అమరావతి: పాఠశాలల్లో విద్యార్ధుల అడ్మిషన్ నుంచి ఫలితాల వెలువడించేంత వరకు ప్రతి దశలోనూ ప్రభుత్వం వైఫల్యం అయ్యిందని మాజీమంత్రి కెఎస్ జవహర్ దుయ్యబట్టారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రశ్నాపత్రాలు లీక్ చేసి విద్యార్ధుల జీవితాలతో ఆటలాడారు. మూడేళ్లుగా విద్యావ్యవస్థ ఎంత దారుణంగా ఉందో నేడు పదవ తరగతి ఫలితాలు చూస్తే అర్ధమవుతున్నాయని తెలిపారు. వైసీపీ పాలనలో మొట్ట మొదటి పదవ తరగతి ఫలితాలు కేవలం 67.26 శాతం మాత్రమే రావడం సిగ్గుచేటు. విద్యా ప్రమాణాలు దిగజారిపోయాయనడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదు. జగన్ రెడ్డి మొదటి రెండేళ్ల కరోనా ఉండటంతో నూటికి నూరు శాతం ఫలితాలు వచ్చాయి. కానీ నేడు అసలు రంగు బయటపడింది. కేవలం విద్యా శాఖా మంత్రి అహంతో విద్యార్ధుల ఫలితాలు ఆలస్యం చేసి అపహాస్యం చేశారు. 6.22 లక్షల మంది గాను 4,14,281 లక్షల మంది ఉత్తీర్ణత అంటే దాదాపు 2 లక్షల మంది విద్యార్ధుల భవిష్యత్తును అంధకారం చేశారు.
చంద్రబాబు నాయుడు హయాంలో 2018లో 94.48 శాతం ఉత్తీర్ణతో విద్యార్ధులు భవిష్యత్ కు బాటలు వేసుకున్నారు. నాణ్యమైన విద్యలో 3వ స్థానం నుంచి 19వ స్థానానికి దిగజార్చారు. పదవతరగతి విద్యార్ధులకు పరీక్షల సమయంలో సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది. నాడు-నేడు అంటూ రంగులు మార్చి పాఠశాలలను అడ్డం పెట్టుకొని దోచుకుంటున్నారు. స్కాలర్ షిప్పులను ఎగ్గొట్టి అమ్మఒడి పేరుతో ఇస్తూ నాన్న బుడ్డిగా మారుస్తున్నారు. జగన్ రెడ్డి చేతగాని పాలనతో విద్యార్ధుల భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టేస్తున్నారు. ఆంగ్ల మాధ్యమం మోజులో మాతృభాషకు తూట్లు పొడిచారు. 20వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేదు. ఒక్క డిఎస్సీ నిర్వహించలేకపోయారు. ఉపాధ్యాయులచే మద్యం షాపుల ముందు నిలబెట్టిన ఘనత జగన్ రెడ్డికే దక్కింది. కరోనా సమయంలో దాదాపు 1500 మంది ఉపాధ్యాయులు చనిపోతే జగన్ రెడ్డి వారి కుటుంబాలను ఆదుకోలేదు. జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారన్న కక్షతో కుట్ర పూరితంగా బయోమెట్రిక్ లు ఏర్పాటు చేశారు. పీఆర్సీ అమలు చేయమని, సీపీఎస్ రద్దు చేయమని కోరినందుకు వైసీపీ నాయకులు ఉపాధ్యాయులను అవమానాలకు గురిచేశారని జవహర్ పేర్కొన్నారు.