అనంతపురం: రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న విలేకరులపై కేసులు పెట్టడం వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు పరాకాష్ఠ అని అనంతపురం టీఎన్‌ఎస్‌ఎఫ్ నేతలు విమర్శించారు. స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వైసీపీ ప్రభుత్వ అక్రమాలను ప్రజలకు తెలియజేస్తున్న విలేకరులపైన దాడులు చేయడం పత్రికా స్వేచ్ఛను కాలరాయడమే అని విమర్శించారు. రాష్ట్రంలో పాఠశాలల విలీనాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే…. అసలు పాఠశాలల్లో మౌలిక వసతులు ఎలా ఉన్నాయనే విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజేస్తున్న విలేకరులపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాడికి మండలంలో విలీనం జరిగిన పాఠశాల గదిలో సుమారు 125 మంది విద్యార్థులకు ఒకే చోట ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారంటూ ఫోటో తీసి వార్త రాసిన విలేకరిపై అక్రమ కేసులు బనాయించారని టీఎన్‌ఎస్‌ఎఫ్ నేతలు విమర్శించారు. త్వరలోనే వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం ప్రజలు ఓటుతో చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ పార్లమెంటు అధ్యక్షులు ధనుంజయ నాయుడు, రాష్ట్ర నాయకుడు లక్ష్మీనరసింహ, ఉరవకొండ అధ్యక్షులు ప్యారం భరత్ చౌదరి, గుర్రం భార్గవ్, కిరణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.