- క్రీడాకారుల కష్టాన్ని రాజకీయాలకు వాడొద్దు
- ‘ఫేక’ సర్టిఫికెట్ల ఆరోపణలు అవాస్తవం.. ఆధారాలతోనే మాట్లాడాలి
- క్రీడా ప్రతిభ, అర్హతల పరిశీలన తర్వాతే నియామకాలు
- అర్హతలపై అనుమానాలుంటే అధికారికంగా విచారణ చేయాలి
- డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల రౌండ్ టేబుల్ సమావేశం
విజయవాడ (చైతన్య రథం): మెగా డీఎస్సీ-2025లో స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు సంబంధించిన అంశాలపై జరుగుతున్న ప్రచారంపై వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. స్థానిక మొగల్రాజపురంలోని అమ్మ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మెగా డీఎస్సీ-2025కు సంబంధించి వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు, అభ్యర్థుల్లో నెలకొన్న సందేహాలు, స్పోర్ట్స్ కోటా ఎంపిక ప్రక్రియకు సంబంధించిన వాస్తవాలను ఈ సమావేశంలో అభ్యర్థులు వివరించారు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను రాజకీయ ఆరోపణలకు వేదికగా మార్చకుండా, వాస్తవాలను ఆధారాలతో ప్రజల ముందుంచాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశంలో పలువురు స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు, సంబంధిత రంగానికి చెందిన ప్రతినిధులు మాట్లాడారు. మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై తమ అభిప్రాయాలు, ఎదుర్కొన్న పరిస్థితులు, తమకు సంబంధించిన అంశాలపై స్పష్టతను వారు వెల్లడించనున్నారు.
క్రీడాకారుల కష్టాన్ని రాజకీయాలకు వాడొద్దు : పి. శివారెడ్డి
దేశం, రాష్ట్రం తరఫున ఎన్నో ఏళ్లుగా క్రీడల్లో కొనసాగుతూ సాధించిన విజయాలను, క్రీడాకారుల కష్టాన్ని రాజకీయ విమర్శలకు వాడుకోవడం సరికాదని పి. శివారెడ్డి అన్నారు. మన రాష్ట్రం తరఫున 40 జాతీయ ఖో-ఖో పోటీల్లో పాల్గొన్నానని, దేశం తరఫున జరిగిన ఖో-ఖో పోటీల్లో మూడు సార్లు స్వర్ణ పతకాలు సాధించానని తెలిపారు. కులమతాలకు అతీతంగా అందరినీ ఏకం చేసే క్రీడలను రాజకీయాలకు వేదికగా మార్చవద్దని శివారెడ్డి కోరారు. క్రీడాకారులు తమ జీవితాల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొని, దేశం, రాష్ట్రం కోసం చెమటోడ్చి సాధించిన విజయాలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. అలాంటి క్రీడాకారులను అవమానించేలా మాట్లాడటం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడాకారుల కష్టాన్ని గుర్తించి కూటమి ప్రభుత్వం మూడు శాతం రిజర్వేషన్ కల్పించడం చారిత్రక నిర్ణయమని శివారెడ్డి పేర్కొన్నారు. ఈ నిర్ణయం కేవలం తమకు మాత్రమే కాకుండా భవిష్యత్ తరాల క్రీడాకారులకు కూడా ఉపయోగపడేలా ఉండాలని ఆకాంక్షించారు. జీవితాలను క్రీడలకే అంకితం చేసిన వారికి ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడం సంతోషకరమైన విషయమన్నారు. ప్రభుత్వం తమ కష్టాన్ని గుర్తించి అవకాశం కల్పించిందన్న సంతోషం కూడా లేకుండా తమపై అసత్య ప్రచారాలు చేయడం బాధాకరంగా ఉందన్నారు. తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలతో తీవ్ర అవమానానికి గురవుతున్నామని, నిరాధార ఆరోపణల కారణంగా మానసిక క్షోభను అనుభవిస్తున్నామని తెలిపారు. క్రీడాకారుల కష్టాన్ని తేలిక చేసి మాట్లాడటం సరికాదని, వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని శివారెడ్డి కోరారు.
క్రీడల్లో కష్టపడ్డా.. ప్రభుత్వ ఉద్యోగమూ పొందా.. ఇప్పుడు ఫేక్ అంటారా? : గిడ్ల హర్ష చిన్ని
ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న ఇష్టంతోనే ఎనిమిదేళ్లుగా కానిస్టేబుల్‌గా పనిచేస్తూ వచ్చానని గిడ్ల హర్ష చిన్ని తెలిపారు. చిన్న వయస్సు నుంచే కష్టపడి వివిధ స్థాయిల్లో రాష్ట్రం తరఫున క్రీడా పోటీల్లో పాల్గొన్నానని చెప్పారు. తనకు గత ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని హర్ష చిన్ని తెలిపారు. ఇప్పుడు తన క్రీడా అర్హతలను ‘ఫేక’ అంటూ ఆరోపణలు చేస్తే.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నియామకం కూడా తప్పేనని భావించాలా? అని ప్రశ్నించారు. తన అర్హతలు ఫేక్ అని ఆరోపిస్తున్న వారు, గత ప్రభుత్వ హయాంలో తనకు ప్రభుత్వ ఉద్యోగం ఎలా వచ్చిందో కూడా చెప్పాలన్నారు. తాను చిన్న వయస్సు నుంచే క్రీడల్లో కష్టపడి వివిధ స్థాయిల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించానని తెలిపారు. క్రీడాకారుల అర్హతలు, వారి సాధనలను రాజకీయ ఆరోపణలకు ముడిపెట్టడం సరికాదని పేర్కొన్నారు. తమపై వస్తున్న ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలను ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కష్టపడి సాధించిన సర్టిఫికెట్లను ‘ఫేక’ అనడం సమంజసం కాదు : షైక్ యాసిన్
చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొని క్రీడల్లో రాణించి సాధించిన సర్టిఫికెట్లను ‘ఫేక’ అంటూ ప్రచారం చేయడం ఏమాత్రం సమంజసం కాదని షైక్ యాసిన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి జిమ్నాస్టిక్స్‌లో తొలిసారిగా ప్రాతినిధ్యం వహించానని తెలిపారు. తన తండ్రి దినసరి కూలీగా పనిచేసేవారని, ఆయన కష్టపడితేనే కుటుంబానికి పూట గడిచేదని యాసిన్ తెలిపారు. ఇంటికి దూరంగా ఉంటూ, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ తినితినక చదువుతో పాటు క్రీడలను సమతుల్యం చేసుకున్నానని చెప్పారు. ఎన్నో ఏళ్లపాటు కష్టపడి జాతీయ స్థాయిలో వివిధ పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించానని తెలిపారు. క్రీడల కోసం చేసిన త్యాగాలు, శ్రమను గుర్తించకుండా తమ సర్టిఫికెట్లను ఫేక్ అంటూ ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలతో తీవ్ర అవమానానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వమే గుర్తించిన సర్టిఫికెట్లను ‘ఫేక’ అనడం దుర్మార్గం : అట్ల శివనాగిరెడ్డి
ఆసియా ఖో-ఖో ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన క్రీడాకారుడినని, చిన్న వయసు నుంచే పసిడి పతకం కోసం ఎంతో శ్రమించానని అట్ల శివనాగిరెడ్డి తెలిపారు. తాను సాధించిన స్వర్ణ పతకం ఆధారంగానే ఇండియన్ రైల్వేస్‌లో ఉద్యోగం వచ్చిందని శివనాగిరెడ్డి చెప్పారు. అదే క్రీడా ప్రతిభతో ఆదాయ పన్ను శాఖ, తపాలా శాఖల్లోనూ ఉద్యోగ అవకాశాలు లభించాయని తెలిపారు. తన క్రీడా ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మూడు శాఖల్లో ఉద్యోగాలకు తనను ఎంపిక చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వమే గుర్తించి ఉద్యోగ అవకాశాలు కల్పించిన తన క్రీడా సర్టిఫికెట్లను ఇప్పుడు ‘ఫేక’ అంటూ ఆరోపించడం దుర్మార్గమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లపాటు కష్టపడి, రక్తం ధారపోసి పతకాలు సాధించిన నిజమైన క్రీడాకారులను అవమానిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. క్రీడాకారుల శ్రమ, ప్రతిభను గౌరవించాలని కోరారు.
నా సర్టిఫికెట్లు ఫేక్ అయితే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా వచ్చాయి? : ఎం. జగదీష్
చిన్ననాటి నుంచే జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు సాధించానని ఎం. జగదీష్ తెలిపారు. తన క్రీడా ప్రతిభ ఆధారంగా తపాలా శాఖలో ఐదుసార్లు ఉద్యోగానికి ఎంపికయ్యానని చెప్పారు. తన క్రీడా ధ్రువపత్రాలు ఫేక్ అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు తాను ఎలా ఎంపికయ్యానో చెప్పాలని జగదీష్ ప్రశ్నించారు. ఇప్పటివరకు 32 సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నానని, తనలాంటి మరో పది మంది క్రీడాకారులను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్‌బాల్ జట్టుకు ఐదుసార్లు కెప్టెన్‌గా వ్యవహరించిన తనను ఫేక్ అంటూ ఆరోపించడం దుర్మార్గమన్నారు. తన క్రీడా ధ్రువపత్రాల ఆధారంగానే 2018-19లో జాతీయ క్రీడా సంస్థ డిప్లొమాలో సీటు లభించిందని జగదీష్ తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై నిరాధార ఆరోపణలు చేస్తూ బురదజల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో ఉన్నవారు ఏదైనా మాట్లాడే ముందు వాస్తవాలను తెలుసుకుంటే మంచిదని సూచించారు.
25 ఏళ్ల కష్టానికి 3 శాతం రిజర్వేషన్‌తో ఉద్యోగ అవకాశం : శ్వేతా
2005లో తొలిసారిగా మహిళల ఆసియా కబడ్డీ ఛాంపియన్‌షిప్ గెలిచిన ఆంధ్రప్రదేశ్ జట్టులో తాను సభ్యురాలినని శ్వేతా తెలిపారు. ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి తనకు 25 ఏళ్లు పట్టిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన మూడు శాతం క్రీడా రిజర్వేషన్ వల్లే తనకు ఉద్యోగం పొందే అవకాశం దక్కిందని శ్వేతా తెలిపారు. ఎన్నో ఏళ్లుగా కష్టపడిన తమలాంటి నిజమైన క్రీడాకారులను ‘ఫేక’ అంటూ ఆరోపించడం ఏమాత్రం న్యాయం కాదన్నారు. కబడ్డీ సమాఖ్య నుంచి అధికారిక ధ్రువీకరణ పత్రం పొందిన తర్వాతే తనను ఎంపిక చేశారని తెలిపారు. సమాఖ్య నుంచి వచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఉద్యోగానికి ఎంపిక చేశారంటే.. మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ ఎంతటి పరిశీలనతో, పారదర్శకంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చని శ్వేతా పేర్కొన్నారు. క్రీడాకారుల అర్హతలను, వారి సంవత్సరాల కష్టాన్ని గౌరవించాలని కోరారు.
