సాధారణంగా ఫామ్ లో ఉన్న హీరోకు.. పవర్ లో ఉన్న లీడర్‌కు ఫ్యాన్స్ ఉంటూ ఉంటారు. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది హీరో పై ఉన్న క్రేజు.. నాయకుడిపై ఉన్న మోజును బట్టి మారుతూ ఉంటుంది. కానీ..ఏపీలో అనూహ్యంగా అధికార వైసీపీలో.. టీడీపీ “ఫ్యాన్స్” పెరుగుతుండటం ఆసక్తి కలిగిస్తోంది. వైసీపీలో టీడీపీ ఫ్యాన్స్‌గా మారుతున్న వారిలో డజను మందికి పైగా ఎమ్మెల్యేలు.. ఒకరిద్దరు మంత్రులు కూడా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. పార్టీ పవర్‌లో ఉన్నా.. ఎడాపెడా బటన్లు నొక్కుతున్నా వైసీపీ ఎమ్మెల్యేలు.. టీడీపీ ఫ్యాన్స్‌గా మారుతుండటం ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారుతోంది.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాటలను నమ్మిన ఏపీ ప్రజలు 2019 లో అధికారం కట్టబెట్టారు. ఏకంగా 151 సీట్లలో ఆ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించారు. దీంతో ఇక..మాకు తిరుగేలేదు అనేలా సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించటం మొదలు పెట్టారు. పరిపాలనలో ఒంటెత్తు పోకడలెన్నో పోయారు. గత నాలుగేళ్లుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు సైతం అధికార గర్వంతో విర్రవీగుతూ వచ్చారు. కానీ గత కొంత కాలంగా వైసీపీలో అసమ్మతి రాగాలు జోరందుకున్నాయి. నిన్న మొన్నటి వరకు సీఎం జగన్ భజన చేసిన ఎమ్మెల్యేలు ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా ఉన్నా పనులు జరక్క పోవటం.. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదనే ప్రచారం, సీఎం జగన్ గ్రాఫ్ భారీగా పడిపోతుండటం వంటి కారణాలు.. ఎమ్మెల్యేల్లో పక్క చూపులకు అవకాశం కల్పిస్తున్నాయి. ఫ్యాన్ పార్టీలో ఉక్కపోతకు గురౌతున్న నేతలంతా ఇప్పుడు.. సైకిలెక్కి రిలాక్స్ అవుదామనే భావనకు వచ్చేస్తున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీలో.. టీడీపీ ఫ్యాన్స్ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని చెబుతున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి నుంచి ఉండవల్లి శ్రీదేవి వరకు.. టీడీపీ ఫ్యాన్స్ జాబితాలో చాలా మంది పేర్లే ఉన్నాయని అంటున్నారు.
వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో సుమారు 60 మందికి పైగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కవని ప్రచారం జరుగుతోంది. దీంతో.. ఆ జాబితాలో పేరు ఉందని భావిస్తున్న ఎమ్మెల్యేల్లో చాలా మంది టీడీపీతో తెరచాటు మంతనాలు సాగిస్తున్నట్టు చెబుతున్నారు. సుమారు 16 నుంచి 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలు.. ఆయా జిల్లాల్లో టీడీపీ నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకులతో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా ప్రస్తుతం సీఎం జగన్ మోహన్ రెడ్డికి కాకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పట్ల విధేయత ప్రకటిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి అనుకూలంగా ఓటేయటం..ఆ పార్టీలో టీడీపీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌కు అద్దం పడుతోందని అంటున్నారు. టీడీపీ కేవలం ఒక్క ఎమ్మెల్సీ స్థానంపైనే గురిపెట్టటంతో నలుగురు ఫ్యాన్స్ ఓటేశారని.. అదే చంద్రబాబు రెండు మూడు స్థానాలపై గురి పెడితే.. ఈ ఫ్యాన్స్ సంఖ్య మరింత పెరిగేదని అంటున్నారు. ప్రభుత్వ ఇంటిలిజెన్స్ వర్గాలు సైతం వైసీపీలో 16 మందికి పైగా హార్డ్ కోర్ టీడీపీ ఫ్యాన్స్ ఉన్నారని నివేదికలు ఇచ్చాయని చెబుతన్నారు. వీరిపై చర్యలు తీసుకుంటే.. వచ్చే ఎన్నికల్లో మొదటికే మోసం వస్తుందనే భయంతోనే.. సీఎం జగన్ మోహన్ రెడ్డి సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారని అంటున్నారు.
ఇక.. ప్రతీ జిల్లాలో ఒకరు లేదా ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు.. పార్టీ అధిష్టానం మీద గుర్రుగా ఉన్నారు. మొత్తం 26 జిల్లాల్లో కనీసం ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నట్టు చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే సుమారు 50 మందికి పైగా వైసీపీ ఎమ్మెల్యేలపై ఇంటిలిజెన్స్ నిఘా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంటిలిజెన్స్ హిట్ లిస్ట్‌లో ఉన్న నేతలంతా.. తమకు వచ్చే ఎన్నికల్లో సీటు రాదని ఆందోళన చెందుతున్నారు. సో.. ముందుగానే టీడీపీతో టచ్ లో ఉండటం బెటరనే భావనలో.. వారంతా ఆ పార్టీ ఫ్యాన్స్‌గా మారుతున్నారు. మొత్తం మీద.. అధికార వైసీపీలో రోజు రోజుకూ పెరుగుతున్న టీడీపీ ఫ్యాన్ ఫాలోయింగ్.. ఆ పార్టీ అధిష్టానాన్న కలవర పాటుకు గురి చేస్తోందనే చెప్పాలి.