రాజకీయస్వార్థంతోనే కోనసీమలో అగ్గి రగిల్చారు
తెలుగుమహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత
అమరావతి: కోనసీమ విధ్వంసం అంతా ముఖ్యమంత్రి కనుసన్నల్లో, ఆయన సహాయ, సహకారాలతోనే జరిగిందనడానికి మంత్రి విశ్వరూప్ కుమారుడి వ్యాఖ్యలే నిదర్శనమని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ… అధికారదాహానికి సొంతపార్టీ వారిని బలి తీసుకోవడానికి కూడా జగన్ వెనుకాడటంలేదన్నారు. మంత్రికొడుకు కృష్ణారెడ్డి వైసీపీ ఎంపీటీసీని దుర్భాషలాడుతూ బెదిరిస్తున్నాడంటే కోనసీమ అల్లర్లవెనక ఎవరున్నారో తెలియడంలేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రం ఏమైనా, ప్రజలు ఎలాపోయినా తన అధికారదాహానికి వారిని బలిచేస్తూ శవాల కుప్పలపైనే తన పీఠం ఉండాలన్న దుర్మార్గపు ఆలోచనతో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడని అన్నారు. దానిలో భాగంగానే పచ్చనికోనసీమ ప్రాంతాన్ని పాకిస్తాన్ లా మార్చాడని, దళితుల ఓట్లు కొల్లగొట్టడానికి సొంతపార్టీవారి ఇళ్లనే తగలబెట్టించి తనకుట్రలను టీడీపీ, జనసేనలపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. వంగలపూడి అనిత ఏమన్నారో ఆమె మాటల్లోనే…!
2019 వరకు నవ్యాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ గా పిలవబడిన రాష్ట్రం, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రావణకాష్టంగా మారింది. రాష్ట్రం ఏమైనా ప్రజలు ఎక్కడపోయినా ప్రభుత్వానికి పట్టడంలేదు. కోనసీమను చూస్తుంటే పాకిస్థాన్ గుర్తుకొస్తోంది. జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనకు కోనసీమప్రాంతం మచ్చుతునకగా నిలిచింది. అధికార దాహాంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైళ్లు తగలబెట్టించారు. కేంద్రప్రభుత్వ ఆస్తులు ధ్వంసంచేసి వారిపై పెట్టే కేసులు చాలా కఠినంగా ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తునిఘటనలో తనపార్టీవారిపై నమోదైన కేసులన్నీ రద్దుచేశాడు. ఈ ఒక్క ఉదంతం చాలు ఆనాటి ఘటనలో ఎవరు సూత్రధారులో, పాత్రధారులో చెప్పడానికి. కాపు ఉద్యమం ముసుగులో ఆనాడు కుల రాజకీయాలపై పునాదులు కట్టే, జగన్ రెడ్డి నేడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాడు. అలానే బాబాయ్ హత్యతో శవరాజకీయం చేసి దాంతో ముఖ్యమంత్రి స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాంటి అరాచకం చేసినా.. చేయించినా జగన్మోహన్ రెడ్డి తొలినుంచీ దళితులే లక్ష్యంగా తనకుట్రలు అమలు చేస్తున్నాడు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తనవద్ద డ్రైవర్ గాపనిచేసిన వ్యక్తిని చంపి, శవాన్ని ఇంటికి తీసుకెళితే టీవీ చర్చల్లో వైసీపీవారు అతన్ని సమర్థిస్తూ సిగ్గులేకుండా గౌరవంగా మృతదేహాన్ని తీసుకెళ్లాడని చెప్పుకుంటున్నారు.
కోనసీమను అంబేద్కర్ జిల్లాగా ప్రకటించాలని అనుకుంటే ఆపని ఈ ప్రభుత్వం ముందే ఎందుకు చేయలేదు? జిల్లాల ప్రకటన వచ్చిన తొలినాళ్లలోనే ఆపేరు పెడితే కోనసీమ తగలబడేదికాదు కదా? ఓటుబ్యాంకు కోసం మళ్లీ అధికారంలోకి రావడానికే వైసీపీప్రభుత్వం జిల్లా పేరుమార్చి సొంతపార్టీ వారి ఇళ్లు తగలబెట్టించింది. కోనసీమలో జరిగిన విధ్వంసం అంతా జనసేన,టీడీపీవారే చేశారని హోంమంత్రి అంటున్నారు. 65మందిని పోలీసులు అరెస్ట్ చేస్తే వారిలో 45మంది వైసీపీవారే ఉన్నారు. మంత్రి విశ్వరూప్ కొడుకు బెదిరింపుల ఆడియోనిబట్టి కోనసీమ విధ్వంసం అంతా ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జరిగిందని స్పష్టమవుతోంది.
మంత్రి విశ్వరూప్ కొడుకు కృష్ణారెడ్డి, వైసీపీ ఎంపీటీసీని బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. మంత్రిగారి అబ్బాయి, వైసీపీ ఎంపీటీసీని దుర్భాషలాడుతూ బెదిరిస్తున్నాడంటే కోనసీమ అల్లర్లవెనక ఎవరున్నారో తెలియడంలేదా? దళితుల ఓట్లకోసం జగన్మోహన్ రెడ్డి ఎన్నికుట్రలు చేసినా ఆయన ఆశనెరవేరదు. కోనసీమ విధ్వంసం అంతా జగన్మోహన్ రెడ్డి సహాయసహాకారాలతోజరిగిందే. సకలశాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ అంశాన్ని టీడీపీ, జనసేనలపై రుద్దడానికి చేయాల్సిందంతా చేశారు. టీడీపీవారు అల్లర్లు సృష్టించి విధ్వంసం చేయిస్తే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? ప్రభుత్వం ఊరుకుంటుందా? సొంతపార్టీ ఎమ్మెల్సీని కాపాడుకోవడానికి, మంత్రి ఇంటిని తగలబెట్టిన వారు రేపు అధికారంకోసం ప్రజల్ని తగలబెట్టరా? టీడీపీ వారిని రెచ్చగొట్టడానికే సజ్జల రామకృష్ణారెడ్డి కుటిల రాజకీయాలు చేస్తుంటారు.
రాష్ట్రంలో జరిగే అత్యాచారాలపై హోం మంత్రిచేసిన వ్యాఖ్యలు చాలాచాలా దురదృష్టకరం. గతంలో రోజా అసెంబ్లీలో మాట్లాడుతూ “ఏంచేస్తారు.. మహా అయితే రేప్ చేస్తారు” అన్నది. అత్యాచారాన్ని కూడా అంతతేలిగ్గా తీసుకునే మనస్తత్వం వారికే ఉంది. ఆత్మాభిమానంతో బతికే ఆడబిడ్డ ఎవరైనా అత్యాచారం అనే మాటవినడానికే సిగ్గుపడుతుంది. అత్యాచారాలను తేలిగ్గా తీసుకునేవారు ఆడబిడ్డల మానప్రాణాలు కాపాడతారా? అత్యాచారాలపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ నానాయాగీ చేశారంటాడు. హోంమంత్రేమో తల్లులపెంపకమే కారణమంటుంది. రోజా ఏమో అలా మాట్లాడుతుంది. వాళ్లు అసలు మనుషులేనా అనే సందేహం ప్రజలందరికీ ఉందని అనిత పేర్కొన్నారు.