నా కంటే తక్కువ స్థాయి పోటీల్లో ఆడిన తమ్ముడి సర్టిఫికెట్ నాకెందుకు? : పెద్ద అప్పలరాజు
బాక్సింగ్‌లో తాను సాధించిన పతకాలతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సుపరిచితుడినని పెద్ద అప్పలరాజు తెలిపారు. తనపై చేస్తున్న అసత్య ప్రచారాలతో రాష్ట్రవ్యాప్తంగా పరువు తీసే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వేరొకరి క్రీడా ధ్రువపత్రాన్ని సమర్పించి ఉద్యోగం పొందానంటూ తనపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అప్పలరాజు ఆరోపించారు. తాను అసలైన బాక్సింగ్ క్రీడాకారుడినని నిరూపించుకుంటున్నప్పటికీ పదేపదే కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. చిన్ననాటి నుంచి చెమటోడ్చి క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించిన తమకు నకిలీ ధ్రువపత్రాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తన కంటే చిన్న స్థాయి పోటీల్లో పాల్గొన్న తన తమ్ముడి ధ్రువపత్రంతో తాను ఉద్యోగం పొందాల్సిన అవసరం ఏముంటుందని నిలదీశారు. తమ క్రీడా జీవితాన్ని ఇలా మీడియా వేదికలపైకి వచ్చి నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడం అత్యంత బాధాకరమని అప్పలరాజు అన్నారు. తమకు ఆటలు మాత్రమే తెలుసని, రాజకీయాలు తెలియవని పేర్కొన్నారు. క్రీడాకారులపై ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని కోరారు.
అవమానాలను అధిగమించి.. దేశ గౌరవాన్ని పెంచాను : బలగ గణేష్
ఆర్థిక పరిస్థితులు సరిగా లేక 1999లో కూలీ పనుల కోసం విజయవాడకు వలస వచ్చిన నిరుపేద కుటుంబం తమదని పారా స్విమ్మర్ బలగ గణేష్ తెలిపారు. 2006 నుంచి ఈతనే తన జీవితంగా భావించి కష్టపడుతున్నానని చెప్పారు. 2025లో భారత్ నుంచి శ్రీలంక వరకు ఈది దేశంలోనే ‘ఫాస్టెస్ట్ పారా స్విమ్మర’గా రికార్డు నెలకొల్పానని గణేష్ తెలిపారు. అత్యంత శీతల వాతావరణంలో ఇంగ్లండ్ నుంచి ఫ్రాన్స్ వరకు ఇంగ్లీష్ ఛానల్‌ను విజయవంతంగా ఈదినట్లు చెప్పారు. దేశంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికైన తొలి పారా స్విమ్మర్‌గా నిలిచానన్నారు. మూడు సార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించానని తెలిపారు. గతంలో ‘కుంటివాడివి.. నీకు ఆటలు ఎందుకు?’ అంటూ ఎన్నో అవమానాలు, ఈసడింపులు ఎదుర్కొన్నానని గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వాటన్నింటినీ అధిగమించి అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి దేశ గౌరవాన్ని పెంచానన్నారు. ఇన్ని విజయాలు సాధించిన తనలాంటి పారా క్రీడాకారుడిని అవమానించేలా మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు. పారా క్రీడాకారుల కష్టాన్ని గుర్తించి కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ అండగా నిలిచిందని గణేష్ తెలిపారు. తన కష్టకాలంలో అండగా నిలిచి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. క్రీడాకారుల విజయాల వెనుక ఉన్న కష్టం, త్యాగాలను గుర్తించాలని కోరారు.
