ఇంటి స్థలం ఇవ్వకుండానే ఇచ్చినట్లు వైసీపీ ప్రభుత్వం అసత్య ప్రచారాలతో ప్రజల్ని మోసం చేస్తుందని కోడూరు మండల టిడిపి అధ్యక్షులు బండి శ్రీనివాసరావు ఆరోపించారు. శనివారం కోడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో కోడూరు మండలంలో నిర్వహిస్తున్న గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా కరపత్రాలు వైసిపి నాయకులు పంచుతున్నారని తెలిపారు. జగన్ పాలనంతా మోసంతో నిండిపోయిందన్నారు.
ఇస్మాయిల్ బిగ్ పేట గ్రామానికి చెందిన బండి లక్ష్మీకి ఇంటి స్థలం కేటాయిం చినట్లు, తద్వారా ప్రభుత్వం నుంచి రెండు లక్షల లబ్ధి చేకూరినట్లు కరపత్రంలో చూపించారని, కరపత్రంలో చూపిం చిన ఇంటి స్థలం ఎక్కడ ఉందో వెంటనే స్థానిక అధికారులు, వైసిపి నాయకులు చూపించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మోసపూరిత ప్రచారాలు మాని ప్రజల వద్దకు వాస్తవ నిరూపణతో వెళ్లాలని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసి వైస్ చైర్మన్ కాగిత రామారావు, అవనిగడ్డ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు మద్దూరి కాంతారావు, కోడూరు మండల తెలుగు యువత అధ్యక్షులు, బడే గాంధీ, మల్లాది ప్రసాద్, మేకా రమేష్ తదితరులు పాల్గొన్నారు.