.ఏపీ అప్పుల పూర్తి డేటా కేంద్రం వద్ద లేదు
.ఉద్యోగుల బకాయిలు, కాంట్రాక్టర్ల బిల్లులు అందులో లేవు
.ఏపి మొత్తం అప్పు రూ3,98,903 కోట్లు కాదు
.వాస్తవ అప్పులు రూ.8.50 లక్షల కోట్లు
.టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి
అమరావతి: సాక్షి పత్రికకు విలువలు, విశ్వసనీయత లేవని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అప్పులపై పార్లమెంట్‌లో కేంద్రం ఇచ్చిన సమాధానమేంటి? వీరు పత్రికలోరాసిందేంటి? అని ప్రశ్నించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన మాటలు యథాతథంగా…… ప్రభుత్వం చేసిన అప్పులు తక్కువగా ఉన్నాయని నిన్న సాయంత్రం నుండి వైసీపీవారు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సంబరాలు చేసుకోవడంలో అర్థంలేదు. ఏపీ ప్రభుత్వ అప్పులకు సంబంధించి పార్లమెంటు పూర్తిగా డేటా సేకరించలేదు. ఆర్బీఐ ఇచ్చిన డేటా ప్రకారం వివరాలు ఇస్తున్నామని పార్లమెంటులో ప్రకటించారు. ఇచ్చిన డేటాను కూడా పత్రికలో ప్రచురించలేదు. ‘దుష్ట చతుష్టయం దొంగ లెక్కలు’ అని పెద్ద హెడ్డింగ్‌తో సాక్షిలో వార్త ప్రచురించుకున్నారు. వీరు పత్రికా విలువలను ఏరోజుకూడా పాటించారు. మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం రూ.లక్షా 30 వేల కోట్లేనని రాసుకోవడం తప్పు. తప్పుడు రాతలు రాసిందికాక అవతలవారిపైన నిందలా? పార్లమెంటులో నిన్న ఇచ్చిన డేటాలో ఏపీ చేసిన అప్పులు స్పష్టంగా లేవు. ప్రతి ఆర్థిక సంవత్సరం అయిపోగానే ఆర్బీఐ వారు స్టడీ ఆఫ్ బడ్జెట్ అని ఒక రిపోర్టు తయారు చేస్తారు. ఆ నివేదికను పార్లమెంటులో సమర్పించారు. పార్లమెంటు రాష్ట్రాలను అప్పుల వివరాలు అడగలేదు. కాగ్ ఆడిట్ చేసిన తరువాత ఆర్థిక శాఖవారు వాస్తవ డేటా వెళుతుంది. రాష్ట్రప్రభుత్వాలు 2021 నుండి 22వరకు కేవలం బడ్జెట్ డేటా మాత్రమే ఇచ్చాయి. అప్పులు నాలుగు రకాలుంటాయి. ఆర్బీఐ ద్వారా, వివిధ రకాల ప్రభుత్వ సంస్థల ద్వారా తీసుకునే రుణలు కాకుండా, ఇతర రుణాల వివరాలు ఆర్బీఐ వద్ద ఉండవు. ప్రభుత్వ రంగ సంస్థలు వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు కూడా ఉంటాయి. వాటి వివరాలు పార్లమెంటు సేకరించలేదు. యూనివర్శిటీల వద్ద, పంచాయతీల వద్ద, జీపీఎస్ లవద్ద తీసుకునే అప్పుల డేటా పార్లమెంటు సేకరించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వవలసిన బకాయిలు రూ.15 వేల కోట్లు పెండిరగ్‌లో ఉన్నాయి. కాంట్రాక్టర్లకు రూ.లక్షా 30 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు వారికి, సప్లయర్స్ కు ఇవ్వవలసిన బిల్లులు, సర్వీస్ ప్రొవైడర్స్ బిల్లులు పెండిరగ్ లో ఉన్నాయి. ఇవన్నీ రూ.లక్షా 50 వేల కోట్ల పైచిలుకు ఉంటాయి. ఇవన్నీ పార్లమెంటు ఇచ్చిన నివేదికలో లేవు. ఆర్బీఐ వద్ద కేవలం నెలవారీ బాండ్స్ డేటా మాత్రమే ఉంటుంది. అదికూడా రాష్ట్ర ప్రభుత్వం రిపోర్ట్ చేయాలి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోకుండా మేం 2022 మార్చికి కేవలం రూ3,98,903 కోట్లే అప్పు చేశాం, అందులో 2019 నుంచి ఇప్పటిదాక చేసింది రూ.