ఒకే కుటుంబంలో ఇద్దరు క్రీడాకారులైతే తప్పేంటి? : చిల్లా మోహినీ దేవి
అత్యంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తాను పట్టువదలకుండా మూడుసార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించానని చిల్లా మోహినీ దేవి తెలిపారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని క్రీడల్లోనూ, చదువులోనూ ముందుకు సాగామని చెప్పారు. అన్నాచెల్లెళ్లు కలిసి ఒకే క్రీడను ఆడకూడదా? కలిసి చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగకూడదా? అని మోహినీ దేవి ప్రశ్నించారు. తాము తోబుట్టువులుగా కష్టపడి దేశానికి, రాష్ట్రానికి పతకాలు సాధించకూడదని ఏ రాజ్యాంగంలో రాశారని నిలదీశారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ప్రతిభ కనబరిస్తే అభినందించాల్సింది పోయి అనుమానించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకోకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తమపై నిరాధార విమర్శలు చేస్తున్నారని మోహినీ దేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా క్రీడాకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ఆ హక్కు ఏమిటని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి తాము పడిన కష్టం, తమ కుటుంబాలు చేసిన త్యాగాలను వేలెత్తి చూపించే నైతిక హక్కు ఎవరికీ లేదన్నారు. రక్తం ధారపోసి సాధించిన విజయాలను రాజకీయాలకు ముడిపెట్టి తమ జీవితాలతో ఆడుకోవద్దని మోహినీ దేవి కోరారు.
ఒకే కుటుంబంలో ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు రాకూడదని ఎక్కడైనా నిబంధన ఉందా? : చిల్లా యోగేశ్వరరావు
ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రతిభతో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడంలో తప్పేముందని చిల్లా యోగేశ్వరరావు ప్రశ్నించారు. ఒకే కుటుంబంలో ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు రాకూడదని ఎక్కడైనా నిబంధన ఉందా? అని నిలదీశారు. పేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తాము ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని, రాత్రింబవళ్లు శ్రమించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించామని యోగేశ్వరరావు తెలిపారు. సొంతంగా కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన వారికే ఆ శ్రమ, త్యాగం విలువ తెలుస్తుందన్నారు. పత్రికలు, యూట్యూబ్ ఛానళ్లలో తమపై ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఉద్యోగం సాధించామన్న ఆనందాన్ని కూడా ఆస్వాదించకుండా నిత్యం తమపై బురదజల్లుతున్నారని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తున్న ఈ అసత్య ప్రచారాలకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని పేర్కొన్నారు. క్రీడాకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే పనిగా పెట్టుకున్న వారు ముందుగా వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని యోగేశ్వరరావు సూచించారు. ఒకే ఇంట్లో ఇద్దరు తమ ప్రతిభతో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైతే గర్వించాల్సింది పోయి, తమను క్షోభకు గురిచేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.
1994 నుంచి అహర్నిశలు శ్రమిస్తేనే ఆ స్వర్ణ పతకం సాధించాను : సత్యవాణి బలుసు
రాష్ట్రం తరఫున ఖో-ఖోలో స్వర్ణ పతకం సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిని తానేనని సత్యవాణి బలుసు తెలిపారు. 32వ జాతీయ క్రీడల్లో పాల్గొని ప్రతిభ చాటానని చెప్పారు. 1994 నుంచి అహర్నిశలు శ్రమించిన ఫలితంగానే తనకు స్వర్ణ పతకం దక్కిందని సత్యవాణి తెలిపారు. ఎన్నో ఏళ్ల నిరంతర శ్రమ, త్యాగాల ఫలితంగానే ఆ పతకాన్ని సాధించానన్నారు. తన క్రీడా జీవితంలో 30 సార్లు జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించానని చెప్పారు. ఆ రోజుల్లో క్రీడా పోటీలకు వెళ్లేందుకు రైళ్లలో సరైన సౌకర్యాలు కూడా ఉండేవి కావని, బాత్రూంల దగ్గరే పడుకుని ఎన్నో వ్యయప్రయాసలతో ప్రయాణించేవాళ్లమని సత్యవాణి గుర్తుచేశారు. క్రీడల్లో రాణించేందుకు ఎదురైన కష్టాలను వివరించారు. ‘ఆడపిల్లకు ఆటలు ఎందుకు?’ అంటూ సమాజం వేసిన ఎన్నో నిష్టూరాలు, ప్రశ్నలను తన తల్లిదండ్రులు తట్టుకుని తనను ప్రోత్సహించారని సత్యవాణి తెలిపారు. క్రీడాకారులు సాధించిన విజయాల వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ, కుటుంబ సభ్యుల త్యాగం ఉంటుందని చెప్పారు. ఆ త్యాగాల వెనుక ఉన్న అసలైన వాస్తవాలను తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని కోరారు.
