందికి అవకాశం కల్పించాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా కడప జిల్లా యువతకు తీరని ద్రోహం చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కు రెండుసార్లు శిలాఫలకాలు వేసిన జగన్… ఆ పనులను అడుగు కూడా ముందుకు కదల్చలేదు. అధికారంలోకి వచ్చాక ఒక్క జాబ్ క్యాలండర్ గానీ, ఉద్యోగం కానీ లేదు. జగన్మోహన్ రెడ్డి జె-ట్యాక్స్ వేధింపుల కారణంగా రాష్ట్రంలోని పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. చంద్రబాబునాయుడు మహానాడులో ప్రకటించిన విధంగా పెద్దఎత్తున పరిశ్రమలను రప్పించి ప్రైవేటురంగంలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.
ఉద్యోగం వచ్చేవరకు ప్రతినిరుద్యోగికి రూ.3వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తాం. నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటుచేస్తాం. జిఓ నెం.77ని రద్దుచేసి పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని పునరుద్దరిస్తాం. విదేశీవిద్యకు అనవసరమైన నిబంధనలను తొలగించి గతంలో మాదిరిగా పెద్దఎత్తున పేదవిద్యార్థులకు అవకాశం కల్పిస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. .