రేషన్ బియ్యంలో అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలపై అధికారం లోకి వచ్చాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర లో భాగంగా సోమవారం ఆలూరు నియోజకవర్గం గుండ్లకొండ గ్రామస్తులు లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. గుండ్లకొండ గ్రామంలో రేషన్ బియ్యం నాలుగు నెలలుగా సరిగా ఇవ్వడం లేదని, వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి బియ్యం అందరికీ రావడం లేదని, పేదల బియ్యాన్ని వైసీపీ నేతలు దారి మళ్లిస్తున్నారని ఆ గ్రామస్తులు ఆరోపించారు. మా బియ్యం మాకు వచ్చేలా చేయండి అని విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
పేదల బియ్యాన్ని కూడా వైసీపీ నేతలు దోచేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి రూ.6,700 కోట్ల అవినీతికి వైసీపీ ప్రభుత్వం పాల్పడింది ఇంటింటికీ రేషన్ వాహనాలు కొనుగోలులో రూ.2 వందల కోట్లు దోచేశారని లోకేష్ ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే పేదలందరికీ రేషన్ కార్డుల జారీతోపాటు, పారదర్శకంగా రేషన్ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.