పండుగలా మహానాడు నిర్వహించాలన్న టీడీపీ అధినేత
అమరావతి (చైతన్య రథం): మహానాడు-2026ను స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. 20 తీర్మానాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. గురువారం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం వర్చువల్‌గా జరిగింది. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా వర్చువల్‌గా జరిగిన పొలిట్ బ్యూరో భేటీలో సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం చంద్రబాబు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పాల్గొన్నారు. వేర్వేరు ప్రదేశాల నుంచి మిగిలిన పొలిట్ బ్యూరో సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. సుమారు రెండున్నర గంటలపాటు సాగిన సమావేశంలో మహానాడు నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. ఏయే తీర్మానాలు ప్రవేశపెట్టాలి… తీర్మానాల్లో సారాంశం ఏవిధంగా ఉండాలి వంటి అంశాలపై సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు.
ఈ నెల 27, 28వ తేదీల్లో జరగనున్న మహానాడులో మొత్తంగా 20 తీర్మానాలను ప్రవేశపెట్టాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయించారు. వీటిల్లో 10 ఏపీ, 4 తెలంగాణ, 1 అండమాన్‌కు సంబంధించి తీర్మానాలున్నాయి. వీటితోపాటు మరో 4 ఉమ్మడి తీర్మానాలతో పాటు… అంతిమంగా కీలక రాజకీయ తీర్మానం చేపట్టాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది. ఇక 2026 మహానాడును స్త్రీశక్తి థీమ్‌తో నిర్వహించాలని నిర్ణయించడంతో… దాన్ని ప్రతిఫలించేలా మహానాడు ఉండాలని.. అలాగే ప్రసంగాలుండాలని సీఎం ఆదేశించారు. పార్టీ ఆవిర్భావం నుంచి మహిళలకు, మహిళా సాధికారతకు, వారికి హక్కులు కల్పించే విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే అంశాన్ని వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతీ పథకంలోనూ మహిళలను భాగస్వాములను చేసేలా చర్యలు తీసుకుంటున్నామనే విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. వీటితోపాటు ప్రభుత్వం అమలు చేసే పథకాలు, చేపడుతోన్న కార్యక్రమాలు, చేస్తున్న అభివృద్ధి, వస్తున్న పెట్టుబడులు వంటి వాటిపై కూలంకషంగా చర్చించాలని సీఎం ఆదేశించారు. మహానాడులో జరిగిన చర్చతో రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై మరోసారి చర్చ జరగాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
ఇక మన దేశం-మన బాధ్యత పేరుతో పొదుపు చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రత్యేకంగా చర్చ జరపాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అరాచకాలను, కుట్రలను బహిర్గతం చేయడంతో పాటు ప్రజల్లో అవగాహన పెంచేలా ఉండాలని పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది. ఇక తెలుగుదేశం చరిత్ర, ఎన్టీఆర్ సిద్ధాంతాలపై నేటి తరానికి తెలిసేలా మహానాడులో ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు. హైబ్రిడ్ పద్ధతుల్లో ఈసారి మహానాడు జరుగుతున్నా… మహానాడు స్ఫూర్తి మాత్రం కొనసాగాలని సీఎం సూచించారు. మహానాడు కార్యక్రమాన్ని పండుగలా చేపట్టాలని పొలిట్ బ్యూరో సమావేశంలో సీఎం చంద్రబాబు సూచించారు. రెండు రోజుల ముందు నుంచి ప్రతి ఇంటిపై టీడీపీ జెండా ఎగరేయాలన్నారు. పార్టీ అగ్రనాయకత్వం మొదలుకుని క్షేత్ర స్థాయి కార్యకర్త వరకు మహానాడులో భాగస్వాములను చేసేలా నిర్వహించాలని టీడీపీ అధినేత ఆదేశించారు. ఇక అన్ని క్లస్టర్లలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టి మహానాడును ప్రారంభించాలని పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు













