జగనన్న విదేశీ విద్యాదీవెనగా మార్పు
బయటపడిన జగన్ రెడ్డి నిజస్వరూపం
మండిపడుతున్న ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు
ఆ మేథావి పేరునే ఉంచాలని టీడీపీ డిమాండ్
అమరావతి: ప్రపంచ మేథావి, మానవహక్కుల దార్శనికుడు, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను సీఎం జగన్ రెడ్డి అవమానించారు. తప్పులుమీద తప్పులు చేసుకుంటూ పోతున్న జగన్ రెడ్డి మరో పెద్ద తప్పు చేశారు. జ్ఞానం ఉన్న ఏ వ్యక్తీ చేయని మూర్ఖపు పని చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 15 దేశాల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువుల కోసం రూ.15 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం’ ను ప్రవేశపెట్టారు. అంబేద్కర్ గొప్పతనానికి ప్రతీకగా ఈ పథకానికి ఆయన పేరు పెట్టారు. అలాగే, బీసీ, మైనార్టీ, ఈబీసీ, కాపు విద్యార్థుల విదేశీ విద్య కోసం ‘ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పథకం’ ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద బీసీ, మైనారిటీ విద్యార్థులకు రూ.15 లక్షలు, ఈబీసీ, కాపు విద్యార్థులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ రకంగా తెలుగుదేశం హయాంలో ఐదేళ్లపాటు మొత్తం 4,528 మంది విద్యార్థులకు విదేశీ విద్య కోసం రూ.377.7 కోట్ల ఆర్థిక సాయం చేశారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మూడేళ్లపాటు ఈ పథకాలను పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ పథకాలలోని మహనీయుడు, అనేక మంది దైవంగా భావించే అంబేద్కర్ పేరును, తెలుగు జాతి గర్వించదగిన వ్యక్తి ఎన్టీఆర్ పేరును తొలగించి ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’గా మార్పు చేశారు. దీంతో జగన్ నిజస్వరూపం బయటపడింది. అంబేద్కర్‌పై ఒలకబోసిన ప్రేమంతా ఏమైపోయింది? ఆయనపై ఎక్కడలేని అభిమానం ఉన్నట్లు కోనసీమ జిల్లా పేరుతో చేసిన రాద్ధాంతం ఏమైంది? ఇదంతా కపటనాటకం అని తేలిపోయింది. ప్రపంచ ప్రజలందరికీ తెలిసిన మేథావి అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14ను ఐక్యరాజ్యసమితి ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా ప్రకటించింది. కెనడా దేశం కూడా అంబేద్కర్ జయంతిని ‘యూనిటీ డే’గా ప్రకటించింది. అనేక విశ్వవిద్యాలయాలు ఆయన పేరుపై ఉన్నాయి. ప్రపంచంలోని అనే విశ్వవిద్యాలయాలు ఆయనకు ప్రత్యేక గౌరవాన్ని ఇస్తున్నాయి. జ్ఞానానికి, ఐక్యతకు, మానవ హక్కులకు ఆయనను ఓ ప్రత్యేక సింబల్ గా గుర్తిస్తారు.
అంతటి మేథావి పేరుపై ఉన్న పథకం పేరును ఎందుకు మార్చారో సమాధానం చెప్పవలసిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. జగన్ రెడ్డి తనను తాను అంతకు మించిన మేథావి అనుకుంటున్నారా? మన దేశం గర్వించదగ్గ మహావ్యక్తి అంబేద్కర్ ను ఆ పథకం నుంచి తొలగిస్తుంటే ప్రభుత్వ సలహాదారులు ఏం చేస్తున్నారు? వారు కూడా జగన్ రెడ్డిని అంబేద్కర్ ను మించిన మేథావి అనుకుంటున్నారా? దేశానికి స్ఫూర్తిప్రధాత అంబేద్కర్‌ని కాదని 420 కేసులున్న జగన్‌రెడ్డి పేరు పెడతారా?
ప్రపంచంలోని ఏ దేశ విశ్వవిద్యాలయమైనా ఈ పథకం పేరు చూడగానే ఇది భారతదేశంలోని ఏపీ ప్రభుత్వ పథకం అని ఇట్టే గుర్తుపట్టేస్తారు. దాంతో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదు. జగన్ రెడ్డి పేరు పెడితే ఈ ప్రపంచంలో ఎవరికి తెలుస్తుంది? అంబేద్కర్ పేరును ఈ పథకం నుంచి తొలగించడంపై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, దళితులు, అణగారిన వర్గాల వారు మండిపడుతున్నారు. దీనిని దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నారు. ఆ మహానేత పేరును తొలగించి తన పేరు పెట్టుకోవడం జగన్ రెడ్డి అహంకారానికి నిదర్శనంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అంబేద్కర్ ను దైవంగా భావించే వారందరినీ అవమానించినట్లేనన్నారు. ఈ పథకానికి అంబేద్కర్ పేరు పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ చర్యను కొన్ని ప్రజా సంఘాలు దేశ ద్రోహంగా పేర్కొన్నాయి. జగన్ అంటే విదేశీ విశ్వవిద్యాలయాల వారికి ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నాయి. మన రాష్ట్రంలో అంబేద్కర్ పేరుపై ఉన్న ఒకే ఒక పథకం పేరును మార్చడం అన్యాయం అని వారు ఎలుగెత్తిచాటుతున్నారు. ఆ పథకానికి అంబేద్కర్ పేరును కొనసాగించకపోతే మిమ్మల్ని సమాజం మొత్తం అంబేద్కర్ వ్యతిరేకులుగా భావిస్తుందని జగన్ రెడ్డిని ఉద్దేశించి వారు పేర్కొన్నారు. అలా కొనసాగించకుంటే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో పోరాడతామని హెచ్చరించారు. జగన్ రెడ్డి తీరు ఇలానే ఉంటే అన్ని వర్గాల ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారు. ఈ పథకానికి అంబేద్కర్ పేరు పెట్టాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.