అమరావతి(చైతన్యరథం): ప్రజా సమస్యల పరిష్కారానికి నూతన ప్రభుత్వం కృషిచేస్తోంది. గత ఐదేళ్లు ఎలాంటి భరోసా లభించక సామాన్యులు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక సతమతమయ్యారు. అలాంటి వారికి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ‘‘ప్రజాదర్బార్’’ భరోసా ఇస్తోంది. మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఉండవల్లి నివాసంలో యువనేతను నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవిస్తున్నారు. సోమవారం కూడా ప్రజాదర్బార్‌కు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తి స్వీకరించిన యువనేత.. పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
న్యాయం కోసం రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబం
రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ అయిన తన భర్తను ఆస్తి కోసం వారి అన్నదమ్ములు క్రూరంగా హత్య చేశారని, తగిన న్యాయం చేయాలని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఇంటి పుష్పావతి, ఆమె కుమారుడు సురేష్ మంత్రి.. లోకేష్‌ను కలిసి కన్నీటిపర్యంతమయ్యారు. 2013లో ఇంటి రామలింగం హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి నుంచి స్వగ్రామంలోనే నివసిస్తున్నారు. రామలింగానికి చెందిన రెండెకరాల పొలాన్ని గత ప్రభుత్వ అండతో ఆయన సోదరులు కబ్జా చేశారు. దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో పథకం ప్రకారం ఆయన్ను హత్య చేశారు. వారి 11 ఆవులను చంపడంతో పాటు కొబ్బరిచెట్లు నరికివేసి భయభ్రాంతులకు గురిచేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పాలకొల్లు గ్రామీణ సీఐ, ఎస్సై నిందితులతో కుమ్మక్కై కేసును నీరుగార్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసును రీ ఓపెన్ చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. సదరు విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి లోకేష్.. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
సొంతింటి కల నెరవేర్చాలి
గత ప్రభుత్వం తొలగించిన రేషన్ కార్డు, దివ్యాంగ పెన్షన్ పునరుద్ధరించాలని మంగళగిరి నియోజకవర్గం సీతానగరానికి చెందిన ధనుకొండ గిరిధర్ సాగర్ లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న తనకు సొంత ఇల్లు లేదని, ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన ఉద్దంటి వీరాంజనేయులు కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తె కు దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని చింతలపూడికి చెందిన తిరుమలశెట్టి శివనాగేశ్వరమ్మ విజ్ఞప్తి చేశారు. ఇంజనీరింగ్ చదివిన తనకు ఉద్యోగం కల్పించాలని తాడేపల్లికి చెందిన చైతన్య సాయి కోరారు. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని, ప్రజా ప్రభుత్వంలో వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన వెనిగళ్ల కృష్ణప్రసాద్ విజ్ఞప్తి చేశారు.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, వైద్య ఖర్చుల కోసం కోసం అప్పులపాలమయ్యామని, ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని మంగళగిరి ఆంజనేయకాలనీకి చెందిన వి.రామలింగ సాయి కోరారు. మంగళగిరి 27వ వార్డులోని చర్చి, ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని బండారు క్రిష్టాఫర్ కోరారు. శృంగారపురం మీదుగా రేవేంద్రపాడు నుంచి పెదపాలెం వరకు ఉన్న ఆర్ అండ్ బీ సీసీ రోడ్డుకు మరమ్మతులు చేయాలని గ్రామస్థులు కోరారు. గత ప్రభుత్వం డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష తప్పుల తడకగా ఉండటంతో తీవ్రంగా నష్టపోయామని, తగిన న్యాయం చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు యువనేతను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని అంబేద్కర్ స్టడీ సర్కిల్ లో నిర్వహిస్తున్న గ్రూప్-2 మెయిన్స్ శిక్షణా తరగతులను మరో మూడు నెలలు పొడిగించాలని విద్యార్థులు కోరారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు.