అమరావతి: అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకొని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పార్టీ ప్రముఖులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ… పవిత్ర భారతదేశంలో ఎందరో మహా పురుషులు జన్మించారు. ఈ భరతమాత మనకు అందించిన అరుదైన ఆణిముత్యం అల్లూరి సీతారామరాజు. మన్నెంలో పుట్టిన యోధుడు. బ్రిటీష్ వారి ఆగడాలను అరికట్టాలి, బ్రిటీష్ అధికారులను ధిక్కరించాలి భారత ప్రజలు స్వేచ్ఛా వాతావరణంలో జీవించాలి అనే ఆలోచన, తపనతో సాయుధ పోరాటం చేశారు. ఆధునిక ఆయుధాలు లేకపోయినప్పటికీ విల్లును ధరించి ఎంతో ధైర్యంగా ఈరోజు ఈ పోలీసు స్టేషన్ ను ముట్టడిస్తానని ఢంకా బజాయించి చెప్పిన ధీరోదాత్తుడు. ఏ నాయకుడిలోనూ ఇంత ధైర్యం చూడలేదు. భరతమాత సంకెళ్లను తొలగించి ప్రజలకు అండగా నిలబడ్డాడు. బ్రిటీష్ వారి దుర్మార్గాల వల్ల చనిపోయాడు. ఆయన చనిపోయినప్పటికీ ఆయన ఆశయాలు చావలేదు. తదుపరి సువిశాల భారతదేశానికి స్వాంతంత్య్రం రావడానికి అంకురార్పణ చేశారు. స్వాతంత్య్రం రావడానికి మూలకారకుడయ్యాడు. దేశంలోని 136 కోట్ల మందికి స్వాతంత్య్రం వచ్చిందంటే అప్పట్లో పోరాడినవారిలో అల్లూరి సీతారామరాజుకే దక్కుతుంది. ఈయన 125వ జయంతి ఉత్సవాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా జరుపుకోవడం సంతోషం. ఆయన ఆశయాలకు అనుగుణంగా యువత పనిచేయాలని రఘునాథ రెడ్డి కోరారు.
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ
పరాయివాళ్లకు భారతదేశాన్నిపరిపాలించే హక్కు లేదన్నవారిలో మొదటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు యుక్త వయసులోనే ప్రాణత్యాగం చేశారు. అల్లూరి సీతారామరాజుతోపాటు కొన్ని వేల మంది నిస్వార్థంగా వారి జీవితాలను, వారిఆస్తులను పణంగా పెట్టడంవలనే ఈ రోజు స్వేచ్ఛా జీవితం అనుభవిస్తున్నాం. ఈ తరానికి వీరు చేసిన మేలు మరవకూడదు. వారు స్ఫూర్తి ప్రధాతలు. వారి ఆశయాలను ఆశలను బతికించాల్సిన బాధ్యత నేటితరం పై ఉంది. ఉద్యంలో ప్రాణ త్యాగాలు చేసివవారికి ఘన నివాళులు. అల్లూరి సీతారామరాజు ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం. ఆయన కీర్తిని నలుదిశలా చాటాలి. ఇందులో టీడీపీ ప్రధాన భూమిక వహిస్తుంది. ఆయన ఆశయాలకు అనుగుణంగా టీడీపీ నాయకులు నడచుకోవాలని అశోక్ బాబు కోరారు.
టీడీపీ నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ గురజాల మాల్యాద్రి మాట్లాడుతూ
దేశ స్వాతంత్య్రం కోసమే కాకుండా సామాన్యుల స్వాతంత్య్రం కోసం పోరాడిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు నేలలో ఆయనకు నిజమైన వారసులు టీడీపీనే. మన్యంను కేంద్రంగా చేసుకొని అల్లూరి సీతారామరాజు గెరిల్లా పోరాటం చేశారు. మనమంతా వీరి ఆశయాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బొద్దులూరు వెంకటేశ్వరరావు, మీడియా కోఆర్డినేటర్ దారపనెని నరేంద్రబాబు, టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్, ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్, ఆహ్వాన కమిటీ సభ్యుడు హసన్ భాష తదితరులు పాల్గొన్నారు.