కడప: అటెండెన్స్ తదితర నిబంధనల సాకుతో 52,463 మంది తల్లులకు అమ్మఒడి డబ్బులు ఎగ్గొట్టిన జగన్ రెడ్డి… తన అవినీతి కేసుల విషయంలో కోర్టుకు అటెండ్ కాకుండా ఎందుకు కాకమ్మ కబుర్లు చెబుతున్నారని కడప జల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి వికాస్ హరికృష్ణ నిలదీశారు. అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలను నేడు తుంగలో తొక్కి ప్రజలను మోసం చేస్తున్న వైఎస్ జగన్ రెడ్డి…ఇప్పుడు ‘జగన్ మోసం రెడ్డిగా’ మారారన్నారు. అమ్మ ఒడి అంటూ ఇచ్చిన డబ్బులను నాన్న బుడ్డీతో లాగేస్తున్నారన్నారు. ఒక్క విద్యార్థికి నెలకు రూ.750 చొప్పున కుటుంబంలో ఇద్దరు పిల్లలకు రూ.18 వేలు ఇస్తానని జులై 08, 2017న గుంటూరు వైసీపీ ప్లీనరీలో జగన్ రెడ్డి చేసిన ప్రకటన మర్చిపోయారా అని నిలదీశారు.
2019 ఎన్నికల ప్రచారంల జగన్ రెడ్డి భార్య భారతీ రెడ్డి ఇంటింటికీ వెళ్లి ఇద్దరు పిల్లలుంటే రూ.30 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కోత పెట్టిన అమ్మ ఒడి డబ్బుల్లో కనీసం ఒక్క రూపాయి కూడా ప్రైవేటు పాఠశాలలకు ఎందుకు ఇవ్వలేదన్నారు. విద్యార్థులకు 75 శాతం హాజరు నిబంధన పెట్టి కోత పెడుతున్న జగన్ రెడ్డి… ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కాకుండా కుంటిసాకులతో ఎగ్గొడుతున్నాడన్నారు. ఈ సమావేశంలో కడప జిల్లా కార్యదర్శి మాసా కోదండ రామ్, కడప జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సుధాకర్ యాదవ్, రాష్ట్ర నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ద్వారకనాథ్ సహా పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.