- ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం
- పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ఏఐ టెక్నాలజీ టూల్స్
- 2026-27 ఏడాదికి రూ.1,27,506 కోట్ల ఆదాయ లక్ష్యం
- ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి (చైతన్య రథం): కేంద్రంనుంచి రావాల్సిన నిధులను రాబట్టే ప్రయత్నాలను ముమ్మరం చేయడంతోపాటు… రాష్ట్రానికి వచ్చే సొంత ఆదాయాలను పెంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని… వీటి ద్వారా మరింత ఆదాయం పెంచుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. గురువారం సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. శాఖల వారీగా ప్రభుత్వానికి సమకూరుతోన్న ఆదాయాలపై చర్చించారు. 2026-27 ఆర్ధిక సంవత్సరంలో లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని వివిధ శాఖల అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సొంత ఆదాయాలు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.1,04,345 కోట్లుగా ఉంటే…2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,10,643 కోట్లుగా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ నుంచి రూ. 33,679 కోట్లు, గనులు శాఖ నుంచి రూ.10,300 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి రూ.11,047 కోట్ల మేర ఆదాయం వచ్చినట్టు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో స్టేట్ ఓన్ రెవెన్యూలో 6 శాతం మేర వృద్ధి నమోదైనట్టు చెప్పారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,27,506 కోట్ల మేర ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని దానికి అనుగుణంగా పని చేస్తున్నామని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…“గనులు, ఎక్సైజ్, స్టాంపులు రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నులు, రవాణా తదితర శాఖలు లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలి. ప్రభుత్వ ఆదాయంలో ప్రతీ రూపాయి సద్వినియోగం కావాలి. పొరుగు రాష్ట్రాల ఆదాయాలను విశ్లేషించి మన రాష్ట్రంలోనూ సొంత ఆదాయం పెంపునకు కృషి చేయాలి. ప్రతీ ఆదాయార్జన శాఖ పూర్తి సామర్ధ్యంతో పని చేయాలి. ఆదాయాన్ని కొల్పోయే పరిస్థితి ఎక్కడా ఉండకూడదు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. పెట్టుబడులు వస్తున్నప్పుడు టాక్స్ రెవెన్యూ పెరగాలి. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో లావాదేవీలు పెరుగుతున్నాయి. ఆదాయ లక్ష్యాలను చేరుకోవాలి. ఈవీ వాహనాల వినియోగం పెంచేలా చర్యలు చేపట్టాలి. సంప్రదాయ వాహనాల స్థానే ఈవీలను ప్రోత్సహించాలి. రిజిస్ట్రేషన్ శాఖలో ఎక్కడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆదాయం పెరిగే మార్గాలను అన్వేషించాలి. 22ఏ లాంటి భూ వివాదాలు పరిష్కారం అయితే రిజిస్ట్రేషన్ ఆదాయాలు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుత 2026-27 ఆర్ధిక సంవత్సరంలో 42 రోజుల్లో 38 శాతం మేర ఆదాయంలో గ్రోత్ ఉంది. ఇది శుభపరిణామం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
గ్రోత్ సెంటర్లుగా జిల్లాలు…