కష్టపడి సాధించిన క్రీడా సర్టిఫికెట్లతోనే ఉద్యోగం వచ్చింది : మంగ
బాక్సింగ్‌ను చూసి స్ఫూర్తి పొంది, 2004 నుంచి వివిధ పోటీల్లో ఎంతో ఆసక్తితో పాల్గొంటూ వచ్చానని మంగ తెలిపారు. గెలుపు వచ్చినా, ఓటమి ఎదురైనా వెనుకడుగు వేయకుండా క్రీడల్లో కొనసాగానని చెప్పారు. చుట్టుపక్కల వారు ‘ఆడపిల్లకు బాక్సింగ్ ఎందుకు?’ అంటూ ప్రశ్నించేవారని, అయినప్పటికీ మనోధైర్యంతో ముందుకు సాగానని మంగ తెలిపారు. ఎన్నో ఏళ్లపాటు కష్టపడి సాధించిన క్రీడా సర్టిఫికెట్ల ఆధారంగా కూటమి ప్రభుత్వం తనకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించి కొత్త జీవితాన్ని అందించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు తాను ఎంతో కష్టపడ్డానని మంగ తెలిపారు. గతంలో ప్రతిపక్ష నాయకులు డీఎస్సీ నిర్వహిస్తామని హామీలు ఇచ్చి మాటలకే పరిమితమయ్యారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో పాటు దానిని అమలు చేసి చూపించిందని అన్నారు. క్రీడాకారులపై వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలను ఇకనైనా మానుకోవాలని మంగ కోరారు. క్రీడాకారులు ఎన్నో ఏళ్లుగా పడిన కష్టాన్ని, సాధించిన విజయాలను గౌరవించాలని సూచించారు.
జగన్ ప్రభుత్వమే ఇచ్చిన సర్టిఫికెట్‌ను ఇప్పుడు ‘ఫేక’ అంటారా? : మాల్యాద్రి
తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అని, అలాంటి పరిస్థితుల్లో తాను డబ్బులు ఇచ్చి ఉద్యోగం కొనుగోలు చేస్తే అది తన తండ్రి ఉద్యోగానికే మచ్చ తెచ్చినట్లవుతుందని మాల్యాద్రి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే అంగట్లో దొరికే వస్తువు కాదని, ఎవరు పడితే వారు డబ్బులు ఇచ్చి కొనుక్కుని వెళ్లేందుకు అవకాశం ఉండదని వ్యాఖ్యానించారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే తాను ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసి 105 మార్కులు సాధించానని మాల్యాద్రి తెలిపారు. అయినప్పటికీ తాను ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా ఉద్యోగం కొనుగోలు చేశానంటూ ప్రచారం చేయడం వాస్తవాలకు విరుద్ధమన్నారు. తనకు సంబంధించిన ధ్రువపత్రాలన్నింటినీ పరిశీలించిన తర్వాతే నియామక ప్రక్రియ జరిగిందని తెలిపారు. అయినప్పటికీ స్పష్టత లేకుండా పదేపదే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాల్ బ్యాడ్మింటన్‌లో తాను పాల్గొన్న పోటీలకు సంబంధించిన ధ్రువపత్రాన్ని 2022లో అప్పటి జగన్‌రెడ్డి ప్రభుత్వమే జారీ చేసిందని మాల్యాద్రి తెలిపారు. అప్పటి ప్రభుత్వమే జారీ చేసిన ధ్రువపత్రాలను ఇప్పుడు ‘ఫేక’ అంటూ ఆరోపించడం ఎంతవరకు సమంజసమో ఆరోపణలు చేస్తున్నవారే ఆలోచించుకోవాలని అన్నారు.
