వర్తమాన రాజకీయాలలో ప్రజాప్రతినిధి అన్న పదానికి అర్థాలు మారిపోయాయి. యువత సైతం రాజకీయాలను తమ కెరీర్ గా ఎంచుకునేందుకు తటపటాయిస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రాజకీయాలకు ఒక హుందాతనాన్ని, ఒక క్రేజ్ ను కల్పించి, యువత సైతం ఆకర్షితులు అయ్యేలా చేయటం అంటే అంత అషామాషీ కాదు. అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఇలాంటి అసాధ్యాలెన్నో సుసాధ్యం అయ్యాయి. నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు నాయుడు లు రాజకీయాలకు ఒక హుందాతనాన్ని, పవిత్రతను చేకూర్చారు. ఇప్పుడదే బాటలో నారా లోకేష్ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. తన రాజకీయ ప్రస్థానాన్ని ఒక మహాయజ్ఞంలా కొనసాగిస్తున్నారు. పెద్దల సభగా వ్యవహరించే శాసనమండలి లో సభ్యునిగా అరంగేట్రం చేసిన లోకేష్ ఎంతో పరిణితి కనబరిచారు.
తాత, తండ్రి ల పేరు ప్రతిష్టలు ఏమాత్రం మసకబారనీయ కుండా, తనదైన శైలిలో హుందాతనం కూడిన రాజకీయాలు నడిపి శాసనమండలి చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీ సృష్టించుకున్నారు. తెలుగుదేశం పార్టీ కే కాదు, రాష్ట్రానికి సైతం మంచి భవిష్యత్ ఇవ్వగలరన్న భరోసా ప్రజలకు కలిగించటం లో లోకేష్ సఫలీకృతుల్యారు. లోకేష్ మూర్తీభవించిన మానవత్వానికి ప్రతిరూపం. లోకేష్ బాట అభివృద్ధి. టిడిపి బరువును, పరువును తన భుజస్కందాలపై వేసుకొని తెలుగునేల నలుచెరుగులా కలియ తిరుగుతున్న అలుపెరుగని శ్రామికుడు లోకేష్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శాసనమండలి సభ్యునిగా ఆరేళ్ల పదవీకాలం 29 వ తేదీతో ముగియనున్నది. ఈ సందర్భంగా లోకేష్ సాధించిన విజయాలతో మచ్చుకు కొన్ని అయినా చర్చించుకోవల్సిన ఆవశ్యకత ఎంతైనా వున్నది.
2017 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేష్ మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. కేవలం రెండేళ్ళ వ్యవధిలోనే కేబినెట్ మంత్రిగా అభివృద్ధి కి కొత్త భాష్యం చెప్పారు. ఐటి, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖలు సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండవ సంవత్సరమే సెల్ ఫోన్ ల తయారీలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారు. ఐటి రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. గ్రామీణ ప్రాంతాలలో పేదరిక నిర్మూలనా పథకాలను ప్రత్యేక శ్రద్ధతో అమలు చేసి పంచాయతీలలో ప్రగతి కాంతులు విస్తరింప చేశారు. గ్రామీణ నీటి సరఫరా లో స్వచ్ఛతా ప్రమాణాలు నెలకొల్పటం ద్వారా పల్లెవాసుల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. గ్రామీణ రహదారులను కాంక్రీటు తో నిర్మించటం ద్వారా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు.
ప్రధానంగా సురక్షిత త్రాగునీటి పథకాలకు అత్యధిక ప్రాధాన్యత నిచ్చారు. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 103 మదర్ యూనిట్ లు, 2,655 డిస్పెన్సింగ్ యూనిట్ లు ఏర్పాటు చేశారు. వాటర్ హెడ్ ట్యాంకులను ఆరు దశల్లో పరిశుభ్రం చేసే విధంగా జర్మన్ సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన వాహనాలను వినియోగించారు. వాటర్ గ్రిడ్, స్వచ్ఛ ధార వంటి పధకాలను పారదర్శకంగా అమలు జరిపారు. త్రాగునీటి సమస్యలు ఓకే ఒక్క ఫోన్ కాల్ తో పరిష్కారం అయ్యే విధంగా టోల్ ఫ్రీ నంబరుతో జలవాణి, కిసాన్ రాజా కార్యక్రమాలు అమలు జరిపారు.
