.దశలవారీగా జగన్ అవినీతి బట్టబయలు చేస్తాం
.ఒక్కొక ఇంటిపై ఏటా రూ.1.08లక్షల భారం
.జగన్ రెడ్డి పాలనలో చితికిన చేనేతల బతుకులు
.మంగళగిరి బాదుడే బాదుడేలో యువనేత లోకేష్
.రోడ్లపై చేపలు పట్టి, నాట్లు వేసిన లోకేష్
అమరావతి: మీడియాపై ఫ్రంట్ ఫుట్ బ్యాటింగ్ అంటున్న జగన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో క్లీన్ బౌల్డ్ లేదా స్టంప్ అవుట్ కాక తప్పదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి పర్యటనలో ఉన్న లోకేష్ బుధవారం మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ… జగన్ కళ్ళు మూసుకుని ఆడే ఫ్రంట్ ఫుట్ తో బొక్కబోర్లా పడక తప్పదన్నారు. అసత్యాలు ప్రచారానికి సాక్షి బ్రాండ్ అంబాసిడర్, సాక్షిని మించిన అసత్యాలు ఎక్కడాలేవని తెలిపారు. జగన్ దోపిడీని దశల వారీగా బయటపెడతామని చెప్పారు. దొంగే దొంగా దొంగా అనే రీతిలో మొదటి నుంచీ జగన్ వ్యవహారం ఉందని దుయ్యబట్టారు. వరద ప్రాంతాల్లో జగన్ పర్యటన బూటకం, మేం వేసిన సిమెంట్ రోడ్డుపైనే నిన్న జగన్ తిరిగారని అన్నారు. వెనుక కార్లు కూడా వెళ్తుంటే ముందు ట్రాక్టర్ పై జగన్ వెళ్లాల్సిన పనేముందని ప్రశ్నించారు. పోలవరం విలీన మండలాల్లో వాస్తవాలను చంద్రబాబు రేపు బయటపెడతారని చెప్పారు. విలీన ప్రాంతాల ప్రజలకు వైకాపా ప్రభుత్వం ఏం చేసిందో తేటతెల్లమవుతుందని అన్నారు.
పెరిగిన ధరలతో సామాన్యుడి బతుకు దుర్భరం
మంగళగిరి పట్టణం 22 వ వార్డు రత్నాలచెరువు ప్రాంతంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. భావనాఋషి ఆలయంలో లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలియోతో బాధపడుతున్న తన మూడో కూతురుకు వీల్ చైర్ సాయం చేయాలని రాజేశ్వరి కుటుంబం లోకేష్ కు విజ్జప్తిచేయగా, వెంటనే అంగీకరించి వీల్ చైర్ అందిస్తానని లోకేష్ తెలిపారు. ఇంటింటికి తిరుగుతూ బాదుడే బాదుడు కరపత్రాలను లోకేష్ అందజేశారు. వైసిపి పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను లోకేష్ అడిగి తెలుసుకున్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, చెత్త పన్ను, ఇంటి పన్నుతో సహా అన్ని పెరిగిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నామని లోకేష్‌కి స్థానికులు సమస్యలను విన్నవించారు. రూ.15 వేలు సంపాదించుకునే పేద, మధ్య తరగతి కుటుంబాలకు టిడిపి పాలనలో నెలకు రూ.4వేలు మిగులు ఉంటే, వైకాపా పాలనలో రూ. 9వేలు లోటు ఉంటోందని లోకేష్ ఇంటింటికీ వెళ్లి వివరించారు. నెలకు రూ.9వేలు చొప్పున ఏటా రూ.1,08,000 మేర వైసిపి ప్రభుత్వం ప్రజల్ని దోచుకుంటోందని లోకేష్ మండిపడ్డారు. 2019 వరకు నెలకు రూ.11వేలు ఖర్చులకు సరిపోతే ఇప్పుడు రూ.20వేలు ఖర్చవుతోందని చెప్పారు. నిత్యావసరాలు, ఇతర ధరలకు సంబంధించి టిడిపి-వైకాపా పాలనలో వ్యత్యాసాలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఇటీవల మరణించిన, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను లోకేష్ పరామర్శించారు. రత్నాల చెరువు ప్రాంతంలోని చేనేత మగ్గం షెడ్లను ఆయన పరిశీలించారు. వర్షాల కారణంగా మగ్గాల్లోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్న నేతన్నలను పరామర్శించిన లోకేష్ వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. ప్రతి ఏడాది వర్షాకాలం మగ్గాల్లోకి నీరు రావడం వలన ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని నేతన్నలు లోకేష్ దృష్టికి తెచ్చారు. ముడిసరుకులైన నూలు, పట్టు, జర్రీ, రంగుల ఖర్చులు అధికమయ్యాయని నేతన్నలు వాపోయారు. నేతన్న నేస్తం కూడా కేవలం సొంత మగ్గాలు ఉన్న వారికే అందుతుంది. మాకు నేతన్న నేస్తం అందడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఉపాధి లేని సమయంలో ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదని నేతన్నలు సమస్యలు ఏకరువు పెట్టారు.
రోడ్లపై నాట్లువేసిన లోకేష్
రత్నాలచెరువు ప్రాంతంలోని కాలనీల్లో టిడిపి యువనేత నారా లోకేష్ పర్యటిస్తున్న సమయంలో కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు లోకేష్ దృష్టికి తెచ్చారు. సరైన రోడ్లు లేక వర్షాకాలంలో నరకం చూస్తున్నామని, ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. పాములు వస్తున్నాయి… దోమల బెడదతో అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితికి నిరసనగా గుంతలు పడిన రోడ్ల దగ్గర చేపలు పట్టి, వరి నాట్లు వేసి లోకేష్ నిరసన తెలిపారు.
తోపుడు బండ్ల అందజేత
మంగళగిరి పట్టణం 22 వ వార్డు రత్నాలచెరువు ప్రాంతంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్… రత్నాలచెరువుకు చెందిన 6 గురు చిరు వ్యాపారుల స్వయం ఉపాధి కోసం తోపుడు బళ్లు అందజేశారు. మంగళగిరి లో 2400 మగ్గాలు ఉంటే కేవలం 200 మందికే నేతన్న నేస్తం వస్తోందన్నారు. ఎన్నికల ముందు చేనేత కార్మికులందరికీ నేతన్న నేస్తం ఇస్తామన్న జగన్ రెడ్డి చేనేత వర్గాన్ని మోసం చేశారని తెలిపారు. యార్న్ సబ్సిడీ, విద్యుత్ రాయితీలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఎత్తేసారన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నల కుటుంబాలను ఆదుకోవాలని శాసన మండలిలో పెద్ద ఎత్తున పోరాడి ప్రభుత్వాన్ని నిలదీశానని, అయినా ప్రభుత్వం లో స్పందన లేదన్నారు. సొంత మగ్గం ఉంటేనే నేతన్న నేస్తం ఇస్తామనడంతో ఎంతో మందికి నష్టం జరుగుతుందన్నారు. చేనేత రంగం పట్ల వైసిపి ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది. వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు. వర్షాకాలం మగ్గాల్లో నీరు చేరి ఉపాధి కోల్పోతున్నారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని లోకేష్ విజ్జప్తిచేశారు.