20ఏళ్లలో ఎన్నడూలేని దారుణ ఫలితాలు
అమ్మఒడి, సంక్షేమ పథకాలకు కోతపెట్టే కుట్ర
దిగజారిన ఫలితాలు సర్కారు కుతంత్రమే
నాడు-నేడుతో దోపిడీ తప్ప సాధించింది ఏమిటి?
అమరావతి: తాజాగా విడుదలైన టెన్త్ ఫలితాల్లో విద్యార్థులు ఫెయిల్ కాలేదని, జగన్ రెడ్డి ప్రభుత్వం విద్యావ్యవస్థని భ్రష్టుపట్టించి పరీక్షల నిర్వహణలో ఫెయిల్ అయ్యిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. టెన్త్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో 71 స్కూళ్లలో ఒక్కరూ ఉత్తీర్ణులు కాకపోవడం, 20 ఏళ్లలో అతి తక్కువగా 67.26 శాతం ఉత్తీర్ణత నమోదు కావడం చేతగాని ప్రభుత్వ తీరుకు నిదర్శనమని అన్నారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌రెడ్డి తాను పదో తరగతి కష్టపడి చదివి పాసై ఉంటే విద్యార్థుల కష్టాలు తెలిసేవని ఎద్దేవా చేశారు. పరీక్షలు నిర్వహించడం దగ్గరనుంచి ఫలితాలు ప్రకటించేవరకు అంతా అస్తవ్యస్తం, గందరగోళమేనన్నారు. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుల్ని నాడు-నేడు పనులకి కాపలా పెట్టడంతో వారు పిల్లలకి చదువు చెప్పడం మానేసి ఈ పనుల్లో నిమగ్నమయ్యారన్నారు. నాడు-నేడు పేరుతో జగన్‌రెడ్డి 3500 కోట్లు దోచేశారని, నాడు (2018) టిడిపి ప్రభుత్వం నిర్వహించిన టెన్త్ పరీక్షల్లో 94.48 శాతం ఉత్తీర్ణత సాధిస్తే… నేడు 67.26 శాతం దిగజారడమేనా వైసీపీ ప్రభుత్వం సాధించిన ప్రగతి అని ప్రశ్నించారు.
బెండపూడిలో పదేళ్లుగా ప్రసాద్ అనే టీచర్ ఎన్నారైల సహకారంతో విద్యార్థినులను అమెరికన్ ఇంగ్లీషులో మాట్లాడేలా తీర్చిదిద్దితే ఆ ఘనత తన ఖాతాలో వేసుకున్న సీఎం… టెన్త్ దారుణ ఫలితాలకు కూడా బాధ్యత వహించాలన్నారు. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను తన మద్యం బ్రాండ్లు అమ్మే షాపులకి కాపలా పెట్టిన సీఎమ్మే దిగజారిన ఫలితాలకు ప్రధాన కారకుడని ఆరోపించారు. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకు సీపీఎస్ రద్దు, ఫిట్‌మెంట్ హామీలతో మోసగించడంతో వారు ఆందోళనలతో రోడ్డెక్కి బోధనకి దూరం చేసింది జగన్ సర్కారే అని మండిపడ్డారు. అధికారంలోకి రాకముందు ప్రతీయేటా మెగా డీయస్సీలో టీచర్ పోస్టులు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి తప్పిన సీఎం..ఈ మూడేళ్లలో ఒక్క కొత్త టీచర్‌ని కూడా భర్తీచేయకపోవడం వల్ల విద్యార్థులకి చదువు చెప్పేవారే లేక ఫలితాలు దారుణంగా వచ్చాయన్నారు. పరీక్షల వేళ విపరీతమైన కరెంటు కోతలు, పరీక్షా సమయం కుదింపు, పేపర్ లీక్, మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్‌లతో విద్యార్థులు మానసికంగా బాగా దెబ్బతిన్నారని, ఈ కారణాలు కూడా ఫలితాలపై ప్రభావం చూపాయన్నారు. మీడియం గందరగోళం, ఎయిడెడ్ పాఠశాలల రద్దు, పరీక్ష పత్రాల తయారీ విధానంలో లోపాలతో 20 ఏళ్లలో ఎన్నడూ రాని దారుణ ఫలితాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మఒడి ఇవ్వడానికి నిధుల్లేక, అప్పులు దొరక్క ఇప్పటికే వాయిదాలు వేసుకుంటూ వచ్చిన ప్రభుత్వం లబ్ధిదారులను తగ్గించే కుట్రలో భాగంగానే టెన్త్ ఫలితాల్లో అత్యధికుల్ని ఫెయిల్ చేసిందనే అనుమానాలున్నాయన్నారు. టెన్త్ ఎక్కువ మంది పాసైతే అమ్మ ఒడితోపాటు ఇంటర్-పాలిటెక్నిక్‌లో ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాల్సి వస్తుందని కుట్రతోనే అతి ఎక్కువమందిని ఫెయిల్ చేశారని ఆరోపించారు.
తెదేపా ప్రభుత్వ హయాంలో నిరంతర పర్యవేక్షణ, డీయస్సీల ద్వారా టీచర్ల కొరత తీర్చటం, వారికి ప్రమోషన్లు ఇవ్వటం, మెరుగైన పీఆర్సీ ఇవ్వటంవల్ల ఎంతో ఉత్సాహంగా పనిచేసిన టీచర్లు టెన్త్ పరీక్షల్లో ప్రతిసారీ 90శాతం పైనే ఫలితాలు సాధించడానికి కృషి చేశారని గుర్తు చేశారు. ఫలితాల విడుదలలో జాప్యంతోనే ఆందోళనకి గురయ్యారని, అనుకున్నట్టే ఫలితాలు దారుణంగా వచ్చాయన్నారు. ఒక్కరూ పాస్ కాని పాఠశాలలు 71 ఉన్నాయంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం అవుతోందన్నారు. ప్రభుత్వ చేతకానితనం, మూర్ఖత్వం, విద్యార్థుల సంక్షేమపథకాలు తగ్గించాలనే కుట్రకి లక్షలాది మంది విద్యార్థులు బలి అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది విద్యార్థులు ఫెయిల్ కావడం కాదు… ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని లోకేష్ ఆరోపించారు.