అదేవిధంగా పల్లేసీమలు ఎప్పుడూ పచ్చగా వుండి కాలుష్యం దరిచేరనీయ కుండా చేసేందుకు లోకేష్ మంత్రిగా ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. మియావాకి పద్ధతిలో 12,918 గ్రామాలలో పల్లె వనాలు పెంచటం ద్వారా వాటిని హరితమయం చేశారు. గ్రామాలలో విద్యుత్ ను పొదుపు చేయటంతో పాటు వెలుగులు విరజిమ్మే విధంగా చంద్రకాంతి పథకం ద్వారా ఎల్ ఈ డి బల్బులను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. గ్రామాలలో భూగర్భ నీటి పారుదల పథకాలకు పెద్దపీట వేశారు. పారిశుధ్యం మెరుగు పరచేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. పంచాయతీలలో చెత్త నుంచి సంపద సృష్టించే విధంగా పథకాలను అమలు జరిపారు.
పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా 22,283 కిలోమీటర్ల పొడవున బిటి రోడ్లను మెరుగు పరచి దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించారు. మరో 4,286 కిలోమీటర్ల పొడవున నూతన రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. విద్యావంతులైన యువత కు ఆధునిక అవసరాలకు తగిన విధంగా నైపుణ్య శిక్షణ ఇప్పించారు. ఉద్యోగం లభించే వరకు వారందరికీ నిరుద్యోగ భృతి అందజేశారు. యువనేస్తం పథకం ద్వారా దాదాపు 5 లక్షలమంది ఉద్యోగాలు కల్పించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సమర్థంగా అమలు జరిపారు. గ్రామీణ ప్రాంతాలలో పనులు కల్పించటం ద్వారా వారి జీవన ప్రమాణాలు పెంపిందించారు. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం అమలయిన మొదటి పది జిల్లాలలో 8 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ లోనివే కావటం లోకేష్ సమర్ధతను నిదర్శనం గా చెప్పవచ్చు. లోకేష్ మంత్రిగా వున్న సమయంలో రూ.10వేల కోట్లతో గ్రామీణ మౌలిక సదుపాయాలు అభివృద్ధి పరిచారు.
చైనా లో జరిగిన ఎకనామిక్ ఫోరం సదస్సుకు లోకేష్ హాజరయ్యారు. దావోస్, అమెరికా లలో ఇన్వెస్ట్మెంట్ రోడ్ షో లు నిర్వహించారు. ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, కోయంబత్తూరు, చెన్నై వంటి నగరాలలో పర్యటించి పెట్టుబడిదారులను ఆకర్షించారు. చంద్రబాబు పారదర్శక పాలన, లోకేష్ కృషి ఫలితంగా పలుకంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. విశాఖ, అమరావతి, తిరుపతి లలో ఐటి క్లస్టర్ లను ఏర్పాటు కు శ్రీకారం చుట్టారు. విశాఖలో ఐటి సెజ్ ఏర్పాటు చేసి ఒకేరోజు 21 కంపెనీలను ప్రారంభించటం అప్పట్లో ఒక చరిత్ర. లోకేష్ మంత్రిగా వున్న సమయంలో కేంద్రప్రభుత్వం ప్రకటించిన ర్యాంకింగ్ లలో ఏపి ఇన్నోవేషన్ వ్యాలీ లీడర్ గా నిలిచింది.
మంత్రిగా పదవీ కాలం పూర్తయి ప్రభుత్వం మారినప్పటికీ లోకేష్ తాను నమ్మిన బాట వీడలేదు. నియంతృత్వ పోకడలతో వున్న ప్రభుత్వంపై ప్రజాస్వామిక పోరాటం జరుపుతున్నారు. అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేస్తూ బిల్లు పెట్టిన సందర్భంలో అధికార పార్టీ సభ్యులను దీటుగా ఎదుర్కొని సమాధానం చెప్పిన ధీశాలి. తన పై ప్రత్యర్ధులు చేసే విమర్శలకు పని తీరులోనే సమాధానం చెబుతున్నారు. ప్రస్తుతం యువగళం పేరుతో లోకేష్ జరుపుతున్న పాదయాత్ర రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభుత్వం అధికార దుర్వినియోగం తో అణచి వేసే ప్రయత్నం చేస్తున్నా ఏమాత్రం వెరవకుండా ముందుకు సాగిపోతుండటం టిడిపి శ్రేణులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను లోకేష్ మరో శిఖరానికి చేర్చడంలో సఫలీకృతులయ్యారు. లోకేష్ మళ్లీ చట్టసభలో అడుగుపెట్టే శుభగడియ కోసం రాష్ట్ర ప్రజానీకం ఎదురుచూస్తోంది.