అర్హతలపై అధికారికంగా విచారణ చేయండి.. అసత్య ప్రచారాలు వద్దు : గాయత్రి
తన స్పోర్ట్స్ కోటా నియామకంపై తప్పుడు ప్రచారం చేస్తే ఇంతగా బాధపడేదాన్ని కాదని, అయితే తాను బీఈడీ, ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో అర్హత సాధించలేదంటూ ప్రచారం చేయడం బాధాకరంగా ఉందని గాయత్రి అన్నారు. తన ధ్రువపత్రాలన్నింటినీ విజయవాడ బెంజిసర్కిల్ వద్ద పరిశీలన చేయించుకున్న తర్వాతే కళాశాలలో చేరి, ప్రతిరోజూ కళాశాలకు వెళ్లి చదువుకున్నానని గాయత్రి తెలిపారు. కళాశాలకు వెళ్లకుండా పరీక్షలు రాసి పొందిన చదువులు తనవి కావని స్పష్టం చేశారు. తాను రాసిన ప్రతి పరీక్షలోనూ ప్రథమ శ్రేణి మార్కులతో ఉత్తీర్ణత సాధించానని చెప్పారు. 2018లో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలో కేవలం 0.4 మార్కుల తేడాతో అర్హత సాధించలేకపోయానని గాయత్రి తెలిపారు. అయినప్పటికీ తన విద్యార్హతలు, క్రీడా అర్హతలపై నిరాధార ప్రచారం చేయడం సరికాదన్నారు. తాను సాధించిన ప్రభుత్వ ఉద్యోగం తన ఆత్మగౌరవానికి, తన తల్లిదండ్రుల గౌరవానికి సంబంధించిన అంశమని గాయత్రి పేర్కొన్నారు. తనను ‘ఫేక’ అంటూ ప్రచారం చేస్తున్న వారు అధికారికంగా విచారణ చేసే సంబంధిత అధికారుల వద్దకు వచ్చి తమ ఆరోపణలను నిరూపించుకోవచ్చని అన్నారు. అయితే ఎవరు పడితే వారు ఫోన్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడటం, తనను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేయడం మాత్రం సహించబోనని గాయత్రి స్పష్టం చేశారు. ఆరోపణలు ఉంటే అధికారిక మార్గంలో ఆధారాలతో ముందుకు రావాలని సూచించారు.
స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలపై దుష్ప్రచారం మానుకోవాలి : రవికుమార్
ఉపాధ్యాయ అర్హత పరీక్ష లేకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రవికుమార్ తెలిపారు. ఉపాధ్యాయ ఉద్యోగానికి అవసరమైన అర్హతలు లేకుండా ఉద్యోగాలు పొందడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. 2018 నుంచి వివిధ ప్రభుత్వ శాఖల్లో క్రీడా కోటా నియామకాలు జరుగుతున్నాయని రవికుమార్ తెలిపారు. గతంలోనూ ఇదే విధానంలో నియామకాలు జరిగాయని, ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ప్రకారం అప్పట్లోనూ నియామకాలు అక్రమంగానే జరిగాయా? అని ప్రశ్నించారు. తాము కుటుంబాలకు దూరంగా ఉంటూ ఎన్నో కష్టాలు పడి చదువుకుని అర్హతలు సాధించామని రవికుమార్ చెప్పారు. తమ విజయాల వెనుక కుటుంబ సభ్యుల సహకారం, ప్రోత్సాహం కూడా ఉందన్నారు. ఎన్నో ఏళ్ల శ్రమ తర్వాత ఉద్యోగం సాధించామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన మెగా డీఎస్సీ-2025లో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోలేదని రవికుమార్ తెలిపారు. నియామక ప్రక్రియపై ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని కోరారు. రాజకీయ లబ్ధి కోసం క్రీడాకారులపై బురదజల్లే కార్యక్రమాలను వైసీపీ నాయకులు ఇకనైనా మానుకోవాలని రవికుమార్ సూచించారు.













