.కమీషన్లకు కక్కుర్తిపడి 106 కల్తీ బ్రాండ్ల విక్రయం
.తాడేపల్లి ప్యాలెస్‌కు రూ.25వేల కోట్లు ముడుపులు
.తాగుబోతులని తాకట్టు పెట్టి రూ.33 వేల కోట్ల అప్పు
.840 బార్లకు 2025 వరకు లైసెన్స్‌లు
.మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు
అమరావతి: మద్యపాన నిషేధంపై జగన్ రెడ్డి మాటతప్పాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కమీషన్లకు కక్కూర్తిపడి 106 కల్తీ మద్యం బ్రాండ్లు మార్కెట్లోకి ప్రవేశపెట్టారన్నారు. తాగుబోతులని తాకట్టు పెట్టి రూ.33 వేల కోట్ల అప్పుతీసుకున్నారని విమర్శించారు. మూడు సంవత్సరాల క్రితం అధికారంలోకి రావడానికి జగన్ రెడ్డి చెప్పిన మోసపు మాటల్లో ప్రధానమైంది మద్యపాన నిషేధం అని తెలిపారు. కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోందని, మానవ సంబంధాలు ధ్వంసం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తామని, మద్య నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతామని చెప్పారన్నారు. ఈ విషయాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టినట్లు తెలిపారు. ఇటీవల గుడివాడ అమరనాథ్ మాట్లాడుతూ మద్యపాన నిషేదం తమ మేనిఫెస్టోలో లేదని చెప్పారన్నారు. ఇలాంటి అబద్ధాలు, దివాలాకోరు మాటలు మాట్లాడటానికి గుడివాడ అమర్‌నాథ్‌కు సిగ్గు అనిపించలేదా? అని అడిగారు. ఈ విధంగా మంత్రులు మాట్లాడుతున్నారా? లేక మంత్రులతో జగన్ మాట్లాడిస్తున్నారా? అని ప్రశ్నించారు.
మద్యం అమ్మకానికి టార్గెట్లు
మధ్యపానాన్ని నిషేధించడానికి బదులు సేవించడానికి, అమ్మడానికి డిపార్టుమెంటుకు, కలెక్టర్లకు జగన్‌రెడ్డి టార్గెట్లు పెట్టారని నిప్పులు చెరిగారు. కమీషన్లకు కక్కుర్తి పడి మద్యం ద్వారా వచ్చే ఆదాయమంతా తనకే రావాలనే దుర్భుద్ధితో 106 కల్తీ మద్యం బ్రాండ్లు విడుదల చేశారని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని కంపెనీలు మన రాష్ట్రంలో దొరుకుతాయని, వాటిని జే బ్రాండ్లు అంటారన్నారు. డిస్టలరీ యజమానులను బెదిరించి, వాటన్నిటిని కబ్జా చేసినట్లు తెలిపారు. కల్తీ మద్యాన్ని వాళ్ల అధికార దుర్వినియోగంతో ఏరులై పారిస్తున్నారని చెప్పారు. 840 బార్లకు 2025 వరకు లైసెన్స్‌లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. చిన్నచిన్న దుకాణాల్లో, టీ కొట్టుల్లో డిజిటల్ లావాదేవీలు అందుబాటులో ఉన్నా, మద్యం దుకాణాలలో మాత్రం లేదన్నారు. ప్రతి రోజూ వచ్చిన ఆదాయం తాడేపల్లి ప్యాలెస్‌కు చేరాలని నగదు చెల్లింపులకు మాత్రమే అనుమతించారని తెలిపారు. మద్యం తయారీని, అమ్మకాలను విపరీతంగా పెంచారని, దేశంలో తయారయ్యే విదేశీ మద్యం (ఐఎంఎఫ్‌ఎల్) కేసులు లక్షల్లో అమ్మకాలు జరుగుతున్నాయని వివరించారు. ప్రజలు ఈ దరిద్రపు మద్యం తాగి అనారోగ్యం పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లక్షాలాది మంది ఆస్పత్రుల పాలవుతున్నారని, వైద్యం ఖర్చు తడిసి మోపెడవుతోందని చెప్పారు. మద్యం డిస్టలరీలను ఆక్రమించి, తన బినామీలతో కల్తీ మద్యం తయారు చేయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా ఉండరన్నారు. తాగుబోతులని తాకట్టు పెట్టి రూ.33 వేల కోట్లు అప్పు తెవడమేకాకుండా, మరో రూ.25వేల కోట్లు అప్పు తేడానికి ప్రణాళిక రచిస్తున్నట్లు చెప్పారు. చెన్నై ఎస్జీఎస్ ల్యాబ్స్ వారు ఈ జె బ్రాండ్లు తయారు చేసే కల్తీ మద్యంలో వివిధ రకాల విష పదార్థాలు ఉన్నాయని, దానిని తాగడం వల్ల దీర్ఘకాలిక జబ్బుల బారిన పడి మరణిస్తారని మూడుసార్లు నివేదికలు ఇచ్చినట్లు తెలిపారు. ఆ తరువాత కొన్ని మద్యం బ్రాండ్లను షాపులలో కనకపడకుండా మాయం చేశారన్నారు. మద్యం తయారీ వల్ల ఏడాదికి దాదాపు రూ.5 వేల కోట్ల మిగులుతుందని, 5 ఏళ్లలో రూ.25వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కి చేరుతుందని చెప్పారు. దశల వారిగా మద్యపాన నిషేధం చేస్తానని మహిళల తలలు నిమిరి మరీ పాదయాత్రలో జగన్ రెడ్డి మాయ మాటలు చెప్పారని, ఇప్పుడు ఆ మాటలను తుంగలో తొక్కారని పేర్కొన్నారు. మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్పి, వాటిలోని హామీలను అమలు చేయకుండా వదిలివేసిన జగన్ రెడ్డి సిగ్గుపడాలన్నారు. మహిళల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, సమయం వచ్చినప్పుడు వారు తగిన బుద్ధి చెబుతారని నక్కా ఆనందబాబు హెచ్చరించారు.