లక్షా 30 వేల కోట్లే అంటే ఎవరు నమ్ముతారు? దాన్ని తాటికాయంత అక్షరాలతో సాక్షి పత్రికలో రాసుకొని సంబర పడిపోతున్నారు. వాస్తవంగా ఉన్న అప్పు రూ.8.50 లక్షల కోట్లు. ఇదంతా అప్పు కాదా? దీనిని ఎవరు కడతారు? జగన్ కడతారా? బుగ్గన రాజేంద్రనాథ్ కడతారా? మా ప్రభుత్వం వచ్చాక కూడా ఇంతే కట్టమంటారా? 3,98,903 కోట్లే కట్టమంటారా? రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్లు ప్రభుత్వం ఉన్న అప్పు కట్టమని అడుగుతారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పును కూడా చెల్లించమని అడుగుతారు. బయటికి తెలిసిన అప్పు రూ.లక్షా 50 వేల పైచిలుకే ఉంది. ఇంకా దాచిన అప్పులు ఎన్ని ఉన్నాయో తెలియదు. లిక్కర్ బాండ్స్ ద్వారా తెచ్చిన అప్పు, నాబార్డు, వరల్డ్ బ్యాంకు ద్వారా తెచ్చిన అప్పు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన అప్పులు కట్టాల్సి ఉన్నాయి. రూ.3,98,903 కోట్లే అప్పులున్నాయని సీఎం, బుగ్గన రాసివ్వగరా? దీనికి మించితే ప్రభుత్వాన్ని అడగొద్దు, ఏమున్నా మమ్మల్యే అడగండి అని రాసివ్వగలరా? కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 31 మార్చిన పార్లమెంట్‌లో మొత్తం డబ్బు ఎఫ్.ఆర్.బి.ఎం. నుంచి సమకూరుస్తామన్నారు. తరువాత రెండేళ్ళకని, నాలుగేళ్ళకని మార్చుకుంటు వచ్చారు. ఈ సంవత్సరం నుంచి కట్ చేస్తామన్నారు. గతంలో 2020-2021లో కార్పొరేషన్లో చేసిన అప్పులని మాఫీ చేస్తామని చెప్పారు. నాలుగు నెలల్లోనే నాలుగు సార్లు మాట మారుస్తారా? ఇలా మాట మారుస్తుంటే రాష్ట్రాలకు ఆర్థిక క్రమశిక్షణ ఉంటుందా?. మీ తీరు రాష్ట్రాలను హెచ్చరిస్తున్నట్టా, సహకరిస్తున్నట్టా? కేంద్రం రాష్ట్రాలను హెచ్చరించిందని ప్రచురించుకుంటున్నారు. హెచ్చరించే తీరు ఇదేనా?. అప్పులలో రాష్ట్రం 8వ స్థానంలో ఉందని వైసీపీ దినపత్రిక ప్రచురించింది? మార్చి గణాంకాలను బయట పెట్టుంటే ఎన్నో స్థానం అనేది తెలిసేది. దొంగ లెక్కలను సమర్పించి స్థానాలను తక్కువగా చూపించి చెప్పుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది. మరో శ్రీలంకలా మారే పరిస్థితులు వస్తున్నాయని కేంద్రం అంటూనే మరోపక్క మాట మార్చి మాట్లాడుతున్నారు. వారి చెప్పిన మాటలకు వారే కట్టుబడి ఉండరు అనేది అర్థమవుతుంది. రూ.8 లక్షల 50వేల కోట్ల అప్పులు ఉంటే రూ.లక్షా 70వేల రూపాయల తలసరి అప్పు ప్రతి మనిషి మీద పడుతుంది. అందుకే మేం పదే పదే రాష్ట్రం శ్రీలంకని మించిపోయింది అని హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడ ఈ విధంగా సహకరిస్తుంటే రాష్ట్రం విచ్చలవిడిగా అప్పులు చేయదా? రాష్ట్రం అప్పులలో కూరుకుపోతే ఆర్టికల్ 360 పెట్టి అందరి నోట్లో మట్టికొడతారు. అప్పుడు సంక్షేమ పథకాలు ఏమీ ఉండవు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వమే ఎఫ్.ఆర్.బి.ఎమ్. నిబంధనలు కింద రాసిన లేఖ ప్రకారం రూ.28 వేల కోట్ల రూపాయలు. కాని నాలుగు నెలల్లో మీరు అనుమతించిన అప్పు రూ.38వేల 190కోట్లు. అందులో రూ.8వేల 3వందల కోట్లకు రాజ్యాంగ(ఆర్టికల్ 266) ఉల్లంఘన జరిగింది. లిక్కర్ పై రూ.8వేల 3వందల కోట్లు ఎలా తెస్తారు? రాష్ట్రంలో ఉద్యోగులు దాచుకున్న డబ్బుని లిక్కర్ లో పెట్టుబడి ఎలా పెడతారు? కేంద్రం కూడ అంత వ్యవస్థని పెట్టుకొని కాపీ పేస్ట్ డేటాని ఇవ్వడం దురదృష్టకరమని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి పేర్కొన్నారు.