“పెట్టుబడులన్నీ సాకారమైతే ఆదాయాలు పెరుగుతాయి. కేంద్ర సహకారంతోపాటు సొంత ఆదాయాలను పెంచుకునేలా సామర్ధ్యాలను పెంచుకోవాలి. ప్రస్తుత పెట్టుబడులకు అనుగుణంగా జీవీఏ, ఆదాయాలు పెరగాలి. ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి. మొత్తంగా 30 శాతం ఆదాయం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంది. వ్యవస్థల్లో వినూత్నమైన విధానాలను అమలు చేయటం ద్వారా ఆదాయాలను పెంచుకోవచ్చు. జిల్లా యూనిట్‌గా గ్రోత్ రేట్ లక్ష్యాలను సాధిస్తే రాష్ట్రవ్యాప్తంగా లక్ష్యాలను సులువుగా సాధించే అవకాశం ఉంటుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో లక్ష్యాలను మనం అంతా కలిసి సాధిద్దాం. పెట్టుబడులకు అనుగుణంగా జీఎస్టీ లక్ష్యాలను ఎలా చేరుకోగలమో విశ్లేషించాలి. లీకేజీలు అరికట్టటంలో ఏఐ టూల్స్ వినియోగించాలి. ఏఐ డ్రివెన్ జీఎస్టీ రిటర్న్స్ స్క్రూటినీ చేయాలి. పన్ను ఎగవేతలు లేకుండా పన్ను వసూళ్లు చేసేలా టెక్నాలజీ వినియోగించాలి. పన్ను చెల్లింపుదారులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించండి. వేధింపులు లేకుండా పన్ను వసూళ్లు జరగాలి. టెక్నాలజీ వినియోగం ద్వారా పన్ను ఎగవేతలు.. నిబంధనల ఉల్లంఘనలను నివారించాలి. ప్రతీ ప్రభుత్వ శాఖ 360 డిగ్రీల్లో అంశాలను విశ్లేషించి ఆదాయ లక్ష్యాలను సాధించాలి. ఎక్సైజ్, గనులు, రవాణా శాఖలు ఏఐ టూల్స్ వినియోగించి ఎగవేతలను అరికట్టాలి. ఆదాయార్జన విషయంలో పూర్తి పారదర్శకంగా ఉండాల్సిందే. పొరుగు రాష్ట్రాల్లో వాహానాలు కొనుగోలు చేసి… ఇక్కడ రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు.. ఇక్కడే వాహానాలు కొనుగోలు చేసేలా మోటివేట్ చేయాలి” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
అంతర్జాతీయ మార్కెట్‌కు ఎర్రచందనం ఉత్పత్తులు
“ఎర్ర చందనం అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించేలా వాల్యూ అడిషన్ చేసి ఉత్పత్తులను తయారు చేయండి. ప్రపంచంలోనే అరుదైన వనరు మనకు ఆదాయం తెచ్చిపెట్టాలి. ప్రోఫెషనల్ టాక్స్ ను వసూలు చేసే విషయంలో చట్టసవరణ అంశాన్ని పరిశీలించాలి. ఇక్కడ పనులు చేసుకుంటూ పొరుగు రాష్ట్రాలకు ఆదాయం పోకుండా ఉండేలా చర్యలు చేపట్టాలి. యువతకు ఉపాధి, ఎంఎసఎంఈలు, ప్రాడెక్టు పర్ఫెక్షన్ వంటి అంశాలతో జీఎస్డీపీ, జీవీఏ సాధ్యం అవుతాయి. ఎకనమిక్ యాక్టివిటీ, జీవీఏ లక్ష్యాన్ని సాధించేలా ప్రతీ శాఖ సామర్ధ్యం పెంచుకోవాలి. ఖనిజాల వాల్యూ అడిషన్ జరిగితే మరింత ఆదాయం సమకూర్చు కోగలుగుతాం. రేర్ ఎర్త్ మినరల్స్ ద్వారా గనుల ఆదాయం బాగా పెరిగేలా చూడాలి. ఏ శాఖలోనూ ఆదాయం తగ్గకుండా చర్యలు తీసుకోవాలి. 24 గంటల్లో వాహనాల రిజిస్ట్రేషన్ జరిగిపోవాలి. పురపాలక శాఖలో పన్నులు స్టాండడైజేషన్, రేషనలైజేషన్ కావాలి. పన్నుల్లో వ్యత్యాసాలను తగ్గిస్తే చెల్లించేందుకు ప్రజలు ముందుకు వస్తారు. జీఐఎస్, డ్రోన్ సర్వేలతో పాటు ఉపగ్రహ చిత్రాలను వినియోగించి అనుమతులు, నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. ప్రతీ నెలా మున్సిపాల్టీలు, కార్పోరేషన్ల పరిధిలోని ఆస్తులను గుర్తించి పన్ను అసెస్మెంట్లను నిర్ధారించాలి. పంచాయితీరాజ్ శాఖలో అన్నీ ఆన్ లైన్ వసూళ్లు జరుగుతున్నాయి. గ్రామాల్లో ఇంటింటికీ కుళాయి పథకాన్ని కూడా ఇంటిగ్రేట్ చేయండి. ఏపీలోని వివిధ పంచాయితీలకు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న స్వచ్ఛాంధ్ర నిధులను త్వరితగతిన ఖర్చు చేస్తే..మరిన్ని నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. అర్బన్, రూరల్ స్థానిక సంస్థల్లో నిధులు ఖర్చు చేసి స్వచ్ఛ భారత్ లక్ష్యాలను సాధించాలి” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమీక్షకు సీఎస్ సాయిప్రసాద్, ఆర్ధిక, రవాణా, ఎక్సైజ్, గనులు, స్టాంపులు రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నులు, అటవీ, పురపాలక శాఖల అధికారులు హాజరయ్యారు.













