టిడిపి అధికారంలోకి వచ్చాక దుల్హన్ పథకంలో వైసీపీ పెట్టిన షరతులన్నీ తొలగిస్తాం, అర్హులందరికీ పథకం అమలు చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా గురువారం జమ్మలమడుగు బైపాస్ రోడ్డులో ముస్లిం మైనారిటీలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. పేద మైనారిటీల కోసం కమ్యూనిటీ హాళ్లు నిర్మించాలి. మైనారిటీలకు ప్రత్యేక శ్మశానవాటిక, ఉర్దూ పాఠశాల నిర్మించాలి. దుల్హన్ పథకంలో వైసీపీ పెట్టిన నిబంధనల వల్ల అతితక్కువ మందికి మాత్రమే వస్తోంది.
టీడీపీ అధికారంలోకి వచ్చాక నిబంధనలు తొలగించి దుల్హన్ పథకాన్ని అందరికీ అందించాలి. బీడీ కార్మికులకు కాలనీలు నిర్మించి ఇళ్లు ఇవ్వాలి. తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాలు ఇప్పించాలి. ఆరోగ్య బీమా అమలు చేయాలి. ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేసి వడ్డీలేని రుణాలు ఇప్పించాలి అని విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మైనారిటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. మైనారిటీలకు చెందాల్సిన రూ.5,400 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించారు.
రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీలకు చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తులను వైసిపి నేతలు యథేచ్చగా అన్యాక్రాంతం చేస్తున్నారు. నర్సరావుపేటలో మసీదు స్థలం కబ్జాను అడ్డుకున్న ఇబ్రహీంను దారుణంగా నరికి చంపారు.పేద ముస్లింల వివాహానికి కానుకగా ఇచ్చే దుల్హాన్ పథకాన్ని అడ్డగోలు నిబంధనలతో పూర్తిగా నీరుగార్చారు. దుల్హాన్ పథకం కింద టిడిపి హయాంలో 32,722 మందికి 163.61 కోట్లు అందజేస్తే, వైసిపి ప్రభుత్వం ఊరికి ఒకరిద్దరికి కూడా పథకాన్ని ఇవ్వలేదు.
గతంలో మైనారిటీలకు అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటుచేసి మైనారిటీల స్వావలంబనకు కృషిచేస్తాం. జమ్మలమడుగు మైనారిటీలకు కమ్యూనిటీ హాలు, ఉర్దూ పాఠశాల, ప్రత్యేక శ్మశానవాటిక నిర్మిస్తాం. అర్హత ఉన్న బీడీ కార్మికులందరికీ ఉచితంగా పక్కా ఇళ్లు నిర్మిస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.